అంత్యంత మాత్రమే

26 Jul, 2016 22:34 IST|Sakshi
అంత్యంత మాత్రమే
పుష్కర ఏర్పాట్లపై చొరవ చూపని ప్రజాప్రతినిధులు 
నోరుమెదపని రూరల్‌ ఎమ్మెల్యే, ఎంపీ 
ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే కారణమా?
నగరపాలక సంస్థ అధికారులపైనే ఏర్పాట్ల భారం
బెల్లం చుట్టూ ఈగలు ముసిరిన ట్టుగా.. డబ్బులు వచ్చే అవకాశమున్న ఏ కార్యక్రమంలోనైనా రాజకీయ నేతల హడావిడి కనిపిస్తుంటుంది. అదే డబ్బులు రాని కార్యక్రమాలైతే.. ఆ దరిదాపుల్లోనే రాజకీయ నేతలు కనిపించరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గోదావరి అంత్య పుష్కరాలే. గతేడాది గోదావరి పుష్కరాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లంతా తామే నిర్వహిస్తున్నట్టుగా హడావిడి చేశారు. తీరా అంత్య పుష్కరాలవిషయానికొచ్చే సరికి కనీసం వాటి ఊసెత్తే ప్రజాప్రతినిధే కరువయ్యారు. 
– సాక్షి, రాజమహేంద్రవరం
 
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో.. 
అంత్య పుష్కరాల ఏర్పాట్లను నగరపాలక సంస్థ యంత్రాంగమే చేస్తోంది. నెలరోజుల ముందు నుంచే ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కమిషనర్, అంత్యపుష్కరాల నోడల్‌ అధికారి వి.విజయరామరాజు కసరత్తు చేశారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులతో చర్చించారు. వరదలతో ఘాట్లపై పేరుకుపోయిన బురదను అగ్నిమాపకశాఖ తొలగించాల్సిన ఉన్నా, సమయం దగ్గరపడుతుండడంతో  నగరపాలక సంస్థ సిబ్బందితో తొలగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఘాట్లలో సీసీ కెమారాలను పునరుద్ధరిస్తున్నారు. అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు వివిధ సేవలందించేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థలతో సమావేశాలు నిర్వహించి వారు చేయాల్సి పనులపై సూచనలు చేస్తున్నారు. 
గోదావరి పుష్కరాలకు గతేడాది నగరపాలక సంస్థ రూ.240 కోట్లతో ప్రతిపాదనలు పంపింది. ఇందులో నగరంలోని 50 డివిజన్లలో అవసరమైన చోట రోడ్లు వేయడం, దెబ్బతిన్న వాటì కి మరమ్మతులు చేయడం, నగర సుందరీకరణ పేరుతో నగరపాలక సంస్థ పాఠశాలలకు రంగులు వేయడం వంటి అనేక పనులకు నిధులు కే టాయించాలని ప్రభుత్వానికి విన్నవించింది. వీటిలో తమ పరిధిలో చేసే పనులలో కమీషన్లు వస్తాయని కార్పొరేటర్లు, తమకు గంపగుత్తగా ముడుపులు అందుతాయని ఎమ్మెల్యే, ఎంపీలు పుష్కరాలు ప్రారంభానికి నెలల ముందు నుంచి తెగ హడావిడి చేశారు. అంతేకాదు వచ్చే ఏడాది అంత్యపుష్కరాలనూ ఘనంగా నిర్వహిస్తామని ఆయా ప్రజాప్రతినిధులు శపథం చేశారు.
 
ఇంకా నాలుగురోజులే ఉంది..
ఈ నెల 31 నుంచి గోదావరి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 11 వరకు ఇవి జరగనున్నాయి. రోజుకు సుమారు 1.5 లక్షల మంది వస్తారని యంత్రాంగం అంచనా వేస్తోంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. ఇక ప్రారంభానికి కేవలం నాలుగు రోజుల సమయమున్నా ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై ప్రజాప్రతినిధులు ఎక్కడా మాట్లాడలేదు. ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో కనీసం పరిశీలించేవారే కరువయ్యారు. దీనికి కారణం అంత్య పుష్కరాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరం, రాష్ట్రంలో జరిగే ఏ చిన్న విషయంపైనైనా విలేకర్ల సమావేశాల్లో అదరగొట్టే రాజమహేంద్రవరం రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు అంత్యపుష్కరాలపై నోరుమెదపకపోవడం విశేషం. ఇక రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి మురళీమోహన్‌ గతేడాది పుష్కరాలు ముగింపు రోజున ప్రధాన రైల్వే స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించి పుష్కరాలను ఘనంగా నిర్వహించామని, ఇదే విధంగా అంత్యపుష్కరాలు, గోదావరి ఉత్సవాలు కలిపి బ్రహ్మాండంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఇక్కడ అంత్య పుష్కరాల ముగింపు, అక్కడ కృష్ణా పుష్కరాలు ఆరంభం అంటూ గొప్పగా చెప్పారు. తీరా అంత్యపుష్కరాలు సమీపిస్తున్న ఆయన కనీసం స్పందించలేదు. నేతలిచ్చిన హామీలపై నిలదీయాల్సిన ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు మిన్నుకుండిపోయారు. కొద్దోగొప్పో నగరపాలక సంస్థ మేయర్‌ పంతం రజనీశేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఘాట్లు పరిశీలిస్తూ ఏర్పాట్లపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు