గ్రంథాలయాలపై బకాయిల బండ

5 Mar, 2017 23:15 IST|Sakshi
గ్రంథాలయాలపై బకాయిల బండ
రూ.కోట్లలో పేరుకుపోతున్న సెస్‌
ఉద్యోగులకు జీతాలివ్వని వైనం
బాలాజీచెరువు(కాకినాడ)/ఆలమూరు (కొత్తపేట) : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో జిల్లా గ్రంథాలయ వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తోంది. జిల్లాలో గ్రంథాలయ సెస్‌ బకాయిలు సమయానికి వసూలు కాకపోవడంతో ఉద్యోగులకు, పింఛన్‌దారులకు సక్రమంగా జీతాలు అందించలేని పరిస్థితి నెలకొంది. ప్రతినెలా ఉద్యోగులకు, పింఛన్‌ దారులకు సుమారు రూ.75 లక్షల మేర చెల్లించాల్సిన జీతభత్యాలను సమకూర్చుకోలేని స్థితిలో గ్రంథాలయ జిల్లాశాఖ కొట్టుమిట్టాడుతోంది. గత 12 ఏళ్లలో నెలవారీ జీతాలు అందకపోవడం ఇదే తొలిసారని ఉద్యోగులు చెబుతున్నారు. 
భర్తీకానీ పోస్టులు
జిల్లా కేంద్రమైన కాకినాడ ప్రధాన గ్రంథాలయానికి అనుబంధంగా 119 శాఖ, గ్రామీణ గ్రంథాలయాలు, 146 పుస్తక నిక్షిప్త కేంద్రాలు ఉన్నాయి. గ్రంథాలయాల్లో 204 మంది ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 112 మంది మాత్రమే ఉన్నారు. అందులో 35 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. మిగిలిన 92 పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా భర్తీ చేసే పరిస్థితి కనుచూపు మేర కన్పించడం లేదు. రెగ్యులర్‌ ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలలకు వేతనాలు రాలేదు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. 
వైఎస్‌ హయాంలో ప్రత్యేక గ్రాంటు
మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో అధికారం చేపట్టిన తరువాత గ్రంథాలయ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని సెస్‌ బకాయిల వసూలుతో నిమిత్తం లేకుండా జీతభత్యాల కోసం ప్రతిఏటా ప్రత్యేక గ్రాంటును విడుదల చేసేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటు విడుదలలో జాప్యం చేస్తుండటంతో జిల్లా గ్రంథాలయశాఖ కేవలం జీత భత్యాల కోసం సెస్‌ బకాయిలపైనే ఆధారపడుతోంది. జిల్లాలోని పంచాయతీల నుంచి విడుదల కావాల్సిన సెస్‌ బకాయిలు రూ.రెండు కోట్ల వరకూ ఉండగా తాజాగా పల్లెలో పెంచిన ఇంటిపన్నులో భాగంగా గ్రంథాలయాల సెస్‌ మూడు రెట్లు పెంచి వసూలు చేస్తున్నారు. కానీ ఆ సెస్‌ను గ్రంథాలయాలకు జమ చేయకుండా పంచాయతీలకు వాడేసుకుంటున్నారు.
బకాయిలు ఇవే..
కాకినాడ రూ.7,59,00,000, రాజమహేంద్రవం 7,63,70,481, తుని రూ.23,51,034, మండపేట రూ.19,94,921,  సామర్లకోట రూ.24,50,000, పెద్దాపురం 30,23,000, పిఠాపురం రూ.36,29,718, రామచంద్రపురం రూ.21,06, 383, మేజర్‌ పంచాయతీలు సుమారు రూ.8 కోట్లు 
సెస్‌లు చెల్లిచడం లేదు
ప్రజల నుంచి నీటి పన్ను, ఆస్తి పన్నుతో పాటు గ్రంథాలయ పన్నును కూడా మున్సిపాలిటీలు, పంచాయతీలు వసూలు చేస్తున్నాయి. కానీ మాకు జమ చేయడం లేదు. రూ.ఐదుకోట్ల16 లక్షలను 2016–17 సంవత్సరానికి విడుదల చేశారు. జనవరి జీతాలు రెండు రోజుల్లో విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. సెస్‌లు   సక్రమంగా చెల్లిస్తే గ్రంథాలయాల అభివృద్ధికి వీలుంటుంది. - ఎన్‌.వెంకటేశ్వరరావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి
మరిన్ని వార్తలు