వెలగపూడి అండ..పాతేశారు జెండా

19 Feb, 2018 11:41 IST|Sakshi
కాపులుప్పాడ పంచాయతీ పరిధి సోమన్నపాలెం గ్రామంలోని వివాదాస్పద భూమి

కాపులుప్పాడలో రూ.18 కోట్ల భూదందా

అభివృద్ధి చేస్తామని బడుగుల భూమి తీసుకుని ఆక్రమించిన వైనం

తప్పుడు డాక్యుమెంట్లతో దౌర్జన్యం

అదేమని ప్రశ్నిస్తే ఎదురు కేసులు

కేసు కోర్టులో ఉన్నా నిర్మాణ పనులకు శ్రీకారం

వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే ‘వర్గ’ భూదాహం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భీమునిపట్నం మండలం కాపులుప్పాడ పంచాయతీ పరిధిలోని సోమన్నపాలెం గ్రామంలో రైతులు మరుపిళ్ల అప్పలనాయుడు, సూరిబాబు, అప్పలస్వామి. పోతిన పాపాయమ్మ, మరుపిళ్ల రాంబాబు, మరుపిళ్ల అప్పలనరసయ్య, మరుపిళ్ల నరసయ్య, నరసాయమ్మ, మరుపిళ్ల తాతయ్యలుకు ఐదు ఎకరాల 90 సెంట్ల భూమి ఉంది. పూర్వీకుల నుంచి పిత్రార్జితంగా వచ్చిన భూమి 624/1981గా సర్వే నంబర్‌ 268/3లో 1.36 సెంట్లు, 269/2లో 1.90 సెంట్లు, 269/10లో 1.96 సెంట్లు, 269/11లో 0.36 సెంట్లు, 269/13లో 0.02 సెంట్లు మొత్తం 5.90 సెంట్లుగా నమోదై ఉంది. ఇరవై ఏళ్ల కిందట విశ్వసౌజన్య రియల్‌ ఎస్టేట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నిమ్మలకూడి వీర వెంకట(ఎన్‌వివి) సత్యనారాయణ ఆ రైతులను కలిశారు.

భూమి తీసుకుని లే అవుట్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. నమ్మిన రైతులు 73 సెంట్ల భూమి తమ వద్ద ఉంచుకుని... 1996లో కొంత భూమి, 1998లో మరికొంత భూమి మొత్తంగా 5ఎకరాల 17సెంట్ల భూమిని జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ(జీపీఏ)గా అతనికి రాసిచ్చి బతుకు దెరువుకోసం విజయవాడ పాతబస్తీకి వలస వెళ్లిపోయారు. సదరు రియల్టరు మాత్రం ఆ భూమి ఇక్కడ అభివృద్ధి చేయకుండా కొన్నాళ్లు.. కొన్నేళ్లు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. 2010లో విజయవాడ నుంచి తిరిగి సోమన్నపాలెం వచ్చేసిన ఆ రైతు కుటుంబాల సభ్యులు ఎన్‌వివి సత్యనారాయణను కలిశారు. ఆ భూమి తీసుకుని మాకేమీ ఇవ్వలేదు.. అలాగని ఆ భూమి కూడా అభివృద్ధి చేయలేదు.. అని ప్రశ్నిస్తే.. అసలు మీరెవరని ఎదురుతిరిగాడు. ఒక్కసారిగా షాక్‌ తిన్న సదరు రైతులు తేరుకుని కాస్త గట్టిగా అడిగితే... ఆ భూమే తనదేనని, కొనుగోలు చేసుకున్నట్టు పత్రాలు కూడా ఉన్నాయని, మీరేం చేసుకుంటారో చేసుకోండని అడ్డం తిరిగాడు.

అవి తప్పుడు పత్రాలే..
పెద్దగా చదువుకోని ఆ రైతులు న్యాయవాదిని సంప్రదించి మొత్తం భూ వివరాలు తీయిస్తే అసలు మోసం బయటపడింది. 35/1996 జీపీఏగా 1016 చదరపు గజాల భూమిని జనరల్‌ పవర్‌ రాస్తే 3332.66 చదరపు గజాల భూమికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని, 1426/1988 జీపీఏగా 2032 చదరపు గజాలకు జీపీఏ రాస్తే 4466.66 చదరపు గజాలకు పోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని మరుపిళ్ల అప్పలస్వామి, మరుపిళ్ల సూరి బాబు, అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు తెలిసింది. ఈ విషయమై విశాఖపట్నం 7వ సీనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో పిటిషన్‌ వేయగా, ఒ.ఎస్‌.నంబర్‌.1352/2015, ఐ.ఎ.నంబర్‌ 612/2015గా మొత్తం 5.17 సెంట్ల భూమిపై ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చారు. సత్యనారాయణగాని, అతని అనుచరులుగాని, అతని ఏజెంట్లగాని ఎవరూ ఆ భూమిలోకి ప్రవేశించరాదని కోర్టు ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు. కాని సత్యనారాయణ అతని అనుచరులు భూమిలోకి పదే పదే చొరబడటంపై మరుపిళ్ల కుటుంబసభ్యులు భీమిలి పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు అది సివిల్‌ వ్యవహారమని పట్టించుకోకపోవడంతో చివరికి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 172/2017, 238/2017గా సదరు సత్యనారాయణపై 420 కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.

కోర్టు ఉత్తర్వులున్నా లెక్కచేయక :దౌర్జన్యంతో భూ ఆక్రమణ.. అప్పలస్వామి
ఈ ఏడాది జనవరి 6న సత్యనారాయణ అనుచరులు పెద్దసంఖ్యలో భూముల్లోకి చొరబడి సోలార్‌పంపుసెట్లు, కొబ్బరితోటలు ధ్వంసం చేసి నానా బీభత్సం చేశారంటూ మరుపిళ్ల కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు అది సివిల్‌ మేటర్‌ అంటూ పట్టించుకోలేదని బాధిత రైతులు చెబుతున్నారు. కోర్టు ఉత్తర్వులున్నా.. స్థలంలో రోడ్డు వేసేందుకు రంగం సిద్ధం చేశారని మరుపిళ్ల అప్పలస్వామి చెప్పుకొచ్చారు.

వెలగపూడి పేరు చెప్పి బెదిరిస్తున్నారు: మరుపిళ్ల రామారావు
సత్యనారాయణకు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. మేము ఎంత చెబితే ఆయన అంత.. నడుస్తోం ది మా రాజ్యం.. మమ్మల్ని ఏమీ చే యలేరంటూ సత్యనారాయణ, అతని అనుచరులు మ మ్మల్ని ఎన్నోసార్లు బెదిరించారు. వాళ్లు అన్నట్టుగానే పోలీసులు మా ఫిర్యాదులేమీ పట్టించుకోవడం లే దు.. పైగా తనపై అన్యాయంగా రౌడీషీట్‌ ఓపెన్‌ చేశా రు.. ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నప్పటికీ భూముల్లో చొరబడుతున్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. అని మరుపిళ్ల అప్పలనరసయ్య కుమారుడు రామారావు చెప్పుకొచ్చా రు. వారి అరాచకాలకు సీసీ ఫుటేజీ రూపంలో తమ వద్ద సాక్ష్యాలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు