ఈ‘నాయకులు’ నిజాలు నిమజ్జనం

17 Sep, 2016 23:02 IST|Sakshi
 • ప్రజా వ్యతిరేకత ఉన్నా బేఖాతరు
 • కోర్టులు మెుట్టికాయలేసినా నిస్సిగ్గుగా ముందుకు
 •  
  సాక్షిప్రతినిధి–కాకినాడ:
  ఊరూ వాడా వినాయకుడి నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. బాణసంచా, డప్పులు, మేళతాళాలతో ఊరేగుతూ వినాయకుడ్ని భక్తజనం నిమజ్జనం చేశారు. తలపెట్టే పనిలో విఘ్నాలు లేకుండా చూడవయ్యా ఓ బొజ్జగణపయ్యా అంటూ తొమ్మిది రోజులు పూజించాక నిమజ్జనంతో ముగింపు పలికారు. వచ్చే ఏడాది ఇంతకు రెట్టింపుగా ఉత్సవాలు చేస్తామని మొక్కుకున్నారు. కానీ జనానికి సేవ చేయాల్సిన వాస్తవ వి‘నాయకులు’ మాత్రం వారి ఆశలను నట్టేట్లో నిమజ్జనం చేసేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఓటు దేవుళ్లుగా కొలిచే నాయకులు అడిగినవే కాకుండా అడగకపోయినా అవిచేస్తాం, ఇవి చేస్తామని గుక్కతిప్పకోకుండా వాగ్థానాలు గుప్పించేశారు. వారి మాటలు నమ్మి జనం ఓటేసి అందలమెక్కించారు. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న...దాటేశాక బోడి మల్లన్న’ అన్న చందంగా ప్రజాప్రతినిధులు అందలమెక్కాక వారి కష్టాలు కడతేర్చడం మాట అటుంచి కనీసం వారు మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించేస్తున్నారు. కొందరైతే తమ స్వార్థం కోసం కక్ష సాధించేందుకు వెనుకాడటం లేదు. మరి కొందరు ప్రజాప్రతినిధులు ప్రజాకంఠక పాలన సాగిస్తున్న తీరు జుగుప్స కలిగిస్తోంది.
  రాష్ట్ర రాజకీయాల్లో తూర్పు సెంటిమెంట్‌గా తునికి ఒక ప్రత్యేక స్థానం, మంచి గుర్తింపు ఉంది. అటువంటి తునిలో అధికారపార్టీ నేతలు చట్టాన్ని తమ చుట్టంగా చేసుకుని పౌర హక్కులను కాలరాస్తున్నారు. ప్రజాక్షేత్రంలో ఓటమితో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన రామకృష్ణుడు ఎమ్మెల్సీ అయి చంద్రబాబు కేబినెట్‌లో నెంబర్‌–2గా కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్థాల రాజకీయ జీవిత గమనంలో అనేక ఎత్తుపల్లాలు చూసిన యనమలను ఆ నియోజకవర్గ  ప్రజలు రాముడనుకుని నెత్తిన పెట్టుకున్నారు. స్పీకర్, పీఏసీ చైర్మన్, పలు మంత్రిత్వశాఖలతో ఉన్నత పదవులు అలంకరించిన యనమల సొంత నియోజకవర్గ ప్రజలపై ప్రస్తుతం సర్కార్‌ కత్తి కట్టినట్టుగా వ్యవహరిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారనే కోపమో మరేదైనా కారణమో తెలియదు కానీ ఆ పార్టీ నేతలు అధికారం చేతిలో ఉందనే అహంతో అక్కడి ప్రజలపై కక్షకట్టేశారు.
  నియోజకవర్గంలోని తొండంగి మండలం తీర ప్రాంతంలో ఏర్పాటుచేయ తలపెట్టిన దివీస్‌ రసాయన పరిశ్రమ ప్రజల గుండెలపై కుంపటిగా మారింది. ప్రజా సంక్షేమం కోరే నేతలైతే అటువంటి కుంపటి నుంచి రక్షించాలి. అందునా ఇప్పుడు దివీస్‌తో నష్టపోయే వారిలో యనమల సొంత సామాజి వర్గీయులే ఎక్కువగా ఉన్నారు. అవసరమైతే వారి కోసం తనకున్న పలుకుబడిని ఉపయోగించి ప్రజలకు మంచి చేసి నియోజకవర్గంలో కోల్పోయిన ప్రాభవాన్ని అందిపుచ్చుకోవాలి. పరిశ్రమలు, దాని ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలను ఎవరూ కాదనరు. కానీ అక్కడి ప్రజల బెంగంతా ఆ పరిశ్రమ ద్వారా కలిగే భవిష్యత్‌ దుష్పరిణామాలపైనే. భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యాక తొండంగి తీర ప్రాంతంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగడం, నలుగురు కూర్చుని రచ్చబండపై మాట్లాడుకోవడం ఎప్పుడో మానుకున్నారు. దివీస్‌ బాధితులకు అండగా నిలిచేందుకు వస్తున్న ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరించి సుమారు 200 మందిపై కేసులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.
  అధికారం ఉంది కదా అని పోలీసుల బలప్రయోగంతో ప్రజలు, ఉద్యమకారుల గొంతు నొక్కేసినంత మాత్రాన ఉద్యమం చల్లారిపోతుందనుకోవడం అవివేకమే.  ఇందుకు తాజా ఉదాహరణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. స్టేలో ఉన్న భూముల్లో భూ సేకరణ ఎలా చేస్తారంటూ న్యాయ స్థానం సర్కార్‌కు అక్షింతలు వేసిన తరువాత ఏదో పెద్ద మార్పును ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఒకపక్క కోట్ల రూపాయల పెట్టుబడులతో సిద్ధంగా ఉన్న బడా కంపెనీ, మరోపక్క బక్కచిక్కిన సామాన్య రైతులు అటువంటప్పుడు చంద్రబాబు సర్కార్‌ అయినా, యనమల ద్వయమైనా ఎటువైపు మొగ్గుచూపుతారో ప్రజలకు తెలియంది కాదు. 
  – లక్కింశెట్టి శ్రీనివాసరావు
   
మరిన్ని వార్తలు