దుబాయ్‌లో లక్ష్మణచాంద వాసి మృతి

21 Aug, 2016 23:49 IST|Sakshi
  • ఆలస్యంగా వెలుగుచూసిన విషయం
  • ఐదు నెలలుగా అక్కడే మతదేహం
  • ఇక్కడికి తెప్పించాలని బాధితుల వేడుకోలు
  • లక్ష్మణచాంద : మండల కేంద్రానికి చెందిన నరాల రాకేశ్‌(30) దుబాయ్‌లో మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం... నరాల భీమన్న–లక్ష్మి దంపతుల మూడో సంతానమైన రాకేశ్‌ స్థానికంగా కిరాణా షాప్‌ నడిపేవాడు. తనకు తెలిసిన వ్యక్తులు దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో అతడు 18–05–2015న దుబాయ్‌కి వెళ్లాడు. ఆరు నెలల వరకు అక్కడ పని బాగానే ఉందని తన తల్లిదండ్రులు, భార్యకు ఫోన్‌ ద్వారా తెలిపాడు. కానీ ఆ తరువాత కంపెనీ వారు తనను విపరీతంగా వేధిస్తున్నారని, ఇంటికి తిరిగి వచ్చేస్తానని తరచూ ఫోన్‌లో వాపోయాడు. ఆ తర్వాత చాలా రోజుల దాకా రాకేశ్‌ నుంచి ఇంటికి ఫోన్‌ రాలేదు. అతడు ఎలా ఉన్నాడో కూడా తెలియరాలేదు. ఇంతలో 15–06–2016న రాకేశ్‌ కుటుంబానికి దుబాయ్‌ నుంచి ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. రాకేశ్‌ మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని కంపెనీ యజమానులు తెలిపారు. అడ్రస్‌ తెలుసుకొని తెలిపేసరికి ఆలస్యమైందని పేర్కొన్నారు. దీంతో వీరు గుండెలవిసేలా రోదించారు. కంపెనీ వారు తమ కుమారుడిని చంపి, ఆత్మహత్య అని చెప్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసి రెండు నెలలు గడిచినా మృతదేహం ఇక్కడికి రాలేదు. రాకేశ్‌ చనిపోయి ఇప్పటికి ఐదు నెలలు గడిచింది. ఆఖరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ప్రవాస భారతీయులు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రుద్రం శంకర్‌ ఆదివారం లక్ష్మణచాందకు వచ్చి రాకేశ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. రాకేశ్‌ మృత దేహాన్ని 15 రోజుల్లో తెప్పించే కృషి చేస్తానని తెలిపారు.
>
మరిన్ని వార్తలు