ఏకగ్రీవమా? పోటీనా?

1 Mar, 2017 00:29 IST|Sakshi

- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురి నామినేషన్‌
- టీడీపీ తరఫున దీపక్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి
- స్వతంత్ర అభ్యర్థిగా పైలా
- పైలా నామినేషన్‌ ఉపసంహరించుకోకపోతే పోలింగ్‌ అనివార్యం


అనంతపురం అర్బన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకోవాలనుకున్న టీడీపీ ఆశలు అడియాసలయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా తాడిపత్రి పట్టణానికి చెందిన పైలా నరసింహయ్య నామినేషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే పోటీ అనివార్యం కానుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. చివరిరోజు టీడీపీ అభ్యర్థి గుణపాటి దీపక్‌రెడ్డి (మూడు సెట్లు), ఆయనకు సపోర్ట్‌గా ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జూటూరు అస్మిత్‌రెడ్డి (ఒక సెట్టు) నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా(రెండు సెట్లు) నామినేషన్‌ వేశారు.

వీరు తమ నామినేషన్‌ పత్రాలను కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంకు అందజేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంది.  దీంతో ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవంగా దక్కుతుందని టీడీపీ నాయకులు భావించారు. అయితే అనూహ్యంగా సీపీఐకి చెందిన పైలా నరసింహయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన ఫిబ్రవరి 21 నుంచి నుంచి 27వ తేదీ వరకు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. చివరిరోజు మాత్రం ముగ్గురు వేశారు. టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి ఒక్కరే నామినేషన్‌ వేసి ఉంటే ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమయ్యేది. పైలా కూడా నామినేషన్‌ వేయడంతో పోలింగ్‌ అనివార్యమయ్యేలా కన్పిస్తోంది.   అయితే.. ఈ నెల మూడున నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంది.  దీపక్‌రెడ్డికి సపోర్ట్‌గా వేసిన జూటూరు అస్మిత్‌రెడ్డి నామినేషన్‌  ఉపసంహరించుకుంటారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఇక పైలా నరసింహయ్య తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకపోతే  టీడీపీ ‘ఏకగ్రీవ ఆశలు’ గల్లంతవుతాయి.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగా
– పైలా నరసింహయ్య
    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను విస్మరించి టీడీపీ సామాజిక న్యాయం పాటించడంలేదు. సరికదా ఎన్నికను ఏకగ్రీవం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని చూస్తోంది. ఇది జరగకూడదనే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశా. సామాజిక న్యాయాన్ని అనుసరించి టీడీపీ టికెట్‌ ఇచ్చి ఉంటే పోటీ చేసేవాడిని కాదు. తెలంగాణకు చెందిన దీపక్‌రెడ్డికి ఇక్కడ టికెట్‌ ఇవ్వడమేంటి?  ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా సమీకరణలు నాకున్నాయి.  

టీడీపీ అభ్యర్థిదే విజయం
– మంత్రి కొల్లు రవీంద్ర
    స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి విజయం సాధిస్తారని జిల్లా టీడీపీ ఇన్‌చార్జ్‌, మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీపక్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి ఆయనతో పాటు మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కాలవ శ్రీనివాసులు, విప్‌ యామినీబాల, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, జెడ్పీ చైర్మన్‌ చమన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నామినేషన్‌ ప్రక్రియ అనంతరం విలేకరులతో  మంత్రులు, ఇతర నాయకులు, అభ్యర్థి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందన్నారు. ఏకగ్రీవ ఎన్నికకు అందరూ సహకరించాలని కోరారు.

నేడు నామినేషన్ల పరిశీలన
     స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన బుధవారం నిర్వహిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు మూడో తేదీ ఆఖరు. 17న పోలింగ్‌, 20వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఓటర్లుగా ఉంటారు. మునిసిపాలిటీల్లో ఎక్స్‌ అఫిషియో సభ్యులు కాని ఎమ్మెల్యేలకు మాత్రం ఓటు హక్కు ఉండదు. ఉరవకొండ, రాప్తాడు, పెనుకొండ, శింగనమల నియోజకవర్గాల పరిధిలో మునిసిపాలిటీలు లేనందున ఈ నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఓటు  ఉండదు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 1,278 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎంపీటీసీ సభ్యులు 832 మంది, జెడ్పీటీసీ సభ్యుడు 63 మంది, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 367 మంది, ఎమ్మెల్యేలు 10 మంది, ఎమ్మెల్సీలు నలుగురు, ఇద్దరు ఎంపీలు ఓటర్లుగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు