రేగులపల్లిలో చిరుత కలకలం

30 Jul, 2016 21:16 IST|Sakshi
  • గొర్రెల మందపై దాడి: ఒకటి మృతి
  • బెజ్జంకి : బెజ్జంకి మండలం రేగులపల్లిలో మళ్లీ చిరుత కలకలం మొదలైంది. మందపై దాడి చేయడంతో ఒక గొర్రె మృతి చెందింది. గ్రామ సమీపంలోని గుట్ట ప్రాంతంలో మేతకు తోలుకొచ్చిన గొర్రెలు, మేకల మందపై శుక్రవారం రాత్రి సమయంలో చిరుత దాడి చేసింది. భూపతి శ్రీకాంత్‌ అనే వ్యక్తికి చెందిన గొర్రెను నోట కరిచి తీసుకెళ్తుండగా.. మిగతా రైతులతో కలసి చిరుత బారినుంచి కష్టం మీద దాన్ని విడిపించి చికిత్స అందించారు. శనివారం ఆ గొర్రె మృతిచెందింది. వారం క్రితం మల్లంచెరువుకు చెందిన బండ భూమయ్య అనే వ్యక్తికి చెందిన గొర్రెను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో రైతులకు రూ. 15 వేల నష్టం జరిగిందని ఎంపీటీసీ జంగిలి లక్ష్మి తెలిపారు. గతేడాది కూడా ఇదే తరహాలో చిరుత దాడి చేసి భయంభ్రాంతులకు గురిచేసింది. ఏడాది తర్వాత మళ్లీ చిరుత సంచారంతో రైతులు, కూలీలు హైరానా పడుతున్నారు. రాత్రి వేళల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ మోటారు ఆన్‌ చేసేందుకు వెళ్లే రైతులు జంకుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు. 
మరిన్ని వార్తలు