న్యాయవాదులను సీఎం మోసగించారు

30 Jun, 2017 23:31 IST|Sakshi
న్యాయవాదులను సీఎం మోసగించారు
విధులు బహిష్కరించి నిరసన
కాకినాడ లీగల్‌ (కాకినాడ సిటీ) : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులనే కాకుండా ఆఖరికి న్యాయవాదులను కూడా మోసం చేస్తున్నారని జిల్లాలోని బార్‌ అసోసియేషన్‌ సంఘాలు ఆరోపించాయి. దీర్ఘకాలికంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలోని ఆయా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కాకినాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బచ్చు రాజేష్, కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి బార్‌ అసోసియేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు శుక్రవారం విధులు బహిష్కరించినట్టు తెలిపారు. న్యాయవాదులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీలు ఇచ్చారని, మూడేళ్ల పాలన గడిచినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. న్యాయవాదుల డెత్‌ బెనిఫిట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచేందుకు, మెడికల్‌ బెనిఫిట్‌ రూ.40 వేల నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు అవసరమైన గ్రాంటు ఇవ్వాలన్నారు. జూనియర్‌ న్యాయవాదులకు స్టైఫండ్‌ను మంజూరు చేయాలి, న్యాయవాదులందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.. ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు ఇచ్చే స్టైఫండ్‌ను పెంచాలని, న్యాయవాదులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నారు. సోమవారం కూడా విధులు బహిష్కరించి తమ నిరసన తెలియజేస్తామని బార్‌ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ సెక్రటరీ దేశీ, కోశాధికారి శర్మ, న్యాయవాదులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు