‘కరువు’పై కదలరేం?

9 Nov, 2015 01:49 IST|Sakshi
‘కరువు’పై కదలరేం?

కోతలు పూర్తవుతున్నా అతీగతీ లేని కరువు మండలాల ప్రకటన
♦ సమయం మించిపోతున్నా మీనమేషాలు లెక్కిస్తున్న సర్కారు
♦ కేంద్ర బృందాలు కోతలయ్యాక వస్తే ఏం లాభం?
♦ కేంద్ర సాయం తగ్గే అవకాశం ఉందంటున్న నిపుణులు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పంటలు పండక, అప్పులు తీర్చలేక రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. గతేడాది మాదిరే ఈసారి కూడా ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి వద్దకు కరువు మండలాల నివేదిక వెళ్లినా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. కరువు కొలమానాలన్నింటినీ లెక్కలోకి తీసుకొని మొదటగా 66 మండలాల్లోనే కరువు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ విమర్శలు రావడంతో కొలమానాలను సడలించి వాటి సంఖ్య మరింత పెంచేలా నివేదిక తయారుచేశారు. ఎన్ని మండలాలను ప్రకటించాలనే అంశంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది.

 ఆలస్యమైతే ఆర్థిక సాయంపై ప్రభావం
 రాష్ట్రంలో ఖరీఫ్ పంటల కాలం సెప్టెంబర్‌తో ముగిసింది. ప్రస్తుతం అనేక పంటలు పూర్తవగా కొన్ని చివరి దశలో ఉన్నాయి. పత్తి తీయడం దాదాపు సగం పూర్తయింది. మినుములు, పెసలు, జొన్న, మొక్కజొన్న కోతలు పూర్తయ్యాయి. వరి, కంది, కొంత భాగం పత్తి మాత్రమే చేలల్లో ఉన్నాయి. కనీసం ఈ పరిస్థితుల్లోనైనా కేంద్ర బృందం వచ్చి పంటలను పరిశీలిస్తే గానీ నష్టం అంచనా వేయడానికి అవకాశం ఉండదు.  కరువు మండలాలు ప్రకటించాక దాదాపు నెలన్నరకు గానీ కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉండదు. కానీ పంటలన్నీ చేతికొచ్చాక కేంద్రం బృందం పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తుందన్నది ప్రశ్న. ఆలస్యమైతే కేంద్రం నుంచి అందే సాయం సగానికి సగం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.
 
 నెల కిందటే ప్రకటించిన పలు రాష్ట్రాలు
 
అనేక రాష్ట్రాలు నెల రోజుల కిందటే కరువును ప్రకటించి కేంద్రానికి నివేదిక పంపాయి. కొన్ని రాష్ట్రాలు కేంద్ర బృందం రాక కోసం ఎదురుచూడకుండా రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాయి. ఒడిశాలో 30 జిల్లాలుంటే 12 జిల్లాలను ఆ రాష్ట్రం కరువుగా ప్రకటించి రైతులకు రూ.వెయ్యి కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం 28 జిల్లాల్లో 98 తాలుకాలను కరువుగా ప్రకటించి రైతులకు రూ.200 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా 35 జిల్లాలను కరువుగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 14,708 గ్రామాలను కరువుగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ కూడా కరువు ప్రాంతాలను ప్రకటించింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోందని సీనియర్ ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణం కరువు మండలాలు ప్రకటించి ఆర్థిక సాయం అందించాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు