బతికి చూపిస్తున్నారు

12 Aug, 2016 23:53 IST|Sakshi
బతికి చూపిస్తున్నారు
  • కష్టంమే పెట్టుబడి..
  • ఆత్మవిశ్వాసమే ఆలంబనగా...
  • తొలుత సహాయకులుగా, తర్వాత నిర్వాహకులుగా
  • తలెత్తుకుని బతుకుతున్న చిరు వ్యాపారులు
  • ఇతరజిల్లాలు, రాష్ట్రాల నుంచి వలసలు
  • వందలాది కుటుంబాలకు కేంద్రంగా గోపాలపట్నం
  • వారంతా ఎక్కడెక్కడి వారో...జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఆకలి బాధలు, ఆర్థిక చిక్కులు, కష్టాలు...నష్టాలను చూసిన వారు. కన్నీళ్లను దిగమింగుకుని కుటుంబాలతో సహా పల్లెలను వదిలి పట్నం వచ్చేశారు. ఎలాగోలా బతికేయాలని మనసు చంపుకోలేదు. ఎలాగైనా బతికి చూపించాలనుకున్నారు. తొలుత అక్కడక్కడా పనులుచేసి కాస్త కూడబెట్టుకున్నారు. ఆ మొత్తంతో  చిరు వ్యాపారాలు ప్రారంభించారు. కష్టాన్ని నమ్ముకున్నోళ్లకు విజయం ఎప్పటికీ బానిసే అన్నట్టు వీరు ఆయా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. నగరం మొత్తంమ్మీద వేల సంఖ్యలో చిరువ్యాపారులుండగా, ఒక్క గోపాలపట్నంలోనే దాదాపు 300 మంది వరకూ బతుకుబళ్లు లాగుతున్నారు. ఒకప్పుడు గోపాలపట్నం కూడా ప‌ల్లేటూరు అయినా పట్నం మహానగరంగా విస్తరించడం, వ్యాపారాల వద్దకు జనం కాకుండా...జనం చెంతకే వ్యాపారసంస్థలు చేరడం వీరికి వరమయింది. ఇపుడు చిరువ్యాపారులంతా చక్కని ప్రణాళికలతో ప్రజల అవసరాలు తీర్చే వ్యాపారాలతో జీవితాల్ని సాఫీగా వెళ్లదీస్తున్నారు. అనేకరకాల పండ్లు, కొబ్బరిబొండాలు, పకోడీ, నూడిల్స్,ఇడ్లీలు,దోసెలు, ఫ్యాన్సీ వస్తువులు, పిల్లల ఆటవస్తువులు, ఇంటికి ఉపయోగపడే చిన్నపాటి గృహోపకరణాలు, సరబత్‌లు, బూరలు, దుస్తులు..ఇలా ఎన్నో విక్రయిస్తున్నారు. ఇక్కడ స్థానికేతర వ్యాపారులే అత్యధికంగా కనిపిస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల వారే కాక తెలంగాణ, రాజస్తాన్, జైపూర్, దిల్లీ నుంచి కూడా వచ్చి గోపాలపట్నంలో బతుకుపోరు సాగిస్తుండడం విశేషం.  
    -గోపాలపట్నం 
     
    దివిసీమ ఉప్పెనతో వచ్చేశా
    మాది అమలాపురం. 1996లో దివిసీమ ఉప్పెనతో కుటుంబం మొత్తం రోడ్డునపడ్డాం. ఎలా బతకాలో...భవిష్యత్తుపై భయమేసింది. పొట్ట చేతపట్టుకుని భార్యాపిల్లలతో ఇక్కడకు వచ్చేశా. తొలుత అక్కయ్యపాలెంలో ఓ తోపుడుబండి వ్యాపారి వద్ద చేరి పని నేర్చుకున్నాను. ఇపుడు గోపాలపట్నంలో రోడ్డుపై పకోడీ, పానీపూరీ, జిలేబీలు అమ్ముతున్నాను. సొంత ఇల్లు కట్టుకుని భార్యాపిల్లలతో  క్షేమంగా ఉన్నాను.
    -పి.శ్రీనివాసరావు, పకోడీబండి వ్యాపారి
     
    బతకడం తెలుసుకున్నా
    పద్దెనిమిదేళ్లుగా గోపాలపట్నంలో తోపుడుబండి వేసుకుని పండ్ల వ్యాపారం చేస్తున్నాను. స్వస్థలం విజయనగరం జిల్లాలో ఓ కుగ్రామం. భార్యా ఇద్దరు పిల్లలతో బతుకుదామన్న సొంత ఊళ్లో పనిలేదు. జీవితం ఎలాగని భయపడ్డాను. కష్టంపై భారం వేసి గోపాలపట్నం వచ్చాను. తోపుడు బండిపై సీజన్‌ వారిగా పండ్లు అమ్ముకుని ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాను. పిల్లలను అందరిలాగే బాగా చదివించుకుంటున్నాను.
    -జి.మురళి, పండ్ల వ్యాపారి
     
    కష్టాన్ని నమ్ముకున్నా...
    మాది తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సమీపంలోని సీతారామపురం. నిరుపేదకుటుంబం. 1982లోనే భార్యాపిల్లలతో గోపాలపట్నం వచ్చాను. పనుల కోసం తిరిగాను. ఒకరోజు పని ఉంటే రెండ్రోజులు లేని పరిస్థితి. స్వయంగా ఎదగాలని ఆలోచించాను. వలసజనంతో కాలనీలు పెరిగాయి. వ్యాపారసంస్థలూ పెరిగాయి. హోల్‌సేల్‌లో కొంచెం కొంచెం గాజులు, ఫ్యాన్సీ సామగ్రీ తెచ్చి తోపుడు బండిపై అమ్ముతున్నాను. సాయంత్రం వేళ మెయిన్‌రోడ్డులో రద్దీ ప్రాంతంలో, ఇతర సమయాల్లో కాలనీల్లోకి తిరిగి వ్యాపారం చేస్తున్నాను. కష్టం లేకుండా భార్యాపిల్లలను పోషిస్తున్నాను.   
    -సువర్ణవెంకటరమణ, గాజుల వ్యాపారి
     
    ఎన్నో ఊళ్లు తిరిగా...
    హర్యానా నుంచి బతుకు దెరువు కోసం చాలా ప్రాంతాలు తిరిగాను. హైదరాబాద్, నూజివీడు తదితర ప్రాంతాల్లో పనిచేశాను. చివరికి విశాఖ వచ్చి ఓ వ్యాపారి వద్ద చేరాను. అలా అంచెలంచెలుగా శ్రమించి కాస్త ఆర్థికంగా పరిస్ధితి మెరుగుపరచుకున్నాను. సొంతంగా స్టాకు తెచ్చుకుని గోపాపట్నంలో ఫుట్‌పాత్‌పై వస్త్రాలు అమ్మి బతుకుతున్నాను. విశాఖ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను.
    -ఎం.సునీల్, వస్త్రవ్యాపారి
     
    సీజన్‌వారీగా వస్తుంటా
    తెలంగాణ నుంచి గోపాలపట్నం వచ్చి బతుకుతున్నాను. స్వస్థలంలో టీవీ కవర్లు, టేబుల్‌ కవర్లు అమ్ముతున్నా అక్కడ పోటీ విపరీతంగా ఉండడం, ధరలు గిట్టుబాటు కాకపోవడంతో ఇలా సీజన్‌ సమయాల్లో, పండుగల వేళల్లో గోపాలపట్నం వచ్చి చిరు వ్యాపారం చేసి వెళ్తుంటాను. బతకడానికి ఇక్కడ బాగుంది.
    -అల్లె వాసు, కల్వకుర్తి, తెలంగాణ 
     
     
     
     
మరిన్ని వార్తలు