-

మహిళా...! మేలుకో..!

11 Feb, 2017 22:37 IST|Sakshi
మహిళా...! మేలుకో..!

సాక్షి, అమరావతిబ్యూరో : ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ఉగ్రవాదం, అణచివేత, రాజ్యదురహంకారం తదితర రుగ్మతలను రూపుమాపే శక్తి మహిళలకే ఉందని దలైలామా ఉద్బోధించారు. ప్రపంచంలో కనీసం సగం దేశాలకు అయినా మహిళలు నాయకత్వం వహిస్తేనే ప్రపంచ శాంతి సిద్ధిస్తుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ దిశగా మహిళలు రాజకీయ రంగంలో పురోగమించి దేశ నాయకత్వాన్ని సాధించాలని ఉద్బోధించారు.

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ... : ‘ఉద్యోగాన్ని కోరుకునే స్థితికి పరిమితం కాకుండా ఉద్యోగాలను కల్పించే స్థాయిలో మహిళలు ప్రగతి సాధించాలి’ అని నోబుల్‌ బహుమతి గ్రహీత, బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మహ్మద్‌ యూనస్‌ ఉద్బోధించారు. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించి పారిశ్రామిక వేత్తలుగా రూపొందాలని సూచించారు. పేదరికం, నిరుద్యోగం l, పర్యావరణంలో కర్బన అవశేషాలను పూర్తిగా నిర్మూలిస్తేనే ప్రపంచం పురోగమించగలదని ఆయన చెప్పారు.

మహిళా జయంతోనే సమాజ విజయం ...
స్వయం సహాయక సంఘాల విజయం స్ఫూర్తితో భారతీయ మహిళలు పేదరికంపై పూర్తిగా విజయం సాధించాలని మిలిందా గేట్స్‌ సూచించారు. బిల్‌–మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ అయిన ఆమె వీడియో ద్వారా తన సందేశాన్ని వినిపించారు. మహిళలు విజయం సాధిస్తే అందరికీ ప్రగతి ఫలాలు సిద్ధిస్తాయని ఆమె అన్నారు.

విజయ ప్రస్థానం పార్లమెంట్‌ వరకు సాగాలి
‘ఒక్క బాలిక కూడా చదువుకు దూరం కాకుండా చూడాలి... ఒక్కరిపై కూడా వేధింపులు లేకుండా ఎదురొడ్డాలి. అప్పుడే మహిళా సాధికారత సాధించగలం’అని సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ రంజనా కుమారి పేర్కొన్నారు. ఈ మహిళా పార్లమెంట్‌ సదస్సు స్ఫూర్తితో విజయ ప్రస్థానం ఢిల్లీలోని పార్లమెంట్‌ వరకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.

వివక్షకు ఎదురొడ్డాలి ... : సమాజంలోని వివక్ష మహిళలకు ప్రతిబంధకంగా నిలుస్తోందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కె.కవిత పేర్కొన్నారు. మహిళలపై వివక్ష, హింసలను రూపుమాపేందుకు కలసికట్టుగా కృషి చేయాలని సూచించారు.  పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలను గృహిణులు ఆర్థికవేత్తలకు కూడా తీసిపోని రీతిలో ఎదుర్కొన్నారని ఆమె చెప్పారు. గ్రామీణ మహిళల్లో దాగి ఉన్న సామర్ధ్యాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

అందం అంటే ఏమిటో పునర్నిర్వచించాలి
అందం అంటే బాహ్య సౌందర్యం కాదని అంతః సౌందర్యం, ఆత్మవిశ్వాసమని సమాజం గుర్తించేలా పునర్నిర్వచించాలని ప్రముఖ సామా జికవేత్త లక్ష్మీ అగర్వాల్‌ పేర్కొన్నారు. యాసిడ్‌ దాడుల నిర్మూలన కోసం ఉద్యమిస్తున్న ఆమె ప్రసంగం అందర్నీ ఆలోచింపజేసింది. యాసిడ్‌ దాడులకు పాల్పడినవారిని శిక్షించడం ఎంత ముఖ్యమో...దాడుల బాధితులకు పునరావాసాన్ని కల్పించడం కూడా అంతే ప్రధానమన్నారు. బాధితులు స్వయం ఉపాధి రంగంలో రాణించేలా తోడ్పాటు అందించాలన్నారు.

చట్టసభల్లో రిజర్వేషన్లతోనే రాజకీయ సాధికారత
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదం పొందేలా కలసికట్టుగా ఉద్యమించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ బుట్టా రేణుక పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వల్లే సామాన్య  మహిళలు రాజకీయ నాయకత్వ అనుభవాన్ని సాధించగలిగారని ఆమె చెప్పారు. కానీ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెండింగ్‌లోనే ఉండటం దురదృష్టకరమన్నారు. మహిళా సాధికారత దిశగా చట్టాలు రావాలంటే చట్టసభల్లో మహిళలకు దామాషా ప్రాతిపదికన ప్రాతినిధ్యం తప్పనిసరి అని స్పష్టంచేశారు.

ప్రపంచ పౌరులుగా మహిళలు రాణించాలి
అంతర్జాతీయ స్థాయిలో కూడా మహిళలు నాయకత్వ పటిమను ప్రదర్శించాలని అమెరికాలోని మేరిల్యాండ్‌ సెనేటర్‌ అరుణా మిల్లర్‌ పేర్కొన్నారు. అమెరికాకు తొలిసారిగా ఓ మహిళ నాయకత్వం వహించే అవకాశాన్ని తాము దురదృష్టవశాత్తు కోల్పోయామని ఆమె విచారం వ్యక్తం చేశారు. అవకాశాల కోసం కాలయాపన చేయకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలన్నారు.

మరిన్ని వార్తలు