వారే డిక్టేటర్స్‌

13 Sep, 2016 22:26 IST|Sakshi
వారే డిక్టేటర్స్‌
ఎక్సైజ్‌ వ్యవస్థను శాసిస్తున్న సిండికేట్లు
ప్రభుత్వ లక్ష్యాలు చేరాలంటే వారే కీలకం
కేసులు ఎవరిపై... ఎప్పుడు నమోదు చేసేదీ నిర్దేశించేది వారే
బెల్టుషాపులు.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు దశానిర్దేశం వారిదే
అధికారులు కేవలం నిమిత్తమాత్రులే...
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మద్యాన్ని పూటుగా తాగించాలి. గతేడాది కన్న 15శాతం అదనంగా విక్రయాలు జరిగేలా చూడాలి. ఏం చేస్తారో తెలియదు... ప్రభుత్వానికి మద్యం ఆదాయం భారీగా రావాలి.’ ఇదీ ఎక్సైజ్‌ అధికారులకు ప్రభుత్వమిచ్చిన లక్ష్యం. ఉన్నవి 207షాపులు... 27బార్లు... ఎంతైనా వీటిలోనే విక్రయించాలి. లైసెన్సు షాపు యజమానులకే ఆ బాధ్యత అప్పగించాలి. అందువల్ల సిండికేట్లను ఆశ్రయించక తప్పట్లేదు. వారి గొంతెమ్మ కోర్కెలకు అధికారులు దాసోహం కాక తప్పడం లేదు. ఇదే అదనుగా ఎమ్మార్పీకి మించి విక్రయించినా... లెక్కలేనన్ని అక్రమ బార్లు నడిపిస్తున్నా... ఇష్టానుసారం బెల్టుషాపులు ఏర్పాటు చేస్తున్నా... అధికారులు కిమ్మనడంలేదు. ఇప్పుడు జిల్లాలో ఎక్సైజ్‌ను శాసిస్తున్నది సిండికేట్లే. ప్రభుత్వమిచ్చిన లక్ష్యం మేరకు విక్రయాలు జరగాలంటే లైసెన్సు షాపులతో అయ్యే పనికాదు. ఇక తప్పనిసరిగా బెల్ట్‌షాపులు ఏర్పాటు చేయాలి. రోజురోజుకూ వీటి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల వేలంపాట నిర్వహించి మరీ ఏర్పాటు చేస్తున్నారు. ఒకప్పుడు జిల్లాలో మూడు నాలుగు వేలు ఉండే బెల్ట్‌షాపులు ఇప్పుడవి 10వేలకు దాటిపోయాయి. వ్యాపారులు అంతటితో ఆగలేదు. ఎంఆర్‌పీకి మించి విక్రయించుకునే అవకాశమిస్తేనే లక్ష్యాల మేర అమ్మగలమని కండిషన్‌ పెట్టారు. చేసేదేమి లేక ఎక్సైజ్‌ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.
 
 
లొసుగులకు పచ్చ జెండా
గతేడాది సెప్టెంబర్‌లో లక్షా 52వేల 300 ఐఎంఎల్‌ కేసులు, 57,848బీరు కేసులు విక్రయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సెప్టెంబర్‌లో దానికి 15శాతం పెంచి విక్రయాలు జరపాలి. ఈ ఒక్క సెప్టెంబర్‌లోనే కాదు దాదాపు ప్రతీ నెలా, గతేడాది అదే నెలలో చేసిన విక్రయాలకు 15శాతం అదనంగా విక్రయాలు చేపట్టాలి. అంటే మద్యం ఆదాయాన్ని పెంచుతూ రావాలి. దీని కోసం ఎక్సైజ్‌ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. లొసుగులన్నింటికీ పచ్చ జెండా ఊపేస్తున్నారు. బయటికి చెప్పలేకపోయినా కాదనడానికి ఏమీ లేదు. 
 
 
సిండికేట్ల డైరెక్షన్‌ ప్రకారమే
ప్రభుత్వ లక్ష్యాల మేరకు విక్రయాలు జరపాల్సి రావడంతో ఎక్సైజ్‌ అధికారులు నిమిత్తమాత్రులైపోయారు. సిండికేట్‌గా మారిన వ్యాపారుల డైరెక్షన్‌ మేరకే నడుచుకోవల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రేక్షక పాత్ర పోషించడం వల్లనే విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు, ఎంఆర్‌పీకి మించి విక్రయాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. కొన్ని చోట్ల క్వార్టర్‌ బాటిల్‌పై రూ. 5నుంచి రూ. 10, మరికొన్నిచోట్ల రూ. 10 నుంచి రూ. 15కు పెంచి అమ్ముకుంటున్నారు. దీనికి కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు వత్తాసు పలుకుతున్నారు. వారి కనుసన్నల్లోనే బెల్ట్‌ షాపుల ఏర్పాటుకు వేలం పాటలు కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. నేతల అండదండల గురించైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎవరికి అందాల్సిన ముడుపులు వారికి అందడంతో అక్రమాలకు తనవంతు సహకరిస్తున్నారు.   
పథకం ప్రకారమే కేసులు
ఇంత అడ్డగోలుగా జరుగుతున్న విక్రయాలపై స్పందించలేదనే అపవాదు ఎక్సైజ్‌ అధికారులకు రాకుండా సిండికేట్లే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. సందర్భాను సారంగా ఎవరిపైన ఎంఆర్‌పీ ఉల్లంఘన కేసు పెట్టాలన్నదానిపై సిండికేట్లు డిక్టేట్‌ చేస్తున్నాయి. వారే లాటరీ వేస్తారు. అందులో ఏ షాపు పేరు పలికితే దానిపై కేసు పెట్టేలా అధికారులకు సంకేతాలిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ కేసు పరిష్కారానికయ్యే ఖర్చు అంతా సిండికేట్‌లో ఉన్న వ్యాపారులంతా భరిస్తారు. ఇప్పుడిదొక సంప్రదాయంగా సాగిపోతోంది.  ఇలా సిండికేట్ల డైరెక్షన్‌ కొనసాగుతుండటం వల్లనే ఎంఆర్‌పీ ఉల్లంఘన కేసులు పెద్దగా నమోదు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 11కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో ఒక్క కొత్తవలస సర్కిల్‌లో మాత్రం మూడు కేసులు నమోదవ్వగా, మిగతా నెల్లిమర్ల, విజయనగరం–1, గజపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, తెర్లాంలో ఒక్కొక్క కేసే నమోదైంది. అడ్డగోలుగా ఎంఆర్‌పీకి మించి విక్రయాలు ప్రతీచోట జరుగుతున్నాయి. కానీ, ఉల్లంఘన కేసులు మాత్రం ఇప్పటికి ఐదు నెలలవుతన్నా కేవలం 11 నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
 
>
మరిన్ని వార్తలు