ఆదిమానవుల పే..ద్ద సమాధి!

26 Jun, 2016 14:03 IST|Sakshi
ఆదిమానవుల పే..ద్ద సమాధి!

నల్లగొండ జిల్లా ఎర్రగడ్డగూడెం శివారులో వెలుగులోకి..
దేశంలోనే అతి పెద్దదంటున్న  కొత్త తెలంగాణ చరిత్ర బృందం
72 మీటర్ల చుట్టుకొలతతో సమాధి.. దానిపై వృత్తాకారంలో 50 గండ శిలలు
ఇది ఆదిమానవుల తెగ నేతదని చరిత్రకారుల వెల్లడి

హైదరాబాద్: దేశంలోనే అతి పెద్దదిగా భావిస్తున్న బృహత్ శిలాయుగపు మానవ సమాధి వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎర్రగడ్డగూడెం శివారు చెలకల్లో ఈ సమాధి బయటపడింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం మూడు రోజుల క్రితం దీన్ని పరిశీలించి ఆదిమానవులకు సంబంధించి ఇంతటి విశాలమైన సమాధి జాడలు ఇప్పటివరకు దేశంలో రికార్డు అయిన దాఖలాలు లేవని తేల్చింది. 72 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న ఈ సమాధిపై ఏకంగా 50 గండ శిలలు వరుసగా పేర్చి ఉన్నాయి. సమాధికి గుర్తుగా పెద్దపెద్ద రాళ్లను వృత్తాకారంలో ఏర్పాటు చేయటం ఆదిమానవుల కాలం నాటి ఆనవాయితీ. అలా వరసగా పేర్చిన రాళ్లు కనిపిస్తే అది ఆదిమానవుల సమాధి అని సులభంగా గుర్తించొచ్చు. ఇలాంటి ఆకృతులు తెలంగాణలో విరివిగా కనిపిస్తాయి. కానీ వాటిల్లో 12, 14, 18, 24.. సంఖ్యలో వృత్తాకారంలో రాళ్ల వరస కనిపిస్తుంది. కానీ తాజాగా వెలుగుచూసిన సమాధిలో 50 రాళ్లను వాడటం విశేషం. గతంలో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామ శివారులో 50 మీటర్ల చుట్టుకొలతతో కూడిన ఓ సమాధి వెలుగుచూసింది. అలాగే పురావస్తు విభాగం సర్వేలో కరీంనగర్ జిల్లా నర్మెటలో 20 మీటర్ల వ్యాసంతో ఉన్న సమాధి బయటపడింది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు వెలుగుచూసిన అతిపెద్ద సమాధులివే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40-50 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న సమాధుల జాడలు కనిపించినా 70 మీటర్ల కన్నా ఎక్కువ వ్యాసంతో ఉన్న సమాధి వెలుగుచూడలేదని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు హరగోపాల్, మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు.  గ్రామ సర్పంచ్ నర్సిరెడ్డి, పజ్జూరు గ్రామ ఔత్సాహికుడు మురళి సాయంతో ఈ భారీ సమాధిని పరిశీలించినట్టు వారు వెల్లడించారు.

 
ఆ సమాధి తెగ నాయకుడిదా?

ఆదిమానవులకు సంబంధించిన అంశాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. వారి సమాధులను తవ్వినప్పుడు అస్థిపంజరాలే కాకుండా వాటి చుట్టూ అలంకరణ వస్తువులు, తినుబండారాలను ఉంచిన మట్టి పాత్రలు, ఆయుధాలు, పనిముట్లు వెలుగుచూస్తుంటాయి. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వాటిని అతనితోపాటు సమాధి చేయటం అప్పట్లో ఆనవాయితీ. వారి సమాధుల తవ్వకాల్లో ఇలాంటివి బయటపడేవి. ప్రస్తుతం వెలుగుచూసిన సమాధి ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలోని పజ్జూరు శివారులో కొంతకాలం క్రితం పురావస్తుశాఖ తవ్వకాలు జరిపింది. అక్కడ కూడా పదుల సంఖ్యలో బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. కానీ అవన్నీ చిన్నవి. ఈ అతి భారీ సమాధి నాడు ఆ ప్రాంతంలో మనుగడ సాగించిన ఆదిమానవుల తెగ నాయకుడిదై ఉంటుందని కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యులు పేర్కొంటున్నారు.


ఆంగ్లేయుల కాలంలో 1924లో హైదరాబాద్ ఆర్కియాలాజికల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా రాయగిరిలో తవ్వకాలు జరిపి విశాలమైన సమాధులను గుర్తించారు. ఆ విషయాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లాండ్ ప్రతినిధి ఈహెచ్ హన్స్ తాను రాసిన ఓ వ్యాసంలో వివరించారు. ఎర్రగడ్డగూడెం-పజ్జూరు మధ్య ఉన్న గార్లచెరువుకు వేల సంవత్సరాల నుంచి నీటి వనరుగా ఖ్యాతి ఉంది. నీటి వనరులున్న చోట ఆదిమానవుల ఆవాసాలుండేవి. అందుకే ఈ ప్రాంతంలో చాలా చోట్ల వారి సమాధులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బయటపడిన  అతిపెద్ద సమాధి ప్రాంతాన్ని కూడా పురావస్తు శాఖ శోధించి అందులో ప్రత్యేకతలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం లేఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరింది.

 

మరిన్ని వార్తలు