మెట్రోకు భూములు ఇస్తాం

10 Nov, 2016 23:54 IST|Sakshi
మెట్రోకు భూములు ఇస్తాం


విజయవాడ : జిల్లా ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తారని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మెట్రోరైలు ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్‌ బాబు.ఎ చెప్పారు. స్థానిక కలెక్టర్‌ చాంబర్‌లో గురువారం అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ, జర్మనీకి చెందిన ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ కృష్ణా–గోదావరి నదుల అనుసంధానం, దుర్గా ఫ్లై ఓవర్‌ నిర్మాణం, బైపాస్‌ రోడ్డు తదితర ఎన్నో అభివృద్ధి పనులకు భూమిని సేకరించామని తెలిపారు. ఇందుకు ప్రజలు మద్దతు పలికారని పేర్కొన్నారు. మెట్రో ప్రాజెక్టుకు సుమారు 69ఎకరాలను సేకరించాల్సి ఉందని చెప్పారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విజయవాడ అర్బన్, రూరల్‌ మండలాల పరిధిలోని 11గ్రామాల్లో మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలైన్‌మెంట్‌ డిజైన్‌ రూపొందించామన్నారు. ప్రతినిధి బృందం అడిగిన ప్రశ్నలకు కలెక్టర్‌ బదులిస్తూ సంబంధిత భూముల యజమానులతో చర్చలు కూడా జరిపామని చెప్పారు. అమరావతి మెట్రో ప్రాజెక్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌పీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యంత తక్కువ వ్యవధిలో విజయవాడ నగరంలో ముఖ్యమైన రద్దీ ప్రాంతంలో 21 రోజుల్లోనే భూసేకరణ చేపట్టిన ఘనత కృష్ణా జిల్లా కలెక్టర్‌కు దక్కుతుందన్నారు. మున్సిపల్‌ కమీషనర్‌ జి.వీరపాండియన్‌ మాట్లాడుతూ నగరాన్ని సిస్కో సంస్థ భాగస్వామ్యంతో స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ నగరం వరకు గ్రీనరీ అభివృద్ధి చేశామని వివరించారు. నగరంలో 95,580 వీధి లైట్లను స్మార్ట్‌ లైటింగ్‌ విధానంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. తద్వారా రోజూ 45శాతం విద్యుత్‌ను పొదుపు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జర్మనీ ఏఎఫ్‌డీ అధికారిక బృందం సభ్యులు రిమాలీ కోజిక్, మాడ్యువెర్‌డూర్, ఉషారావ్, రాబర్ట్‌ వాల్‌కోవిక్, ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డి.రాధాకృష్ణారెడ్డి, డీఆర్‌ఓ సీహెచ్‌ రంగయ్య, విజయవాడ తహసీల్దార్‌ ఆర్‌.శివరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు