పింఛన్లకు పీఠముడి

30 Jan, 2017 23:25 IST|Sakshi
పింఛన్లకు పీఠముడి
- టీడీపీ నేతల్లో విభేదాలు
- రాష్ట్రంలోనే అరుదైన సమస్య
కోడుమూరు : రాజకీయ విభేదాల కారణంగా అభాగ్యులకు ప్రభుత్వం మంజూరు చేసే కొత్త పింఛన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో 174 నియోజకవర్గాల్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. కోడుమూరు నియోజకవర్గన్ని ఇందలో మినహాయించినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి ప్రభుత్వం 2వేల పింఛన్లను మంజూరు చేసింది. జనాభా ప్రతిపాదికన గ్రామాల వారిగా లబ్ధిదారుల జాబితాను ఎంపిక చేసి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి ప్రభుత్వానికి ఎంపీడీఓల ద్వారా నివేదికను పంపారు. ప్రొటోకాల్‌ పాటించకుండా తనకు కనీస సమాచారమివ్వకుండా ఏకపక్షంగా పింఛన్లను ఎంపిక చేయడమేగాకా, అనర్హులకు మంజూరు చేశారన్న కారణాలు చూపుతూ ఎమ్మెల్యే మణిగాంధీ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఆర్‌డీఏ అధికారులు నియోజకవర్గమంతా పర్యటిస్తూ విచారణ చేశారు.
 
ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా పింఛన్ల జాబితాను విడుదల చేసేందుకు అధికారులు భయపడుతున్నారు. ఫిబ్రవరి నెలకు కొత్త పింఛన్ల జాబితా విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయినట్లేనని అధికారులు తెలియజేస్తున్నారు. కోడుమూరు మండలానికి 494, గూడూరు మండలానికి 496మందికి పింఛన్లు. సి.బెళగల్‌ మండలానికి 411పింఛన్లు, కర్నూలు మండలానికి 597మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు ఎంపీడీఓలు ప్రభుత్వానికి లబ్ధిదారుల జాబితాను పంపారు. అయితే ప్రభుత్వం నుంచి కొత్త పింఛన్ల మంజూరుకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో పాతపింఛన్ల జాబితాను, పింఛన్ల డబ్బును బ్యాంకుల నుంచి డ్రా చేసుకొని పంపిణీ చేసేందుకు అన్ని విధాల రంగం సిద్ధం చేసుకున్నారు. 
 
విభేదాలే కారణం..
జన్మభూమి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రప్రభుత్వం నియోజకవర్గానికి 2000వేల చొప్పున పింఛన్లు కేటాయించింది. ఆత్మకూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలకు చెరి సగం పింఛన్లు విభజించుకొని ఎవరికి వారు జాబితాను తయారు చేసుకొని అధికారులకు పంపారు. అయితే కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య సమన్వయం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. తన అనుమతి లేకుండా జాబితా తయారైందని విభేదిస్తూ మణిగాంధీ కొత్త పింఛన్ల మంజూరును నిలుపుదల చేయించినట్లు సమాచారం. ఇద్దరి నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా పేదవాళ్లకందాల్సిన పింఛన్ల సొమ్ము దూరమైంది. ఎన్నో రోజులుగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అభాగ్యుల ఆశలు ఆవిరైపోయాయి. 
కొత్త పింఛన్లు మంజూరు కాలేదు : సిద్ధలింగమూర్తి, ఎంపీడీఓ, సి.బెళగల్‌
జాబితా పంపినప్పటికీ కొత్త పింఛన్లు మంజూరు కాలేదు. మంజూరైన  వెంటనే లబ్ధిదారులకు అందజేస్తాం. 
 
మరిన్ని వార్తలు