మిర్చికి మద్దతు ధర ఇవ్వండి

7 Apr, 2017 15:05 IST|Sakshi
మిర్చికి మద్దతు ధర ఇవ్వండి

ఒంగోలు టౌన్‌: మిర్చి క్వింటా 10వేల రూపాయలకు మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని నాలుగు వామపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. గురువారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించాయి. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వి. హనుమారెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులు ఈ ఏడాది పంట పండించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు 70వేల రూపాయల వరకు ఖర్చు చేశారన్నారు.

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించినా మిర్చి పంటను ఇంతవరకు నమోదు చేయకపోవడం దారుణమని తెలిపారు. ఎండిపోయిన మిర్చి పంటను వెంటనే నమోదుచేసి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు రామారావు మాట్లాడుతూ సాగు విస్తీర్ణం పెరగడం వల్ల ధరలు తగ్గాయని అధికారులు చెప్పడం సరికాదన్నారు. ఈ ఏడాది విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన విషయాన్ని గుర్తెరగాలన్నారు.

అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు ఆర్‌. మోహన్‌ మాట్లాడుతూ మిర్చి ధరలు రోజురోజుకు పతనం అవుతున్నా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని విమర్శించారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ ఐక్య ఉద్యమాల ద్వారా గతంలో అనేక ఫలితాలు సాధించుకోవచ్చని చెప్పారు. మిర్చి రైతుల సమస్యలపై ఐక్య పోరాటాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకురాలు ఎస్‌. లలితకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు పరిటాల నాగేశ్వరరావు, నాంచార్లు, కె. హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు