‘మూతబడులు’ తెరుద్దాం

7 Jun, 2016 02:12 IST|Sakshi

జీరో ఎన్‌రోల్‌మెంట్ స్కూళ్లపై తాజా నిర్ణయం
తిరిగి ప్రారంభించనున్న విద్యాశాఖ
విద్యార్థుల నమోదు పెంచాలని టీచర్లకు ఆదేశం
ఈ నెల 8 నుంచి 16 వరకు బడిబాట
రోజువారీ కార్యక్రమాలు  వెల్లడించిన విద్యాశాఖ

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూతబడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కొత్తగా విద్యార్థుల నమోదు లేకపోవడం.. ఉన్న విద్యార్థులు పక్క స్కూళ్లకు తరలిపోవడంతో 2015-16 విద్యాసంవత్సరంలో జిల్లాలో 14 పాఠశాలలకు తాళం పడింది. జీరో ఎన్‌రోల్‌మెంట్‌గా పేర్కొంటూ అక్కడ పనిచేసే టీచర్లను సమీప పాఠశాలలకు డెప్యూటేషన్‌పై పంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాఠశాలలను పునఃప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలల మూసివేతపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని సర్కారుకు మొట్టికాయలు వేయడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

 నమోదు పెంచాలని ఆదేశం..
గతేడాది మూసివేసిన పాఠశాలలను తాజాగా తెరవాలని విద్యాశాఖ ఆదేశిస్తూ ఆయా టీచర్లకు ప్రత్యేకంగా లక్ష్యాలు నిర్ణయించింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు చొరవ తీసుకోవాలని.. ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రవేశపెట్టొచ్చని విద్యాశాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఈక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకునే నిర్ణయంపై బడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల నమోదు లేకుంటే బడులు మూసేయొద్దని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుత టీచర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

 తెరుచుకోనున్న పాఠశాలలివే..
జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో జిల్లాలో 14 పాఠశాలలకు మూతపడగా.. తాజాగా వాటిని తెరవనున్నారు. ఎంపీపీఎస్ కస్లాబాద్‌తండా (మేమీన్‌పేట్), ఎంపీపీఎస్ సైదాలిపూర్(మోమీన్‌పేట్), ఎంపీయూపీఎస్ లక్ష్మారెడ్డిగూడ (శంకర్‌పల్లి), జీపీఎస్ ఎరుకుంటతండా (శంకర్‌పల్లి), ఎంపీపీఎస్ అలిజాపూర్ (రాజేంద్రనగర్), ఎంపీపీఎస్ చేవెళ్ల (చేవెళ్ల), ఎంపీపీఎస్ రాంసింగ్‌తండా (కుల్కచర్ల), జీపీఎస్ కొర్రొంతండా (మంచాల), ఎంపీపీఎస్ హెచ్‌డబ్ల్యూ ఆరుట్ల (మంచాల), జీపీఎస్ బుగ్గతండా (మంచాల), ఎంపీపీఎస్ అంబేద్కర్‌నగర్ (కందుకూరు), ఎంపీపీఎస్ కటికపల్లి (కందుకూరు), ఎంపీపీఎస్ దాసర్లపల్లి ఉర్దూ (కందుకూరు), ఎంపీపీఎస్ నేదునూరు ఉర్దూ (కందుకూరు) పాఠశాలలు తాజాగా పునఃప్రారంభం అవుతాయి.

రేపట్నుంచి బడిబాట..
బడిబాట కార్యక్రమంపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఈనెల మూడోతేదీ నుంచి బడిబాట చేపట్టనున్నట్లు తొలత ప్రకటించినప్పటికీ.. అందుకు సంబంధించి మార్గదర్శకాలను విద్యాశాఖ వెల్లడించలేదు. తాజాగా బడిబాట షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా విద్యాశాఖ స్పష్టం చేసింది. 8న విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ఎన్‌రోల్‌మెంట్‌పై ర్యాలీలు నిర్వహించాలి. 9న టీచర్లు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం. 10న స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం.

 13న ఒకటో తరగతి విద్యార్థులకు సామూహిక అక్ష్యరాభ్యాసం. 14న మండలస్థాయిలో ఎన్‌రోల్‌మెంట్‌పై సమీక్ష. 15, 16 తేదీల్లో గ్రామ విద్యా రిజిస్టర్‌ను సమగ్రంగా పూర్తి చేయాలి. ఈక్రమంలో టీచర్లు గ్రామంలో ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.

మరిన్ని వార్తలు