స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురూ!

15 Feb, 2017 23:39 IST|Sakshi
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురూ!
- రిటర్నింగ్‌ అధికారిగా జేసీ హరికిరణ్‌
- 9 మంది ఎమ్మెల్యేలకు ఓటర్లుగా అవకాశం
- ఈ నెల 21న నోటిఫికేషన్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ వ్యవహరించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలయింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 21ను జారీ కానుంది. ఆదే రోజు నుంచి 28 వరకు నామినేషన్‌లు స్వీకరిస్తారు. మార్చి1 నామినేషన్‌ల పరిశీలన ఉంటుంది. నామినేషన్‌ల ఉపసంహరణకు మార్చి 3వరకు అవకాశం ఉంటుంది. మార్చి 17న పోలింగ్‌ జరుగుతుంది. కాగా.. గతంలో జరిగిన ఎన్నికలకు కూడ జేసీనే రిటర్నింగ్‌ అధికారిగా ఉండి సమర్థవంతంగా నిర్వహించారు. మరోసారి కూడా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికలను రిటర్నింగ్‌ అధికారి హోదాలో జేసీ నిర్వహించనున్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు  శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. 
 
మున్సిపాలిటీల పరిధిలో ఎమ్మెల్యేలకు ఓటు హక్కు..
స్థానిక సంస్థల నియోజకవర్గంలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉన్నారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు ఎక్స్‌ అఫీసియో సభ్యులుగా ఉన్నందున వీరు కూడ ఓటర్లుగా ఉంటారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరుగనందున కర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలకు ఓటు లేకుండా పోయింది. మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు లేనందున సంబంధిత ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. ఆళ్లగడ్డ, నంద్యాల, కోడుమూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, బనగానపల్లె, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్‌ నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలు ఉండటం, వాటిల్లో ఎమ్మెల్యేలు ఎక్స్‌ అఫీసియో సభ్యులుగా ఉండటం వల్ల ఓటర్లుగా ఉంటున్నారని తెలిపారు. 
 
ఎంపీలకూ అవకాశం..
 మున్సిపాలిటీల్లో ఎంపీలు ఎక్స్‌ అఫీసియో సభ్యులుగా ఉంటారు. దీంతో వారు కూడా ఓటర్లు ఉంటారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వీరు ఏదో ఒక మున్సిపాలిటీలో మాత్రమే సభ్యులుగా ఉండాలి. గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కర్నూలు నగరపాలక సంస్థలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఎన్నికలు జరుగకపోవడంతో ఎంపీ ఓటరుగా అర్హత పొందలేకపోయారు. ఈ సారి కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని అధికారులు తెలిపారు. నంద్యాల ఎంపీ మాత్రం స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఓటరుగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. ఓటర్ల జాబితాను తయారు చేయడంపై అధికారులు దృష్టి సారించారు. 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు