వరుపులపై ఉరుములు

10 May, 2017 23:11 IST|Sakshi
వరుపులపై ఉరుములు
 - రోడ్డునపడ్డ ప్రత్తిపాడు ‘దేశం’
- సీనియర్లను దూరంపెడుతున్న ఎమ్మెల్యే
 - తాడోపేడో తేలుస్తామంటున్న వైరి వర్గం
- ‘వరుపుల’పై ‘బాబు’కు లేఖాస్త్రం 
 
రాజకీయ లబ్ధి కోసం టీడీపీలోకి గోడ గెంతిన నేతలతో తలనొప్పులు ప్రారంభమయ్యాయి. గత ఎన్నికల్లో పార్టీ తరుఫున పోరాడి ఓడిన తెలుగు తమ్ముళ్లు కష్టాలను ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్‌ సీపీ గుర్తుపై గెలిచి స్వప్రయోజనాల కోసం పచ్చ కండువా వేయించుకున్న నేతలే భస్మాసుర హస్తాలేస్తూ భయోత్పాతం సృష్టించడంతో బహిరంగంగా తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యుడు వరుపుల సుబ్బారావు వైఖరిపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండమే కాకుండా ఆ పంచాయితీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. 
 
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలోని పలు నియోజకవర్గాల్లోని టీడీపీలో పాత, కొత్త నేతల మధ్య వైరుధ్యాలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొంది టీడీపీలోకి ప్లేటు ఫిరాయించిన నియోజక వర్గాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఇందులో భాగంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తీరుపై నియోజకవర్గంలో పార్టీ సీనియర్లు కత్తులు నూరుతున్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకొని పార్టీ జెండాను భుజాన మోసిన వారిని పక్కనపెట్టేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్న వరుపులపై పార్టీ సీనియర్లు తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నుంచి వరుపుల సుబ్బారావు ఎమ్మెల్యే అయ్యాక ప్రలోభాల ఫలితంగా టీడీపీలోకి వచ్చి సీనియర్లను పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెడుతున్నారంటున్నారు. ప్రత్తిపాడులో గత సార్వత్రిక ఎన్నికల్లో వరుపుల సుబ్బారావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బరిలోకి దిగగా టీడీపీ తరఫున దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు పోటీపడ్డారు. వీరిలో చిట్టిబాబు ఓటమిపాలవగా అనంతరం ఆయన మరణించారు. చిట్టిబాబు మృతిచెందినా పార్టీలో మాజీ ఎమ్మెల్యేగా ఆ వర్గం అలానే కొనసాగుతోంది. ఇంతలో చిట్టిబాబుపై గెలుపొందిన సుబ్బారావు టీడీపీలో ఫిరాయించడంతో నియోజకవర్గ టీడీపీలో పాత, కొత్త నేతలు రెండుగా చీలిపోయారు. అందుకు వరుపుల తీరే కారణమని వైరి వర్గం దుమ్మెత్తిపోస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ పోటీచేసే ఉద్ధేశం సుబ్బారావుకు లేకపోవడంతోనే పార్టీని నియోజకవర్గంలో అపఖ్యాతి పాల్జేస్తున్నారని చంటిరాజు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు రెండు రోజుల కిందట రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం.
కక్ష సాధింపుల దిశగా...
2014 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని కక్షగట్టి టీడీపీ నేతలే లక్ష్యంగా వరుపుల వేధింపులకు గురిచేస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్‌ నాయకులు బుద్దరాజు చంటిరాజు, దలే చిట్టిబాబులపై వరుపుల వర్గీయుల వేధింపులు పెరిగిపోవడంతో ఆ విభేదాలతో రోడ్డెక్కుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ వైపు చిత్తశుద్ధితో పనిచేయడమే తాము చేసిన నేరంగా ఎమ్మెల్యే భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన బుద్దరాజు చంటిరాజు వర్గాన్ని సోదిలో లేకుండా చేయాలనే వ్యూహంతో వరుపుల వర్గం కుయక్తులు పన్నుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని పనిచేస్తున్న బుద్దరాజు చంటిరాజును రాచపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్‌ పదవి నుంచి చంటిరాజును ఎమ్మెల్యే అకారణంగా ఉద్వాసన పలికారు. అతని స్థానంలో బుద్దరాజు సుబ్బరాజు (గోపిరాజు) వర్గీయుడైన మాజీ సర్పంచి దంతులూరి వీరభద్రరాజును అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా చేశారు. అభివృద్ధి కమిటీలో ఉన్న మిగిలిన వారందరినీ అలానే ఉంచేసి ఒక్క  చైర్మన్‌ చంటిరాజును మాత్రమే తొలగించడం ద్వారా పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తారా అని పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.
పార్టీకి దూరం చేసే కుట్రలో భాగంగా..
వరుపుల టీడీపీలోకి వచ్చాక టీడీపీ జన చైతన్య యాత్రలు ప్రారంభమైన దగ్గర నుంచి వైరివర్గాన్ని దాదాపు పార్టీకి దూరం చేసే ఎత్తుగడలతోనే వ్యవహరిస్తున్నారని వైరి వర్గం బాహాటంగానే ఆక్షేపిస్తోంది. జనచైతన్య యాత్రల్లో రాచపల్లికి వచ్చిన వరుపుల ఆ గ్రామ సర్పంచి, చంటిరాజు భార్య రామలక్ష్మికి కనీస సమాచారం లేకుండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేశారు. ఈ విషయంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గంగా ఉన్న సర్పంచి రామలక్ష్మి, ఆమె భర్త చంటిరాజు సహా నేతలు పెద్ద ఎత్తున వరుపులను గ్రామం నుంచి వెళ్లకుండా అడ్డుకున్న సంగతి  తెలిసిందే. ఆ తరువాత కక్షకట్టి రాచపల్లి సహా పలు గ్రామాల జన్మభూమి కమిటీలను రద్దుచేసి తన వర్గీయులతో నింపేసుకుని పార్టీ అంటే పడిచచ్చే వారిని గెంటేస్తున్నారంటున్నారు. పలు గ్రామాల్లో గృహ నిర్మాణాలు, పింఛన్ల మంజూరులో కూడా పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యం లేకుండా చేసి తన వెనకాల తిరిగే వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని  రెండు రోజుల కిందట విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చంటిరాజు స్వయంగా ప్రకటించడం పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలకు అద్దంపడుతున్నాయి. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయామని ఇక ముందు తాడోపేడో తేల్చుకుంటామని చంటిరాజు ఎమ్మెల్యేపైన, అతని వర్గంపైనా బహిరంగంగానే కత్తి దూశారు. అంతటితోనే ఆగకుండా అభివృద్ధికి అడ్డంకిగా మారిన ఎమ్మెల్యే వర్గం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తామేదో సహకరించడం లేదని ఎదురుదాడి చేస్తూ జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తోందంటున్నారు. ఈ విషయంలో వాస్తవాలేమిటో తేల్చుకుందామంటూ చర్చకు ‘సై’ అంటూ ఎమ్మెల్యేకు వైరి వర్గం బాహాటంగానే సవాల్‌ విసిరింది. ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు