దగా పడ్డ బతుకులు!

6 Aug, 2016 09:47 IST|Sakshi
దగా పడ్డ బతుకులు!
 • బతుకు తెరువు పేరుతో మోసం
 • ఉపాధి కల్పిస్తామంటూ వ్యభిచారకూపంలోకి నెట్టేస్తున్న ట్రాఫికర్లు
 • పునరావాసం పేరుతో వెనక్కు రప్పించుకుని ఉపాధి చూపని ప్రభుత్వం
 • ట్రాఫికర్లకు, ప్రభుత్వానికి తేడాలేదంటున్న బాధితులు
 • ఒకరికి వశమై... మరొకరికి పండై.. ఎపుడూ ఎడారై... ఎందరికో ఒయాసిస్సై... తనువంతా పుండై... తాను శవమై... అంటూ అభ్యుదయ కవి కలం నుంచి జారివాలిన ఈ పదాలు ఓ వేశ్య జీవితానికి అద్దం పడుతున్నాయి. నిత్యమూ కరువు కాటకాలతో విలవిల్లాడుతున్న అనంతపురం జిల్లాలోని యువతులకు గాలం వేసిన కొందరు ఉపాధి పేరుతో వారిని ముంబై, కొల్‌కత్తా... తదితర మహానగరాలకు తరలించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేశారు. అక్కడ ఎంతో దయనీయ జీవితాన్ని గడిపిన వారికి పునరావాసం కల్పిస్తామంటూ నమ్మబలికి వెనక్కు పిలుచుకువచ్చిన ప్రభుత్వం...  తర్వాత తిరిగి వారి గురించి పట్టించుకోవడం లేదు. బతుకు తెరువు లేక.. సమాజంలో గౌరవం లేక వారి పరిస్థితి మరింత దిగజారింది. ఉపాధి పేరుతో తమను వ్యభిచార కూపంలోకి నెట్టినవాడికి, జీవనోపాధుల పేరుతో దగా చేసిన ప్రభుత్వానికి తేడా ఏముందంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు.
  – కదిరి అర్బన్‌


  కరువు... అనంతపురం జిల్లా ఆర్థిక స్థితిని పూర్తిగా దిగజార్చిన ఈ మహమ్మారి దెబ్బకు నిరుపేదలు శలభల్లా మాడిపోతున్నారు. ఉపాధి... వలసల పేరుతో బతుకులు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. పేదల సంక్షేమమే ద్యేయంగా హామీలు గుప్పిస్తూ అధికారంలోకి వచ్చిన పాలకులు... తర్వాత అదే పేదల సంక్షేమానికి తిలోదకాలిచ్చేస్తుండడంతో పేదల బతుకులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బయట రాష్ట్రాలకు పొట్టకూటి కోసం వెళ్లిన పురుషుల పరిస్థితి కొద్దోగొప్పో మంచిగానే ఉన్నా... మహిళల పరిస్థితి మాత్రం దారుణంగా మారింది.
  ట్రాఫికర్ల మాయాజాలం
  జిల్లాలోనే కదిరి ప్రాంతంలో కరువు ఛాయలు ఎక్కువ. కుటుంబ పోషణ కోసం ఈ ప్రాంత నిరుపేదలు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఇలాంటి తరుణంలోనే అమాయక గ్రామీణుల జీవితాలను అవకాశంగా తీసుకున్న కొందరు చెలరేగిపోయారు. పరాయి రాష్ట్రంలో పెద్దల ఇళ్లలో పాచి పనికి కుదిరిస్తామంంటూ యువతులు, మహిళలకు ఆశ చూపారు. వారి మాటలు నమ్మి వెంట వెళితే... పూణే, ఢిల్లీ, ముంబయి... తదితర ప్రాంతాల్లో నిర్ధయగా వ్యభిచార కూపంలో దింపారు. అవసరాలు తీరిన తర్వాత విక్రయించి సొమ్ము చేసుకున్నారు. దేశంలో ఎక్కడ రెస్క్యూ ఆపరేషన్‌ జరిగినా అనంతపురం జిల్లా మహిళలు పట్టుబడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కదిరి ప్రాంతంలోనే 150 మందికి పైగా మహిళలను వ్యభిచార కూపం నుంచి పోలీసులు, అధికారులు కాపాడి, తీసుకువచ్చారు.
  ఉపాధి లభ్యం కాక...
  తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్న ఆ దిశగా పెట్టుబడిదారులను ప్రభుత్వం ప్రోత్సహించకపోవడం కూడా జిల్లా వెనుకబాటుతనానికి కారణమైంది. ఇలాంటి తరుణంలో నెలకు రూ. 5వేలు సంపాదించడం సామాన్యులకు గగనమే అయింది. ఈ పరిస్థితులను ట్రాఫికర్లు సొమ్ము చేసుకోసాగారు. నగరాల్లో నెలకు రూ. 25 వేలు సులువుగా సంపాదించవచ్చు అంటూ అమాయక యువతులను నమ్మించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే జిల్లాలోనే ఉపాధి అవకాశలు మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బయటి ప్రాంతాలకెళ్లి రూ. 25 వేలు సంపాదించడం కన్నా... స్థానికంగా పరిశ్రమల్లో రూ. 10 వేలు వచ్చిన బాధిత యువతుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుంది.
  ట్రాఫికర్లపై చర్యలు శూన్యం
  యువతులను వ్యభిచార కూపంలోకి దించుతున్న ట్రాఫికర్లపై కఠిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగానే ఈ వ్యవస్థ పునరావృతమవుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌ ద్వారా ఓ పది మందిని వెనక్కు తీసుకువస్తే... రెండు రోజుల వ్యవధిలోనే కొత్తగా 20 మందిని వ్యభిచార రొంపిలోకి ట్రాఫికర్లు దించుతున్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే ట్రాఫికర్లపై కఠినచర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అదే సమయంలో వారి చేతిలో మోసపోయిన యువతులకు మెరుగైన పరిహారంతో పాటు పునరావాసం కల్పించి ఆదుకోవాలని పేర్కొంటున్నారు.

  రూ. 10 వేలతో సరిపెట్టారు
  నన్ను 2012లో ముంబయిలోని కామటి పుర నుంచి తీసుకువచ్చారు. ఆ సమయంలో కలెక్టర్‌ కార్యాలయంలో రూ. 10వేలు ఇచ్చారు. పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం నాకు ఆరోగ్యం బాగాలేదు. నాలుగేళ్ల క్రితం నా భర్త చనిపోయాడు. వితంతువు పెన్షన్‌ మంజూరు చేయాలంటూ అధికారులకు చాలా సార్లు అర్జీలు ఇచ్చాను. ఇంత వరకూ ఎవరూ పట్టించుకోలేదు. పునరావాసం అంటే ఇదేనా?
  – కె.తిరుపతిబాయి, కదిరి ప్రాంతం

  పునరావాసం పేరుతో మోసం చేశారు
  ఉపాధి చూపిస్తామంటూ బ్రోకర్లు మోసం చేశారు. పునరావాసం కల్పిస్తామంటూ అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి ప్రభుత్వం కూడా మోసం చేసింది. కుటుంబ పోషణ కోసం చాలా కష్టపడుతున్నాం. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మా గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చి మీ బతుకు మీరు బతకండి అంటూ వదిలేశారు.
  – లలిత, కదిరి ప్రాంతం
   
  సమాజంలో ఛీత్కారాలు
  డబ్బు కోసం నానాతిప్పలు పడుతున్నప్పుడు నగరాల్లో మెరుగైన ఉపాధి చూపిస్తామంటూ కొందరు ఆశ చూపారు. నమ్మి వారి వెంట పోతే నట్టేట ముంచారు. ఇంటికి తిరిగొస్తే సమాజంలో ఛీత్కారాలు... ఈసడింపులు. ఏదైనా పనిచేసుకుని బతుకుదామంటే ప్రభుత్వ సాయం లేదు. భర్త చనిపోయాడు. వితంతు పెన్షన్‌ కావాలని దరఖాస్తు చేసుకుంటే దిక్కులేకుండా పోయింది. ఇలాగైతే ఎలా బతకాలి.
  – బి.తిరుపతిబాయి, కదిరి ప్రాంతం

  గట్టి నిఘా ఏర్పాటు చేశాం
  మహిళల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. చదువురాని అమాయక యువతులకు ఎవరైనా బయట ఉపాధి కల్పిస్తామంటే వారి గురించి పూర్తిగా ఆరా తీస్తాం. ఈ విషయంలో మా సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోంది.  
  – వెంకటప్రసాద్, కదిరి రూరల్‌ మండల ఎస్‌ఐ

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా