బతుకు ‘బస్తా’

24 Jul, 2016 23:36 IST|Sakshi
బతుకు ‘బస్తా’
  • పాత బస్తాలు కుడుతూ పలుకుటుంబాల జీవనం
  • పని దొరికితే కూలి..లేకుంటే పస్తులే మరి
  • జిల్లాకేంద్రంలో మారని కార్మికుల ‘అతుకుల’ బతుకులు

  • పాతబస్తాలే వారి పొట్ట నింపుతున్నాయి. చిరిగిన గోనెసంచులకు అతుకులేసి..కొత్త బస్తాలు తయారు చేసే పనిలో అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. పత్తి, మిరప, ధాన్యం, సరుకులు నింపుకునేందుకు..పలు రకాల సైజుల్లో తయారు చేసి అమ్ముకోవడం ద్వారా ఉపాధి చూసుకుంటున్నారు. ఏళ్లుగా ఇదే పని చేస్తున్నా..ఎలాంటి ఎదుగూబొదుగూ లేక..అన్‌సీజన్‌లో పని దొరకక..అప్పులు భారమై..ఇళ్లు గడవడం కష్టమై అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక, రాయితీ రుణాలు లభించక జిల్లా వ్యాప్తంగా వెయ్యికిపైగా కుటుంబాల వారు..‘అతుకుల’ బతుకులతో అష్టకష్టాలు పడుతున్నారు.


    ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రం ఖమ్మంతో పాటు, నియోజకవర్గ కేంద్రాలు, పలు మండలాల్లో పాత బస్తాలు కుడుతూ, వాటితో తిరిగి కొత్త బస్తాలు తయారు చేస్తూ వెయ్యికిపైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. ఖమ్మం నగరంలో 70 పాత బస్తాల తయారీ, విక్రయ దుకాణాలు ఉన్నాయి. కార్మికులే తయారు చేసుకుంటూ, వారే కొట్లు నిర్వహించుకుంటున్నారు. కిరాణ దుకాణాలు, దాల్, రైస్‌ మిల్లులు, రేషన్‌ షాపుల్లో చిరిగి, పనికిరాని వాటిని బస్తాకు రూ.7 లేదా రూ.8 పెట్టి కొంటారు. ఈ బస్తాలను పూర్తిగా విప్పేసి, అతుకులు వేసి, తిరిగి మిషన్‌పై కుడతారు. పత్తి, మిరప, ధాన్యం నింపుకునేందుకు వివిధ సైజుల్లో తయారు చేస్తారు. పత్తి బస్తా అయితే 40 నుంచి 50 కిలోలు పట్టేలా, మిర్చిబస్తా అయితే 30 నుంచి 40 కిలోలు పట్టేలా, మొక్కజొన్నకు 60 కిలోలు, ధాన్యం బస్తా అయితే 70 కిలోలు పట్టేలా..మూడు పాత బస్తాలతో ఒక కొత్త బస్తాను రూపొందిస్తారు. రోజుకు 30 నుంచి 40 బస్తాల వరకు తయారు చేస్తుంటారు. మొత్తంమీద పాత బస్తాల నుంచి కొత్తగా ఇంకో బస్తా తయారు చేసేందుకు రూ.15పైనే ఖర్చవుతుంది. పెట్టిన ఖర్చులు పోను సీజన్‌ను బట్టి ఒక్కో బస్తాకు రూ.3 రూపాయల వరకు లాభం వస్తుంది. చిత్తు కాగితాలు నింపే బస్తాలను, వాటర్‌ బాటిళ్లు, పాత ఇనుప సామాన్లు నింపుకునేలా ప్లాస్టిక్‌ పట్టాలతో బోరాలను తయారు చేస్తారు.

    • సీజన్‌..అన్‌సీజన్‌

    రైతులకు పంటల దిగుబడి చేతికొచ్చే కాలమే వీరికి సీజన్‌. అంటే అక్టోబర్‌ నుంచి వేసవికాలం వరకు గిరాకీ ఉంటుంది. పాత బస్తాల కోసం తిరగడం, వాటిని కొట్టుకు చేర్చడం, అతుకులు, కుట్లు వేసి కొత్త బస్తాలు తయారు చేయడం ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకు కూలి లభిస్తుంది. పత్తి, మిర్చి, ధాన్యం దిగుబడులొస్తున్నప్పుడు బస్తాల విక్రయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఆ కాలంలో ఒక్కో మనిషి రోజుకు రూ.500 వరకు ఆదాయం పొందుతారు. ఆ తర్వాతి రోజుల్లో పాత బస్తాలను కుట్టి నిల్వ ఉంచుతారు. కొన్నింటిని దుకాణాలకు తిరిగి విక్రయిస్తారు. ఎక్కువ కొనుగోళ్లు లేక కూలి కూడా గిట్టుబాటు కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏడాదిలో ఆరు నెలలే ఎక్కువగా పని ఉంటుంది. అన్‌ సీజన్‌ అయిన..వర్షాకాలంలో బస్తాలను నిల్వ చేస్తూ, అప్పులు చేసి కుటుంబాలను సాకుతారు. ఇతర పనులు రాక, చేయలేక, ఈ పని నుంచి దూర కాలేక అవస్థలను ఎదుర్కొంటున్నారు.

    • రుణం..భారం

    పాత బస్తాల కొనుగోలు, దుకాణానికి అడ్వాన్స్, కిరాయి, ఇంటి అద్దె భారమవుతోంది. పాత బస్తాల వ్యాపారానికి కనీసం రూ.50వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. అన్‌ సీజన్‌లో విక్రయాలు లేక, అప్పులకు వడ్డీలు కట్టలేక కార్మికులు చాలా ఇబ్బంది పడుతుంటారు. చాలా కుటుంబాల్లో మహిళలు, పిల్లలు కూడా ఇదే పనిలో ఉన్నారు. చేతితో, మిషన్లతో కుడుతున్నారు. తమకు బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వడం లేదని, ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని వీరు వేడుకుంటున్నారు.

     

మరిన్ని వార్తలు