క్షమించండి.. మీ అప్పు తీర్చలేను!

5 Apr, 2016 20:16 IST|Sakshi

ఇల్లంతకుంట(కరీంనగర్): ‘మీ దగ్గర అవసరానికి అప్పు తెచ్చుకున్న. సమయానికి తీరుద్దామంటే నాకున్న ఒక్కటే ఆస్తి ఇల్లు. అది ఎవరూ కొంటలేరు. మీ అప్పు తీర్చలేకపోతున్న.. నన్ను క్షమించండి... ఇల్లు అమ్ముకుని మీ అప్పు తీసుకోండి’ అంటూ ఓ కౌలు రైతు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ముస్కాన్‌పేటకు చెందిన సామ మోహన్‌రెడ్డి(50) పంటల పెట్టుబడి, కుటుంబపోషణకు భారీగా అప్పు కావడంతో తనకున్న ఆరెకరాల భూమిని అమ్మేశాడు. కేవలం 5 గుంటల భూమి మాత్రమే మిగిలింది. ఇంకా రూ.8 లక్షల అప్పు ఉంది. మూడేళ్లుగా అదే గ్రామంలో 11 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కాలం కలిసిరాక..రుణ దాతల ఒత్తిడి తట్టుకోలేక ఉంటున్న ఇంటిని విక్రయానికిపెట్టాడు.

ఎవరూ కొనకపోవడంతో ఇక ఆత్మహత్యే శరణ్యమని మంగళవారం వేకువజామున చేను వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. భర్త తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో భార్య జయ చేను వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. మోహన్‌రెడ్డికి భార్య జయ, కూతుళ్లు లావణ్య, స్రవంతి ఉన్నారు. ఎస్సై ఎల్లయ్యగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌లో తెలంగాణ ప్రజలు బాగుండాలని, సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ తీసుకురావాలంటూ రాశాడు.

కిస్తీకి బైక్ విక్రయం..
మోహన్‌రెడ్డి తనకున్న ఐదుగుంటల స్థలంలో రెండు గుంటల్లో షెడ్ వేసి ఆవులు పెంచేందుకు బ్యాంకు రుణం తీసుకున్నాడు. ఆవులను కొనుగోలు చేసి కొన్ని రోజులు బాగానే నడిచాక, పాల ధర తగ్గడంతో ఒక్కోటి రూ.55 వేలకు కొనుగోలు చేసిన ఆవును రూ.35 వేలకే అమ్మేశాడు. రూ.లక్ష మేర నష్టపోయాడు. ఆవులు అమ్మిన విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు అప్పు తీర్చాలని పట్టుబట్టడంతో సోమవారం తన ద్విచక్రవాహనాన్ని అమ్మి బ్యాంకు నెలసరి వాయిదా కట్టాడు.

మరిన్ని వార్తలు