ఒంటరి మహిళలకు అసరా

9 Jan, 2017 01:53 IST|Sakshi
ఒంటరి మహిళలకు అసరా

జిల్లాలో 16 వేల మంది ..
వీరిలో అర్హులను గుర్తించాల్సి ఉంది
జీవన భృతి రూ. వెయ్యి అందించనున్న ప్రభుత్వం
మార్చి నుంచి అమలు


అండగా ఎవరూలేని ఒంటరి పేద మహిళలకు ఇకపై రాష్ట్ర సర్కారు అండగా నిలువనుంది. వారికి ప్రతి నెల జీవన భృతి రూ.1000 అందించనుంది. ఈ పథకాన్ని మార్చిలో ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడంతో జిల్లాలోని ఒంటరి మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం భర్త వదిలేసిన , జోగినులు, పెళ్లి కాని వారికి వర్తించనుంది.

ఇందూరు : ఏ అండాలేని నిరుపేద ఒంటరి మహిళల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్‌ యోగితా రాణాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. సకల జనుల సర్వే, డీఆర్‌డీఏ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం జిల్లాలో ఒంటరి మహిళలు 16 వేల మంది వరకు ఉన్నారు. వీరిలో అర్హులను గుర్తించాల్సి ఉంది. గ్రామాలు, పట్టణాల్లో మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యదర్శి ద్వారా దరఖాస్తులు స్వీకరించి, పరిశీలన అనంతరం అర్హులను గుర్తించి ప్రభుత్వానికి కలెక్టర్‌ ఆమోదంతో పంపుతారు.

ఎదురు చూపులకు దక్కిన ఫలితం...
జిల్లాలో ఎవరి అండా లేకుండా సమాజంలో దుర్భర జీవితాలను అనుభవిస్తున్న మహిళలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎప్పటి నుంచో బలమైన వాదన ఉంది. మండల కార్యాలయాల్లో అలాంటి మహిళలు అయ్యా.. మాకు దిక్కు... మొక్కు.. ఎవ్వరూ లేరు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించండి అని చాలాసార్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఎలాంటి ఆర్థిక సాయం మంజూరు కాలేదు. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు  కూడా చాలసార్లు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఒంటరి జీవనం సాగిస్తున్న జోగినులు, భర్తల నుంచి విడిపోయిన, పెళ్లి కాని మహిళలను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, ప్రభుత్వానికి కూడా ఒంటరి మహిళల జీవనానికి సంక్షేమాన్ని అందించాలన్న ఆలోచన రావడంతో జీవన భృతి ఇవ్వాలనే ఆలోచనకు దారి తీసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షలు పొందకుండా ఉన్న ఒంటరి మహిళలకు ప్రభుత్వం నుంచి వచ్చే జీవన భృతి అందనుంది.

అనాథ పిల్లలకూ ప్రభుత్వమే తల్లీ తండ్రి...
ఒంటరి మహిళలనే కాకుండా అనాథ పిల్లలకూ ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అనాథ పిల్లలు కాబట్టి వారికి కులం, మతం ఉండదు. దీంతో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సర్టిఫికెట్‌లు తీసే విషయంలో ఇలాంటి పిల్లలకు సర్కార్వ తల్లీ దండ్రులుగా ఉంటుందని, వారి బాగోగులు చూస్తామని ప్రకటించడంతో వారికి కొండంత అండగా మారింది. వారి చదువులు, ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలో 18 ఏళ్లలోపు  300 మందిపైగా అనాథ పిల్లలున్నారు. వీరు ప్రభుత్వంచే నడిచే బాల సదనాల్లో నివాసం ఉంటూ చదువుకుంటున్నారు.

>
మరిన్ని వార్తలు