అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం

30 May, 2017 22:00 IST|Sakshi
అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం
– వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక హత్యా రాజకీయాలు
– రాజధాని నిర్మాణం ముసుగులో ప్రజాధనం దుర్వినియోగం
– ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలు
– పాణ్యం నియోజకవర్గ ప్లీనరీకి విశేష స్పందన
    
ఓర్వకల్లు:  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పాలనకు చరమగీతం పాడుదామని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నేతలు పిలుపునిచ్చారు. ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ప్లీనరీ సమావేశాల్లో భాగంగా మంగళవారం కాల్వబుగ్గలో పాణ్యం నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఆపార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, మైనార్టీ సెల్‌ జిల్లా కన్వీనర్‌ ఫిరోజ్‌ఖాన్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముందుగా పార్టీకి విశేష సేవలందించి, ప్రత్యర్థులు చేతిలో హత్యకు గురైన పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ చెరుకులపాడు నారాయణరెడ్డి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికార పార్టీ నాయకుల ఆగడాలపై చర్చించారు.
 
అనంతరం పార్టీ నిర్మాణాత్మకమైన పనులకు వివిధ మండలాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించి తీర్మానించారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తోందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని ఆయన పాలనలో వర్షాలు పుష్కలంగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని ఆయా మండలాలకు చెందిన కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.  అనంతరం పలువురు ముఖ్య నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు, పాణ్యం మండల కన్వీనర్లు సత్యనారాయణరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, కళాధర్‌రెడ్డి, చంద్రారెడ్డి, ఎంపీపీ వెంకట రమణమ్మ, గడివేముల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అనసూయమ్మ, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 
    
వారసత్వ రాజకీయాలకు చంద్రబాబు నిదర్శనం: బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని తన కుమారుడికి మంత్రి పదవులు ఇవ్వడం ఇంత వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. అది ఒక్క నారా చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు పైసా నిధులు ఇవ్వకుండా తమ పార్టీకి చెందిన ఇన్‌చార్జ్‌లకు నిధులు ఇస్తూ నియంత పాలనకు పాల్పడటం అప్రజాస్వామికం. రూ.5 కోట్ల స్థిరీకరణ నిధిని అమలు చేయడంలో విఫలమయ్యారు. రైతుల సంక్షేమాలను విస్మరించి వ్యవసాయరంగాన్ని నీరుగారుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి పాలనకు స్వస్తి పలికి జగన్‌మోహన్‌రెడ్డిని అధికారంలోకి తీసుకరావాలి. 
 
వైఎస్‌ఆర్‌సీపీకి ఆదరణ పెరుగుతోంది: గౌరు వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సీపీకి రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతోంది. అధికార పార్టీ ఇది సహించలేక, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదురో​‍్కలేక హత్యా రాజకీయాలకు పాల్పడుతోంది. చంద్రబాబు కుఠిల రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మండల స్థాయి నాయకులతో తరుచూ ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే గౌరు చరితను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించండి. 
 
ప్రజలకు అందుబాటులో ఉంటాం: గౌరు చరిత, పాణ్యం ఎమ్మెల్యే
అధికార పార్టీ నాయకుల ఆగడాలను అడ్డుకునేందుకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాపై ఉన్న అభిమానంతో రెండుసార్లు గెలిపించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది. సాధారణ ప్రజలకు ఏమాత్రం భద్రత ఉంటుంది. అధికార అహంతో పోలీసులను కొందరు నేతలు కరివేపాకులా వాడుకుంటున్నారు. అధికార పార్టీ నేతలు  పోలీసులను అడ్డుపెట్టుకుని చెరుకులపాడు నారాయణరెడ్డిని అంతమొందించారు. ఇలాంటి రాక్షస పాలన ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.
  
వైఎస్‌ఆర్‌సీపీని బలోపేతం చేద్దాం : కొత్త కోట ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నేత
గ్రామ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు కలిసి పార్టీని బలోపేతం చేద్దాం.. ప్రతి కార్యకర్త జగన్‌పై ఉన్న అభిమానంతో పార్టీకి సేవలు చేస్తే భవిష్యత్తులో జగన్‌ అధికారంలోకి తప్పక వస్తారు. కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నా చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేయకుండా అమరావతి నిర్మాణానికి, తన ప్రచారానికి వినియోగిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా