భూములు ఇచ్చేది లేదు..

23 May, 2017 23:49 IST|Sakshi
  • సంతకాలు పెట్టని రైతులు
  • స్వాధీనం తీసుకుంటామన్న సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌
  • పురుషోత్తపట్నం పథకం భూసేకరణ ప్రహసనం
  • సీతానగరం (రాజానగరం) :
    భూములు ఇచ్చేది లేదని, ప్రాణత్యాగానికైనా సిద్ధమవుతామని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ భూసేకరణకు సంతకాలు చేయని రైతులు ఖరాఖండీగా చెప్పారు. పురుషోత్తపట్నం పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం ఆవార్డు ఎంక్వైరీ గ్రామసభలో రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ పాల్గొన్నారు. భూసేకరణ సమయంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ ఎకరానికి రూ.40 లక్షలు డిమాండ్‌ చేయమని చెప్పారని, అయితే ఎకరానికి రూ.28 లక్షలు ప్రకటించారని, అందుకే కోర్టును ఆశ్రయించామని రామచంద్రపురానికి చెందిన రైతు కలగల బాలకృష్ణ తెలిపారు. భూసేకరణ చట్టం-2013 ప్రకారం కూలీలు జీవనోపాధి కల్పించాలని, ఎకరానికి రూ.40 లక్షలు ఇవ్వాలని కొండ్రు రమేష్, చల్లమళ్ళ విజయభాస్కర చౌదరి, కరుటూరి శ్రీనివాస్‌ తదితరులు డిమాండ్‌ చేశారు. చట్ట ప్రకారం రూ.15 లక్షల నుంచి రూ.19 లక్షలు కోర్టులో జమ చేస్తామని అంటున్నారని, మరి ఎకరానికి రూ.28 లక్షలు ఏవిధంగా ఇస్తారని రైతులు నిలదీశారు. ముందు భూములను స్వాధీనం చేసినందుకు ఎకరానికి రూ.28 లక్షలు ఇస్తామని సబ్‌ కలెక్టర్‌ వివరించారు. 
     
    వారంలో స్వాధీనం చేసుకుంటాం...
    వారం రోజులలో చట్ట ప్రకారం భూములను స్వాధీనం చేసుకుంటామని, సంతకాలు చేయని రైతులకు కోర్టులో పరిహారం జమ చేస్తామని సబ్‌ కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ తెలిపారు. గ్రామసభలో సంతకాలు పెట్టని రైతుల సమస్యలపై స్పందించనని అన్నారు. చట్ట ప్రకారం అయితే రైతుల అంగీకారంతో భూములు తీసుకోవాలని, దౌర్జన్యంగా రైతులు భూములు తీసుకుంటామని తెలుపుతున్నారని రైతులు ప్రాణత్యాగానికైనా సిద్ధమని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ డీఈ వెంకట్రావు, తహసీల్దార్‌ చంద్రశేఖరరావు, ఆర్‌ఐ సుధాకర్‌, మెగా ఇంజనీరింగ్‌ మేనేజర్‌ శివరామకృష్ణ, జల వనరుల శాఖ ఏఈఈ కృష్ణప్రసాద్, డిప్యూటీ తహాసీల్దార్‌ నండూరి శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు