సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులే అతడి టార్గెట్

5 Aug, 2016 11:35 IST|Sakshi
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులే అతడి టార్గెట్

నెల్లూరు:
బస్సుల్లో ల్యాప్‌టాప్‌లు అపహరిస్తున్న ఇద్దరు దొంగలను నాల్గోనగర పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 29 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ విశాల్‌గున్నీ నిందితుల వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన బిట్రగుంట సురేష్‌ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. బెంగళూరులోని సటిక్స్‌–ఎన్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. అప్పటికే వ్యసనాలకు బానిసవడంతో సంపాదన సరిపోయేది కాదు. ఉద్యోగానికి సరిగా వెళ్లకపోవడంతో కంపెనీ అధికారులు అతన్ని మందలించడంతో ఉద్యోగం మానివేశాడు. తక్కువ సమయంలో నగదు సంపాదించి తానే సొంతగా కంపెనీ పెట్టాలని దొంగగా అవతారమెత్తాడు. 


రాత్రి వేళల్లో చిత్తూరు నుంచి బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సు ఎక్కి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులు పక్కసీటు సమీపంలోనే కూర్చొనేవాడు. వారితో మాటలు కలిపి వివరాలను సేకరించేవాడు. వారు నిద్రలో జారుకున్న వెంటనే ల్యాప్‌టాప్‌లను అపహరించి మార్గమధ్యలో బస్సు దిగేసేవాడు. ఆ ల్యాప్‌టాప్‌లను అమ్మి సొమ్ము చేసుకునేవాడు. చిత్తూరు పోలీసులు అనుమానంతో అతని కదలికపై నిఘా పెట్టారు. ల్యాప్‌టాప్‌ల చోరీ కేసులో అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. 2014లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ల్యాప్‌టాప్‌లను నెల్లూరు బాలాజీనగర్‌లోని తన బావ లక్ష్మణ్‌రాజు ద్వారా అమ్మడం ప్రారంభించారు. ఇటీవల కాలంలో నెల్లూరులో ల్యాప్‌టాప్‌ దొంగతనాలు అధికం కావడంతో నాల్గోనగర పోలీసులు నిఘా ఉంచారు. గురువారం సురేష్‌ తన బావతో కలిసి ల్యాప్‌టాప్‌ను అమ్మేందుకు ఆచారివీధిలోని అభిరామ్‌ హోటల్‌ వద్ద వెళుతుండగా నాల్గోనగర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా నేరాలు అంగీకరించారు. దీంతో నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ. 9 లక్షలు విలువ చేసే 29 ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను చాకచక్యంగా అరెస్ట్‌ చేసిన నగర డీఎస్పీ జి. వెంకటరాముడు, నాల్గోనగర ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య, ఎస్‌ఐలు అలీసాహెబ్, రఘునాథ్‌ హెడ్‌కానిస్టేబుల్స్‌ పోలయ్య, సురేష్‌కుమార్, కానిస్టేబుల్స్‌ మహేంద్రనాథ్‌రెడ్డి, వేణు, రాజేంద్ర, శ్రీకాంత్, శివకష్ణను ఎస్పీ అభినందించారు. రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బి. శరత్‌బాబు, నగర  డీఎస్పీ జి. వెంకటరాముడు, నాల్గోనగర పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు