దేశీయ విత్తనమే జాతికి పునాది

29 Jul, 2016 21:28 IST|Sakshi
దేశీయ విత్తనమే జాతికి పునాది
  •   ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ దేశీవిత్తన సంబరంలో వక్తలు
  •  కొరిటపాడు (గుంటూరు): దేశీయ విత్తనమే మన జాతికి పునాది అని వివిధ రాష్ట్రాల దేశీ విత్తనోద్యమకారులు ఎలుగెత్తిచాటారు. హరిత భారతి ట్రస్టు(విజయవాడ) ఆధ్వర్యంలో నగరంలోని వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ దేశీ విత్తన సంబరంలో పలువురు విత్తనోద్యమకారులు ప్రసంగించారు. కర్ణాటకకు చెందిన జాతీయ విత్తన ఉద్యమకారుడు Mýష్ణప్రసాద్‌ మాట్లాడుతూ నేలే మనకు తల్లి అని, మనం ఏ విత్తనం నాటితే తల్లి ఆ విత్తనాలను వందల పాలబిడ్డలుగా అందిస్తుందని చెప్పారు. దేశీయ లేదా సొంత విత్తనమే మన వ్యవసాయానికి పునాది అని, ఆ పునాదిని బలంగా నిర్మించడమే ఈ దేశీయ విత్తన సంబరమని పేర్కొన్నారు. హరిత భారతి ట్రస్టు నిర్వాహకుడు సీహెచ్‌ త్రినాథ్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు భాస్కరన్‌ మాట్లాడుతూ పాలేకర్‌ సూచనలకు అనుగుణంగా రైతులు సహజ వ్యవసాయంపై మక్కువ చూపాలని కోరారు. వేప నూనె, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరప కాయలతో కషాయం తయారు చేసి చీడపీడలను నివారించుకోవాలని చెప్పారు. వరి పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే చిన్న చిన్న పురుగులను ఏరుకుని తింటాయన్నారు. వక్తలు వారి వారి రాష్ట్రాల్లో సాగు చేసిన దేశవాళీ విత్తనాల గురించి తెలియజేశారు. వారి రాష్ట్రాల్లో పండించిన పంటల విధానాల గురించి క్లుప్తంగా వివరించారు. రైతుల నుంచి హామీపత్రం తీసుకుని ఉచితంగా 5 రకాల దేశవాళీ వరి విత్తనాలు, కంది విత్తనాలు 100 గ్రాములు చొప్పున అందజేశారు. కార్యక్రమంలో జాతీయ పత్తి సలహా సంఘం సభ్యుడు డాక్టర్‌ డీ నరసింహారెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త ఇంద్రసేనారెడ్డి, తమిళనాడుకు చెందిన దేశీ విత్తన ఉద్యమకారుడు జయచంద్రన్, రామస్వామి, సోంపేటకు చెందిన ఢిల్లీరావు, పద్మజ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారుగా రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. 
     
     
     
     
మరిన్ని వార్తలు