భోజనంలో బల్లి!

24 Apr, 2017 00:26 IST|Sakshi
భోజనంలో బల్లి!

ఎస్కేయూలో క్యాంటిన్‌లో ఘటన
–ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు ఆసుపత్రిలో చేరిక
–కామన్‌ మెస్‌కు తాళం వేసి ఆందోళన చేసిన విద్యార్థులు

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని కామన్‌మెస్‌లో ఆదివారం మధ్యాహ్నం భోజనంలో బల్లిపడి విషతుల్యం కావడంతో ఐదుగురు  విద్యార్థులు, ఇద్దరు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అరగంటలోపే వాంతులు, వీరేచనాలు కావడంతో బాధితులను హుటాహుటీన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక విద్యార్థికి ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం చేస్తున్నారు.

గ్రూప్‌–3 రాత పరీక్షతో తప్పిన ముప్పు
కామన్‌ మెస్‌కు 1,070 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఆదివారం గ్రూప్‌–3 రాతపరీక్ష జరగడంతో కేవలం ఐదుగురు మాత్రమే మెస్‌కు హాజరయ్యారు. వీరితో పాటు సహపంక్తిలో భోజనం చేసిన ఇద్దరు ఉద్యోగులు (మెస్‌ వర్కర్లు) అస్వస్థకు లోనయ్యారు. దీంతో హరికృష్ణ యాదవ్, అనిల్‌ కుమార్‌ , గంగరాజు, మద్దయ్య, బాలముని (విద్యార్థులు), ఆంజినేయులు, అమర్‌నాథ్‌ (ఉద్యోగులు/వర్కర్లు)  మొత్తం భోజనం చేసిన వారంతా అనారోగ్యం పాలయ్యారు.  

మెస్‌కు తాళం వేసి ఆందోళన :
ఆహారం తిన్న విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో , అప్పటికే పరీక్ష రాసి వర్సిటీకి చేరుకున్న విద్యార్థులు కామన్‌మెస్‌కు తాళం వేసి ఆందోళన నిర్వహించారు. నాసిరకమైన ఆహారం అందించడం నిత్యకృత్యంగా మారిందని విద్యార్థులు ఆరోపించారు.

పరామర్శ :
అస్వస్థతకు గురైన విద్యార్థులను, ఉద్యోగులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి,  వైఎస్సార్‌సీపీ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఎర్రిస్వామి రెడ్డి, పార్టీ నాయకులు  చవ్వా రాజశేఖర్‌ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఉన్నతాధికారులను సూచించారు. వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, నరేంద్ర రెడ్డి, భానుప్రకాష్‌ రెడ్డి, జయచంద్రా రెడ్డి, ఆకుల రాఘవేంద్ర రెడ్డి ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్‌ యాదవ్‌ తదితురులు కూడా  బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంతకుముందు చికిత్స తీసుకుంటున్న వారిని  రిజిస్ట్రార్‌ ఆచార్య కే.సుధాకర్‌ బాబు, వార్డెన్‌ హుస్సేన్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ సీఎన్‌ కృష్ణానాయక్‌ పరామర్శించారు.

నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్‌:
ఆదివారం జరిగిన ఘటనలో బాధ్యులైన నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌ ‘ సాక్షి’కి తెలిపారు. ఘటనకు బాధ్యులైన కె.ఉజ్జినయ్య, ఎం. జయప్ప, బి.నాగరాజు, కె.రామాంజినేయులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. వార్డెన్, డిప్యూటీ వార్డెన్‌ నివేదిక అనుగుణంగా ఉద్యోగులపై తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆరా
వర్సిటీలో ఆదివారం వెలుగులోకి వచ్చిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఎస్కేయూ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఆదివారం సాయంత్రం ఓ లేఖ పంపారు. ఘటనపై సమగ్ర వివరాలు అందజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు