పర్రభూములకు ఎర

13 Sep, 2016 23:47 IST|Sakshi
  • తమ్ముళ్ల ‘భూ’బాగోతం
  • అక్రమార్కుల కొమ్ము కాస్తున్న ముఖ్యనేతలు 
  • 12 ఎకరాల ట్రయల్‌ రన్‌ సక్సెస్‌
  • మిగిలిన 100 ఎకరాల భూమిపై ఇద్దరు నేతల కన్ను
  • అవకతవకలకు సహకరించిన వెబ్‌ల్యాండ్‌ 
  • ఆర్డీఓ దర్యాప్తుతో బయటపడినా పైరవీలు
  •  
    పెద్ద చేపను పట్టుకోవాలంటే చిన్న చేపకు గాలం వెయ్యాలి. అదే సూత్రం భూముల హస్తగతానికి ఎంచక్కా వాడుకుంటున్నారు కాకినాడకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు. పదో, పాతిక  ఎకరాలు కాదు ఏకంగా వంద ఎకరాలపై వీరి కన్ను పడింది. ఆ భూమిని ఆక్రమించి అధికారులు ముందు భంగపడేకన్నా అందులో ఉండే లొసుగులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ ప్రాంతానికి చెందిన కొంతమందితో ముందస్తుగా ఆక్రమించజేసి ... పూర్వార్జితం పత్రాలు చూపించి రిజస్ట్రేషన్‌ సిబ్బందిని మభ్యపెట్టి ఆ తంతు ముగింపజేశారు. వెబ్‌ల్యాండ్‌ లొసుగులు ఆధారంగా అవినీతి ముసుగేసేశారు. ఇక అదే దారిలో మిగిలిన 100 ఎకరాలను బినామీల పేరుతో రిజస్ట్రేషన్లు చేయించాలని అనుకున్నారు. ఇంతలో తొలి గాలంపై ఫిర్యాదులు వెళ్లడంతో కాకినాడ ఆర్డీఓ దర్యాప్తు చేయడం, ఆక్రమణ, రిజస్ట్రేషన్లు అక్రమమైనవేనని నిర్ధారించడంతో సక్రమంగా మార్చే పనిలో ఈ నేతలు పడ్డారు. అంతా సర్దుబాటయ్యాక వంద ఎకరాలకు బాటలేసుకోడానికి పైరవీలు ప్రారంభించారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    తెలుగు తమ్ముళ్లు సముద్ర తీరాన్నే మింగేస్తున్న వ్యవహారం బయటపడటంతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్రమ రిజిస్ట్రేషన్‌తో అందినంతా దోచేసిన రిజిస్ట్రేషన్‌ శాఖాధికారులను కొమ్ము కాసేందుకు టీడీపీ నేతలు తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అధికారం అండ చూసుకుని భూములనే కాదు చివరకు సముద్ర తీరాన్ని కబ్జా చేయడమే కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించేసుకున్నారు. వివరాల్లోకి వేళ్తే... కాకినాడకు కూతవేటు దూరంలో కరప మండల పరిధిలో ఉప్పలంక సముద్ర పర్ర భూములు తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిగా చూపించి ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లు రిజిస్ట్రేషన్‌లు చేయించేసుకున్న వైనం ఇటీవల బయటపడింది. ఉప్పలంకలో ఉన్న 120 ఎకరాల పర్రభూముల్లో 12 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ అనేది ముందస్తు ట్రైల్‌ రన్‌గా కనిపిస్తోంది. ఈ రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా పూర్తవడంతో రెండో విడతలో అధికార పార్టీకి చెందిన కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ఉన్న ఇద్దరు ప్రజాప్రతినిధిలు మిగతా 108  ఎకరాలు కాజేయడానికి పావులు కదుపుతున్నారు.
     
    బయటపడిందిలా...
    కరప మండలం గురజనాపల్లిలో సుమారు 120 ఎకరాలు ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అందులో 12.50 ఎకరాల భూమిని కొంతమందితో ఆక్రమింపజేశారు. చట్టంలో లొసుగుల ఆధారంగా పూర్వార్జితంగా చూపి, దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్‌ చేయింపజేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో కాకినాడ ఆర్డీఓ అంబేడ్కర్‌ ఇటీవల విచారణ చేపట్టారు. అవి అక్రమ రిజిస్ట్రేషన్లుగా ప్రాథమికంగా తేల్చారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌కు ఇచ్చే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసిన తాళ్లరేవు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే వీలుండడంతో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్‌ నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు ఉన్నత స్థాయిలో ప్రయత్నాలకు తెరదీశారని తెలియవచ్చింది. ఇందులో వారి స్వా ర్థం లేకపోలేదు. తొలి విడతగా 12 ఎకరాలు రిజిస్ట్రేషన్‌ విజయవంతంగా జరిగిపోవడంతో మిగిలిన భూమిని ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సొంతం చేసుకోవాలని ఎత్తుగడ వేశారు. తొలుత జరిగిన తంతులో ఏ ఇబ్బందీ తలెత్తకపోతే మిగిలిన భూమి స్వాహా చేయడానికి భారీ కసరత్తు జరుగుతోంది.
     
    తొలిగాలం ఇలా...
    ఈ మొత్తం వ్యవహారానికి కాట్రేనికోన మం డలం పల్లం గ్రామం కేంద్రంగా మారింది. ఈ గ్రామంలోని కొంతమందిని తొలి గాలంగా వాడుకున్నారు. గురజనాపల్లి సర్వేనంబరు 106/1ఎలో పూరా 65.02 సెంట్లభూమిలో పల్లం గ్రామానికి చెందిని మల్లాడి పెదస్వామి(లేటు) కుమారుడు మల్లాడి సత్యం, మల్లాడి కాసులయ్య, మల్లాడి కాసురాజు, మల్లాడి సత్యం కుమార్తె బలుసుతిప్ప గ్రామానికి చెంది న పినపోతు ధనకుమారిలు పారీఖతు ్త(విడిపోయినట్టు) దస్తావేజు రాసుకున్నారు. వీరిలో ఒకరికి 10.50 ఎకరాలు (50,820 చదరపు గజా లు) మిగిలిన నలుగురికిS 0.50 సెంట్లు లేదా 2,420 చదరపు గజాలుగా రాసుకున్నారు. చదరపు గజానికి రూ.1,500లు విలువకట్టి దానిప్రకారం ఎవరి వాటాకు ఎంతో పేర్కొంటూ మొత్తం విలువ రూ.9,07,50,000లుగా చూపించి స్టాంపు డ్యూటీ రూ.1,45,200లు, రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.1000లు, యూజర్‌ ఛార్జి రూ.1000లు...మొత్తంగా రూ.1,47,200లకు తాళ్లరేవు ఎస్‌బీఐలో చలానాతీసి మరీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిపై స్థానికులు కరప తహశీల్దార్, కాకినాడ కలెక్టరేట్‌లో ఫిర్యాదుచేసిన నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చింది. 
     
    వెబ్‌ ల్యాండ్‌ లొసుగుతో అవినీతి ముసుగు...
    భూమి కొనుగోలుచేసినా, పూర్వార్జితం ఆస్తిని పంచుకున్నా, దానం చేసినా ఆ భూమికి పాత దస్తావేజులు, పాస్‌ పుస్తకాలు, 1బీ అడంగళ్‌ వివరాలు చూపించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రిజిష్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసే భూమి వివరాలను వెబ్‌ల్యాండ్‌లో తనిఖీచేసి, అన్ని ఆధారాలు సరిచూసుకుని రిజిస్ట్రేషన్‌ చేస్తారు. అయితే ఇందులో ఉన్న అనేక మతలబులు ఆధారంగా వీరు ఆ భూములను రిజిస్టర్‌  చేయించుకున్నారు. మొదటి మతలబు వెబ్‌లాండ్‌. రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ చంద్రబాబు సర్కార్‌ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న వెబ్‌లాండ్‌ విధానం. వెబ్‌లాండ్‌లో ఈ 12 ఎకరాలు మెరకచేసిన ఇళ్ల స్థలాలుగా కనిపిస్తోంది. ప్రభుత్వ భూమి అయితే ఈ సర్వేనంబర్‌ బ్లాక్‌ అయి ఉంటుంది. అలా లేదు కాబట్టే రిజిస్ట్రేషన్‌ చేశామని తాళ్లరేవు రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు తమ తప్పు లేదన్నట్టు చెప్పుకొస్తున్నారు. సహజంగా గ్రామకంఠం, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకుంటేlదస్తావేజులు, పాస్‌పుస్తకాలు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేసే వెసలుబాటుంది. వ్యవసాయ భూమిని ఎకరాల్లో చూపిస్తే అందుకు డాక్యుమెంట్లు ఇవ్వాలి. అదే చదరపు గజాలలో చూపించి పంచుకున్నా, అమ్ముకున్నా  లింక్‌ డాక్యుమెంట్లు, పాత దస్తావేజులు అవసరం లేకుండానే రిజిస్ట్రేషన్‌ జరిగిపోతుంది. ఈ భూమి ఎలా సంక్రమించిందంటూ రిజిస్ట్రార్‌ అడిగినా పూర్వార్జితం, పాత దస్తావేజులు లేవని చెప్పి రిజిస్ట్రేషన్‌ చేయించేసుకునే వెసలుబాటు ఉంది. వీటన్నింటినీ చూసుకోవాల్సిన బాధ్యత రిజిస్ట్రార్లపె ఉంటుంది. కానీ ఇవేమీ చూడకుండానే అధికారపార్టీ పెద్దలు వెనుక ఉన్నారనే ఏకైక కారణంతో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌లు చేసేశారు.
     
    అంతా సక్రమమేనండీ...
    ఉప్పలంకలోని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నవారికి ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారని తాళ్లరేవు సబ్‌రిజిస్ట్రార్‌ పీఎస్‌ఆర్‌ మూర్తిని వివరణకోరగా నిబంధనలకనుగుణంగానే చేశామన్నారు. ప్రభుత్వ స్ధలమైతే వెబ్‌ల్యాండ్‌లో బ్లాక్‌గా చూపిస్తుందన్నారు. అలాకాకుండా ఇళ్ల స్ధలాలుగా ఉండటంతో నిబంధనలకు లోబడే రిజిస్ట్రేషన్‌ చేశామన్నారు.
     
మరిన్ని వార్తలు