గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వెలుగులు

1 May, 2017 23:40 IST|Sakshi
గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వెలుగులు
– అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి తీర్మానాలు పంపండి
 – డీపీఓ పార్వతీ
 
కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ లైటింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పీఆర్‌ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతీ చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే పలు మేజర్‌ గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేసుకున్నారని, అయితే కమిషనర్‌ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసి తమ కార్యాలయానికి ఆ కాపీలను పంపాలన్నారు.
 
జిల్లాలో ఏప్రెల్‌ 30వ తేది వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలుకు పీఆర్‌ కమిషనర్‌ గడువు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు 85 శాతం మేర పన్నులు వసూలు చేసినట్లు చెప్పారు. మొత్తం రూ.24 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, రూ.20.40 కోట్లను వసూలు చేసినట్లు చెప్పారు. మిగిలిన 15 శాతం కూడా ప్రభుత్వ భవనాలు, మొండి బకాయిలు ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ బిల్లులకు సంబంధించి సర్‌చార్జీలను ప్రభుత్వం మినహించిన దృష్ట్యా కేవలం రెగ్యులర్‌గా వాడే విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి బకాయిలు లేకుండా చూసుకోవాలన్నారు.    
 
మరిన్ని వార్తలు