అమ్మ నుంచి ప్రాణహాని..!

13 Jun, 2016 09:19 IST|Sakshi

‘‘అమ్మ నుంచి మాకు ప్రాణ హాని ఉంది.. కూలీ పని చేసి రోజు డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తోంది. బడి కెళ్తానని మాట ఎత్తితే చెరువులో వేసేందుకు యత్నించింది..మేం ప్రతి రోజూ నరకం అనుభవిస్తున్నాం. అందరూ ఉన్నా అనాథల్లా బతుకుతున్నాం.’’ అంటూ వెలుగోడుకు చెందిన హుసేన్, షరీఫ్‌  కంటతడిపెడుతూ తమ దీనగాథను చెప్పారు. సమస్యల మధ్య ఉండలేక ఊరు వదిలి కర్నూలుకు వచ్చిన ఆ చిన్నారులు ఏడుస్తూ స్థానిక రాజ్‌విహార్‌ సెంటర్‌లో కనిపించారు. వీరిని ‘సాక్షి’ పలుకరించగా తమ కష్టాలను చెప్పుకున్నారు.     

కర్నూలు: వెలుగోడుకు చెందిన సాలెహాకు 2002 మార్చిలో నంద్యాల సమీపంలోని పోలూరుకు చెందిన షాహిన్‌తో వివాహం చేశారు. షాహిన్‌ తాగుబోతు కావడంతో పెళ్లయిన రెండేళ్లకే తన భర్తను వదిలేసి సాలెహా తల్లి వద్దే ఉంటోంది. ఆమెకు హుసేన్, షరీఫ్‌ ఇద్దరు కుమారులు. తాగుబోతుకు పుట్టిన పిల్లలు కూడా అలాగే అవుతారని వారిని వదిలించుకునేందుకు ఎన్నో యత్నాలు చేసింది.

ఈ నేపథ్యంలో ఆమె చెల్లెలు జియావున్నిసా...చిన్నారులను చేరదీసింది. ప్రస్తుతం హుసేన్‌ 8వ తరగతి, షరీఫ్‌ 7వ తరగతి వెలుగోడులోని హైస్కూల్‌లో చదువుకున్నారు. మిషన్‌ కుట్టి వచ్చిన సొమ్ముతో వారిని పోషిస్తోంది. తన పిల్లలు చెల్లెలు వద్ద ఉండడంతో ఆమెపై కేసు పెట్టారు. ఆమె భర్తను జైలుకు పంపారు. పిల్లల్ని బడికి పంప వద్దని, పనికి వెళ్లి రోజుకు రూ.100 చొప్పున తీసుకురావాలని తల్లి సాలెహా వేధిస్తోంది. బడికి వెళ్లి బాగా చదువుకుంటామని చెప్పిన పాపానికి దుర్భాషలాడి పిల్లలను చెరువులో వేసి చంపబోయింది.

చివరకు చెల్లెలుపై దాడులు చేసి ఇంట్లో ఉన్న సమాన్లు అంతా తీసుకెళ్లింది. కుట్టు మిషను కూడా తీసుకెళ్లడం, భర్తను జైలులో పెట్టించడంతో జియావున్నీసా ప్రస్తుతం జీవనోపాధి లేక భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది.  పిన్ని ఇబ్బందులు చూడలేని చిన్నారులు ఎటైనా వెళ్దామని ఊరు వదిలి కర్నూలుకు వచ్చేశారు. వీళ్లను వెతుక్కుంటూ కర్నూలుకు వచ్చిన జియావున్నీసా..తమ దీనగాథన చెబుతూ కన్నీళ్లు పెట్టుకొంది. తన భర్తపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసి హుసేన్, షరీఫ్‌లకు దారి చూపి న్యాయం చేయాలని ఆమె వేడుకుంది.

మరిన్ని వార్తలు