'శ్రీమంతుడు' విలన్ల తరహాలోనే..!

13 Feb, 2016 11:05 IST|Sakshi
'శ్రీమంతుడు' విలన్ల తరహాలోనే..!

భూపరిహారం నొక్కేసే యత్నం
నెల్లూరు జిల్లాలో ‘భూ’ విలన్లు
కావలిలో అధికార పార్టీ అన్నదమ్ముల బాగోతం
బినామీ పేర్లతో పేదల భూములు కైవసం
పరిహారం కోసం రికార్డులన్నీ తారుమారు
నేతలకు వంతపాడుతున్న అధికారులు

 
సాక్షి టాస్క్‌ఫోర్స్, నెల్లూరు: ఒక పేద మహిళకు ప్రభుత్వం రెండెకరాలు భూమి కేటాయించింది. ఆ భూమిలో వ్యవసాయం కోసం బ్యాంకులో అప్పు కూడా తీసుకుంది. ఇంతలో భూమి కావాల్సి వచ్చి ప్రభుత్వం సేకరణకు సిద్ధమైంది. అంతే.. ఆ రెండెకరాల భూమికి సంబంధించి రైతు పేరు మారిపోయింది. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నొక్కేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఇదంతా శ్రీమంతుడు సినిమాలో విలన్లు చేసిన పనిగా ఉంది కదా! అచ్చం అలాంటిదే నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వందలాది ఎకరాల పేదల భూములను బినామీ పేర్లతో స్వాహా చేసేందుకు వ్యూహం పన్నారు. కావలి నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం దామవరంలో 1,075 ఎకరాలు, కొత్తపల్లి కౌరుగుంటలో 323 ఎకరాలు సేకరిస్తున్నారు. వీటిలో పట్టా భూములతో పాటు అసైన్‌మెంట్, డీఫారం, ప్రభుత్వ భూములున్నాయి. పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ మరో 716.41 ఎకరాలు సేకరిస్తోంది. ఇందులో ఉలవపాళ్లలో 400 ఎకరాలు, కొత్తపల్లి కౌరుగుంటలో 192, ఊచగుంటపాళెంలో 124.41 ఎకరాలు సేకరిస్తోంది. ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ పరిహారాన్ని మొత్తం నొక్కేసేందుకు కావలి నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు పేదలకు గతంలో మంజూరు చేసిన భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకుంటున్నారు. అనుచరులు, స్థానికేతరులను జాబితాలో చేర్చి వందలాది ఎకరాలు పక్కదారి పట్టించారు. రెవెన్యూ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రికార్డులన్నీ తారుమారు చేశారు.

నైస్‌గా కాజేసే వ్యూహం..
కౌరుగుంటకు చెందిన దేవరకొండ కావమ్మకు సర్వేనంబర్ 290-3లో ప్రభుత్వం గతంలో రెండెకరాల భూమి ఇచ్చింది. ఆ భూమిపైన అల్లూరు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆమె రూ. 44 వేలు క్రాప్‌లోన్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏపీఐఐసీ భూ సేకరణలో ఆ భూమి కావమ్మ పేరున కాకుండా బెల్లంకొండ శీనయ్య పేరు వచ్చి చేరింది. రెవెన్యూ అధికారులు నోటీసుల్లో ఈ విషయం తెలుసుకున్న కావమ్మ భోరుమంటోంది. పరుశురాం జానకిరామయ్య అనే వ్యక్తికి 298-3లో ఎఫ్‌డిఎస్ నంబర్ 208-1407లోరెండెకరాల భూమిని ఇచ్చినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. అసలు భూమి మంజూరు చేసిన విషయమే జానకిరామయ్యకు తెలియదు. భూసేకరణ అభ్యంతరాలపై నోటీసు రావడంతో జానకిరామయ్య అవాక్కయ్యాడు. ఇక భూమిని తానే ఇంకొకరికి విక్రయించినట్లు అధికారులు నోటీసులో పేర్కొనడంతో నిర్ఘాంతపోయాడు. వాస్తవానికి జానకిరామయ్య పేరుతో రికార్డులు తారుమారు చేసి.. తమకు ఆ భూమి విక్రయించినట్లు భూ విలన్లు డాక్యుమెంట్లు తయారు చేశారు. ప్రభుత్వమిచ్చే పరిహారాన్ని నొక్కేసేందుకే ఇలా చేశారు.

మరిన్ని వార్తలు