‘ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించండి’

20 Feb, 2017 00:34 IST|Sakshi
అనంతపురం అర్బన్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 21న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఎన్నికలను సజావుగా జరిపేందుకు సహకరించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరగకూడదన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.
 
ఎన్నికల నోటిఫికేషన్‌ ఈనెల 21న విడుదలవుతుందని 28 వరకు నామినేషన్‌లను స్వీకరిస్తామన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జడ్పీ, మండల, మునిసిపల్‌ కార్యాలయాల్లో ప్రదర్శించామన్నారు. అభ్యంతరాలు ఉంటే ఈ నెల 24వ తేదీలోగా రిటర్నింగ్‌ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. వాటిపై జడ్పీ సీఈఓ, మునిసిపల్‌ కమిషనర్‌ ద్వారా విచారణ చేయిస్తామన్నారు. 26న తుది జాబితా ప్రచురిస్తామన్నారు.  నామినేషన్ల పరిశీలన మార్చి 1న నిర్వహిస్తామని, ఉపంసహరణకు 3వ తేదీ ఆఖరన్నారు. ఎన్నికలు మార్చి 17వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయన్నారు. ఓట్ల లెక్కింపు 20న ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్‌ పూర్తిస్థాయిలో అమలు కావాలన్నారు.    
మరిన్ని వార్తలు