రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతోనే భూ సమస్యలు

25 Mar, 2017 23:01 IST|Sakshi
రిజిస్ట్రేషన్‌ లేకపోవడంతోనే భూ సమస్యలు
శ్రీశైలం ప్రాజెక్టు: వ్యవసాయ, నివాసిత భూములను రిజిస్ట్రేషన్‌ చేయించకపోవడం వల్లే న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయని జిల్లా జడ్జి, న్యాయసేవా సాధికార సంస్థ చైర్‌ పర్సన్‌ అనుపమ చక్రవర్తి అన్నారు. శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ భవనంలో న్యాయ సలహాలు–సమీక్ష–చట్టాల అవగాహనపై శనివారం వర్క్‌షాప్‌ ప్రారంభమైంది. మూడు రోజులుపాటు వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి గిరిజన, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన యువకులు హాజరయ్యారు.
 
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి మాట్లాడుతూ.. స్వాధీనంలో ఉండి పట్టాలు లేకపోవడం, పట్టా ఉండి భూమి ఎక్కడ ఉందో తెలియకపోవడం, అనుభవంలో ఉండి పట్టా ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో లేకపోవడం వల్ల అనేక వాజ్యాలు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నాయన్నారు.  న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పట్టాను కలిగి ఉండడంతో పాటు ప్రభుత్వ రికార్డులు నమోదు చేయించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని తెలిపారు. వ్యవసాయ, నివాసిత, అసైన్డ్, గ్రామ కంఠాలు, శ్మశానాలు, కమ్యూనిటీ స్థలాలు, రోడ్లు వంటి భూములపై సందేహాలను నివృత్తి చేశారు. పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌ డీడ్, అడంగళ్, అటవీ భూ హక్కుల చట్టం వంటి వాటిపై రీసోర్స్‌ పర్సన్స్‌ వివరించారు. అధికారిక లెక్కల ప్రకారం 46 శాతం మంది భూమి కలిగి ఉన్నారని, 54శాతం మంది భూమిలేనివారుగా ఉన్నారని పేర్కొన్నారు.
 
వివిధ ప్రాంతాల్లో పర్యటనలు జరిపి భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తే లక్షల సంఖ్యలో తెల్లకాగితాల పైనే భూముల కొనుగోలు, అమ్మకాలు జరిగాయని, ఇటువంటి లావాదేవీల వల్ల న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయని వారు పేర్కొన్నారు. వర్క్‌షాపులో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎంఎ సోమశేఖర్, రీసోర్స్‌ పర్సన్స్‌ పి. రమేష్, టి. రాజేష్‌కుమార్, ఎం. సునీల్‌కుమార్, ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.   
 
>
మరిన్ని వార్తలు