మందస్తు డీల్‌.. రోడ్లు మారాయి

5 Jul, 2017 04:53 IST|Sakshi
మందస్తు డీల్‌.. రోడ్లు మారాయి
హైవేపై ముందుగానే తెరిచారు
 
జమ్మలమడుగు: సుప్రీంకోర్టు జాతీయ రహదారులకు 500 మీటర్ల, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యంషాపులను ఏర్పాటు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైవేలపై ఉన్న మద్యం షాపులను ఇళ్ల మధ్యకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో జిల్లావ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ జమ్మలమడుగులో అలాంటివేమీ చోటుచేసుకోలేదు. కారణం రాష్ట్ర హైవేలను జిల్లా రహదారులుగా మార్చుతామని పాలకుల నుంచి ముందే సమాచారం అధికారపార్టీ నాయకులకు రావడమే. జాతీయ రహదారి అయిన ముద్దనూరు రోడ్డును వదిలి తాడిపత్రి రహదారి వైపు బ్రాందీషాపులను వారంకిందటి నుంచే మార్చుకునే ప్రయత్నాలు చేశారు. అందులోభాగంగా ఒకటో తేదీనుంచే పట్టణంలో తాడిపత్రి రోడ్డులో మూడు బ్రాందీషాపులు తెరుచుకున్నాయి. అయితే రాష్ట్ర హైవేలను జిల్లా రహదారులుగా ప్రభుత్వం జీఓను మంగళవారం విడుదల చేసింది. విషయం ముందుగానే తెలియడంతోనే సంజామల మోటు నుంచి మోరగుడి మోటు వరకు మొత్తం బ్రాందీషాపులు ఇప్పటికే వెలిశాయి.
 
సాక్షి ప్రతినిధి, కడప: మద్యం సిండికేట్లతో ప్రభుత్వ పెద్దలకు కుదిరిన ముందస్తు డీల్‌తో జిల్లాలోని 1,130.906 కిలోమీటర్ల స్టేట్‌హైవే రోడ్డును ప్రభుత్వం జిల్లా మేజర్‌ రోడ్లుగా మార్చింది. దీంతో ఇప్పటిదాకా ఉన్న 90శాతం మద్యం దుకాణాలకు సుప్రీంకోర్టు తీర్పు దెబ్బతప్పింది. రోడ్లు మనవే తోసేయ్‌ అనేలా వ్యాపారులు యథాతథంగా ప్రస్తుత స్టేట్‌హైవే రోడ్లకు ఆనుకుని ఉన్న భవనాల కోసం వేట ప్రారంభించారు.
 
సిండికేట్లదే పెత్తనం
జిల్లాలో 255 మద్యం దుకాణాలతో పాటు, గత ఏడాది ఉన్న 19 బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు అదనంగా 11 బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఏర్పాటుచేయడానికి ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించింది. ఈ సంఖ్య మేరకు దుకాణాలు, బార్ల ఏర్పాటుకు అవసరమైన లైసెన్సుల మంజూరుకు ఎక్సైజ్‌ శాఖ అధికారిక ప్రక్రియ పూర్తి చేసింది. రోడ్డుప్రమాదాలను కట్టడి చేయడం కోసం హైవేలను ఆనుకుని 500 మీటర్ల దూరం తర్వాతే మద్యం దుకాణాలు, బార్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేస్తే తమ వ్యాపారాలు దెబ్బతింటాయనీ, ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గుతుందని రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు మన జిల్లాలోని మద్యం సిండికేట్లు కూడా ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిడి తెచ్చాయి.

ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడానికి ఆమ్యామ్యాలు సమర్పించుకున్నాయి. ఈ ముందస్తు సెటిల్‌మెంట్ల కారణంగా గత నెల 28, 29 వ తేదీలకే స్టేట్‌హైవేలన్నీ జిల్లా మేజర్‌ రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాల్సి ఉంది. అయితే జనావాసాల్లో  మద్యం షాపులు ఏర్పాటు చేయించి ప్రజల నుంచి వ్యతిరేకత తెప్పించి హైవేలను జిల్లా రోడ్లుగా మార్చే ఎత్తుగడ వేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఈ వ్యూహం అమలు చేసి ప్రజల ఆందోళనలు దృష్టిలోఉంచుకుని రోడ్లస్థాయి తగ్గించినట్లు కథ నడపించారు. సినిమాకు ఈ తరహా ముగింపు ఉంటుందని ముందే తెలిసిన కొందరు సిండికేట్‌ పెద్దలు సుమారు 100 మద్యం దుకాణాల ఏర్పాటుకు  లైసెన్సులు తీసుకోవడానికి ఎగబడకుండా ఎదురుచూశారు. మంగళవారం రాత్రి రాష్ట్ర  హైవేలను జిల్లా మేజర్‌ రోడ్లుగా మారుస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమ దుకాణాలు తెరిచేందు కు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకున్నారు.
 
కొన్నిచోట్లే ఇబ్బందులు
జిల్లాలో  కర్నూలు– చిత్తూరు, కడప– బాలుపల్లి, రాయచోటి– అంగళ్లు,  కొండాపురం–బద్వేలు మధ్య సుమారు 500 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిని ఆనుకుని దగ్గర్లో ఏర్పాటైన మద్యం దుకాణాలు చాలా తక్కువ ఉన్నాయి. బార్లయితే కడప, రాజంపేటలో రెండు మాత్రమే ఉన్నాయి. జాతీయ రహదారులు వెళ్లే ప్రతిచోట రింగ్‌రోడ్డు లేదా బైపాస్‌ రోడ్లు ఉండటంతో అత్యధిక మద్యం దుకాణాలు స్టేట్‌హైవేలను ఆనుకునే ఉన్నాయి. ఈ  ప్రకారం జిల్లాలో 1,130.906 కిలోమీటర్ల స్టేట్‌హైవే రోడ్డు ఉండగా,  55.437 కిలోమీటర్లు మాత్రమే జిల్లా మేజర్‌ రోడ్లు ఉన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్టేట్‌హైవేలన్నీ జిల్లా మేజర్‌రోడ్లుగా మారుతున్నాయి. దీంతో ఇప్పటికే హైవేలను ఆనుకుని మద్యం వ్యాపారం చేస్తున్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది.

దువ్వూరు, ఖాజీపేట, మైదుకూరు, కోడూరు, బద్వేలు, రాజంపేటల్లో మాత్రం చాలాతక్కువ మద్యం దుకాణాలకు ఇబ్బంది కలుగుతుంది. వీటిని కూడా ప్రస్తుత స్టేట్‌హైవేల్లో సర్దుబాటు చేయడానికి అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా మద్యం దుకాణాల ఏర్పాటుపై ప్రజల్లో సాగుతున్న ఆందోళనలు తగ్గిపోయి మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

సినిమా

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్