కౌలుకు శ్మశానం!

17 Aug, 2016 10:52 IST|Sakshi

శ్మశాన భూముల సర్వే రిపోర్టులు బుట్టదాఖలు
గతంలో రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే
కలెక్టరు బదిలీతో ఆగిన చర్యలు
 

విశాఖపట్నం: ఎక్కడయినా రైతుల భూము లు కౌలుకు ఇస్తుంటారు. ఇందులో విడ్డూరమేం లేదు. మరి శ్మశానాన్ని ఎక్కడయినా కౌలుకు ఇవ్వడం తెలుసా... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ... ఔను నిజమే మరి. ఇది గోపాలపట్నం శివారు వెంకటాపురంలో జరుగుతున్న వింత. ‘శ్మశానాలు కబ్జా చేసి కౌలుకిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా... మీరుండి దేనికి... సర్వే చేసి చర్యలు తీసుకోండని రెండేళ్ల క్రితం అప్పటి  కలెక్టర్ శేషాద్రి ఆదేశించినా రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ దిశగా స్పందించలేదు.

కలెక్టర్ ఆదేశించాక ఏదో హడావుడిగా ఆ ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయారు. ఇపుడా ఫైలు బుట్టదాఖలు చేసేశారు అధికారులు. ఆ సర్వే ఏమయిందో... భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్రశ్నార్థకంగా ఉంది. వెంకటాపురం సర్వే నంబరు 109, 110లో దాదాపు 7.35 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలం ఉంది. వెంకటాపురం, పద్మనాభనగర్, ఎస్సీ బీసీ కాలనీ, కంపరపాలెం, నందమూరినగర్ ప్రాంతాలకు ఇదే శ్మశానం. ఇక్కడ జీవీఎంసీ అభివృద్ధి పనులు చేపట్టకపోవడంఆక్రమణదారులకు ఇష్టారాజ్యమయింది.
 
కౌలుకు శ్మశానం : శ్మశాన స్థలాన్ని కొందరు అంచెలంచెలుగా ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. అరటితోటలు, మిర్చితోటలు, వరి, నువ్వులు పండిస్తున్నారు. ఇలా ఇక్కడ దుక్కు దున్నేసి ఇపుడు శ్మశానానికి పావు ఎకరమే మిగిల్చారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ భూఆక్రమణకు పాల్పడినవారు ఇంకో ఘనకార్యం చేశారు. వీరు మరికొందరికి ఇక్కడి భూములు కౌలుకిచ్చి సొమ్ము చేసుకుంటుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కోట్ల విలువయిన భూమి అన్యాక్రాంతమవడంపై ఇంతవరకూ పనిచేసిని జిల్లా కలెక్టర్లందరికీ స్ధానికులు ఫిర్యాదులు చేస్తుండడడం, కిందిస్ధాయి అధికారులకు మొక్కుబడిగా ఆదేశాలిచ్చి ఆ ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం సాధారణమయిపోయింది.

ఫలించని ఆదేశాలు : ఇక్కడి ఆక్రమణలపై గతంలో కలెక్టర్లుగా పనిచేసిన ప్రవీణ్‌ప్రకాష్, శేషాద్రి స్పందించారు. భూములు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ నిర్మించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కదిలినట్లు నటించారు. అప్పట్లో ఇక్కడ  రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే చేపట్టారు. సర్వే రికార్డుల ఆధారంగా భూముల్ని పరిశీలించారు. అయినా చర్యలు జరిగితే ఒట్టు. దీంతో ఆక్రమణదారులు మరింత ముందుకొచ్చేశారు. ఉన్న భూమిని కుదించేశారు. ఇలా ఫిర్యాదు చేసీ చేసీ స్థానికులు విసిగిపోయారు. అధికారులపై నమ్మకం కోల్పోయారు.  

మరిన్ని వార్తలు