త్వరలో ‘స్థానిక’ మండలి సమరం!

6 Feb, 2017 23:58 IST|Sakshi
త్వరలో ‘స్థానిక’ మండలి సమరం!
- ముగియనున్న ఎమ్మెల్సీ భాస్కర రామారావు పదవీ కాలం
- మొదలుకానున్న ఎన్నికల ప్రక్రియ
- నెలాఖరుకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం
కాకినాడ సిటీ : శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో రంగం సిద్ధమవుతోంది. 2011లో జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్, కార్పొరేషన్, మున్సిపల్‌ ప్రజాప్రతినిధుల ద్వారా బొడ్డు భాస్కర రామారావు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన ఆరేళ్ల పదవీ కాలం మే ఒకటో తేదీతో ముగియనుంది. ఈ గడువు మరో రెండు నెలల 20 రోజులు మాత్రమే ఉండడంతో.. ఎన్నికల ప్రక్రియకు త్వరలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఖాళీ కానున్న స్థానిక సంస్థల నియోజకవర్గాలపై ఆయా జిల్లాల ఎన్నికల అధికారులకు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఇప్పటికే సమాచారం అందించారు. ఓటర్ల జాబితాలతో అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు ఓటర్ల జాబితాలను అధికార యంత్రాంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్‌ విడుదలైతే అదే రోజు నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుంది.
1,467 మంది ఓటర్లు
జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గానికి మొత్తం 1,467 మంది ఓటర్లున్నారు. జిల్లా పరిషత్‌ నుంచి చైర్‌పర్సన్, జెడ్పీటీసీ సభ్యులు; మండల పరిషత్‌ల నుంచి ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు; రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నుంచి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు; తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, రామచంద్రపురం, మండపేట, అమలాపురం పురపాలక సంఘాల నుంచి చైర్మన్లు, కౌన్సిలర్లు; ముమ్మిడివరం, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయితీల నుంచి చైర్మన్లు, వార్డు సభ్యులు ఓటర్లుగా ఉంటారు. కాకినాడ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగకపోవడంతో ఇక్కడి నుంచి ఓటర్లు లేరు. 2011లో ఎన్నిక సమయంలోనూ ఇక్కడ ఓటర్లు లేక పోవడం విశేషం. అలాగే గతంలో నగర పంచాయతీలు లేవు. ఇవి కొత్తగా ఏర్పడడంతో అక్కడి సభ్యులు కూడా ఈసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మరిన్ని వార్తలు