లాకప్ డెత్ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్సీ

24 Aug, 2015 18:17 IST|Sakshi

హైదరాబాద్: ఆసిఫ్ నగర్ లో చోటు చేసుకున్న నక్కల పద్మ లాకప్ డెత్  కేసును మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. లాకప్ డెత్ ఘటనపై సెప్టెంబర్ 11లోగా నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సీపీని ఆదేశించింది. దీంతో పాటు ఉస్మానియా సూపరింటెండెంట్, కలెక్టర్లకు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది.

ఓ కేసుకు సంబంధించి నక్కల పద్మను  ఆసిఫ్ నగర్ పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు.  ఎక్కువ సమయం పోలీసు స్టేషన్‌లో పెట్టడం వల్ల అస్వస్థతకు గురవడంతో శనివారం రాత్రి 11.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  చికిత్స పొందుతూ ఆమె తెల్లవారుజామున 4 గంటలకే మృతి చెందిందని తెలుస్తోంది. అయితే 6.30 గంటలకు చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు.  షుగర్ లెవల్స్, పల్స్ రేట్ పడిపోవడంతో కోమాలోకి వెళ్లి మరణించిందని అంటున్నారు. కాగా మృతురాలి శరీరంపై గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సీఐ, ఎస్సై, ఏఎస్సై తో సహా ఏడుగుర్ని నగర సీపీ మహేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు.

మరిన్ని వార్తలు