చట్టాలకు తూట్లు

29 Apr, 2017 01:39 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో గిరిజన చట్టాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. 1/70 చట్టం ప్రకారం అటవీ ప్రాంతంలో గిరిజనేతరుల భూముల విక్రయాలు, నిర్మాణాలు నిషేధం. ఇక్కడి భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తే అవి ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ (భూ బదలాయింపు నియంత్రణ) చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం గిరిజనేతరులకే కాదు.. ప్రభుత్వానికి సైతం వర్తిస్తుంది. అటవీ ప్రాంతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కేవలం గిరిజనుల మధ్య మాత్రమే జరగాల్సి ఉంటుంది. ఇలాంటి చోట్ల ప్రభుత్వం భూములను సేకరించాల్సి వస్తే పీసా చట్టం ప్రకారం విధిగా గ్రామసభలు నిర్వహించి గిరిజనుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల కోసం భూములు సేకరిస్తున్న ప్రభుత్వం గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తోంది. నిబంధనలకు 
విరుద్ధంగా అటవీ ప్రాంతంలో భూముల్ని సేకరించి గిరిజనేతరులకు మేలు చేసేవిధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. దీనివెనుక పెద్దఎత్తున సొమ్ములు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతున్నట్టు సమాచారం. 
 
చట్టం ఏం చెబుతోందంటే..
గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపు నియంత్రణ చట్టం (ఎల్‌టీఆర్‌) 1963 డిసెంబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చింది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగువిుల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ఈ చట్టం వర్తిస్తుంది. దీని ప్రకారం.. గిరిజన గ్రామాల్లోని అన్నిరకాల స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలు భూ బదలాయింపు నియంత్రణ చట్టం పరిధిలోకి వస్తాయి. దీని ప్రకారం నోటిఫైడ్‌ గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య అన్నిరకాల స్థిరాస్తుల బదలాయింపుల్ని నిషేధించారు. ఈ చట్టా న్ని 1970 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చారు. గిరిజనేతరులు ఎవరైనా భూములు విక్రయించేందుకు ప్రయత్నిస్తే దానిని ఎల్‌టీఆర్‌గా పరిగణిస్తున్నారు. 
 
అడ్డగోలుగా సేకరించారు
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల నుంచి సేకరించిన భూమికి బదులుగా భూమి ఇచ్చే వ్యవహారమంతా అడ్డగోలుగా సాగుతోందని గిరిజన, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగువిుల్లి, పోలవరం మండలాల్లో అధికారులు భూసేకరణ జరుపుతున్నారు. ఇప్పటివరకూ 19,300 ఎకరాలు సేకరించినట్టు చెబుతుండగా.. భూములు కోల్పోయిని వారికి ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ భూములన్నీ గిరిజనేతరుల నుంచే సేకరించారు. భూబదలాయింపు చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులెవరికీ భూములు ఉండవు. అలాంటప్పుడు గిరిజనేతరుల నుంచి సేకరించినట్టు చూపిస్తూ వారికి పరిహారం చెల్లించడం ఏమిటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పీసా చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించకుండా భూ సేకరణ చేశారని.. దీనిపై కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గిరిజన నాయకులు చెబుతున్నారు. 1/70 చట్టం ప్రకారం ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్లు లేకపోవడం వల్ల ఈ భూములకు అంత విలువ ఉండదు. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర రూ.లక్ష నుంచి రూ.2 లక్షల లోపే పలుకుతోంది. ప్రభుత్వం మాత్రం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఎకరానికి రూ.10.50 లక్షల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలోనే గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది.  ఈ ప్రాంతంలో నిర్మించిన చిన్న నీటి ప్రాజెక్టుల వల్ల అనేకమంది గిరిజనులు భూములను కోల్పోయారు. వారికి మాత్రం ప్రభుత్వం ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు మించి ఇవ్వలేదు. భూములిచ్చిన గిరిజనుల్లో కొందరికి ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు మాత్రమే అందాయి. అయితే, పోలవరం ప్రాజెక్టు భూ సేకరణకు సంబంధించి గిరిజనేతరులకు పెద్దమొత్తంలో పరిహారం చెల్లించడమంటే అధికార పార్టీ నేతలకు మేలు చేయడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
మరిన్ని వార్తలు