అంతా ఆర్భాటమే..

19 Apr, 2017 00:00 IST|Sakshi
అంతా ఆర్భాటమే..
చిన్నబాబు రాకతో అనవసర హైరానా
సీఎం కుమారుడైనందునే అతి ప్రాధాన్యం
కరప సభలో నవ్వులపాలు
అంబేడ్కర్‌ జయంతికి వర్ధంతి అన్నట్టుగానే 
తాగునీరు లేని ఇబ్బందులు కలుగజేస్తానంటూ ఉపన్యాసం
కాబోయే సీఎం అంటూ చినరాజప్ప భజనతో జనం చిరాకు
‘సాక్షి’పై అక్కసు షరా మామూలే  ∙  
ప్యాకేజీ గొప్పంటూ పాత పాటే
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మునుపెన్నడూ జిల్లాలో మరే మంత్రికి ఇవ్వని ప్రాధాన్యం చినబాబు కు ఇచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి జిల్లాకు వచ్చిన నారా లోకేష్‌కు మంగళవారం జిల్లా పార్టీ నాయకులు, అధికారులు ఇచ్చిన ప్రాధాన్యం పార్టీ సీనియర్లను విస్మయానికి గురి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కల్పించిన ప్రాధాన్యం ఇప్పుడు కనిపించింది. సీఎం చంద్రబాబు తనయుడు కావడంతోనే అటు పార్టీ నేతలు, ఇటు అధికారులు అంత టి అగ్రతాంబూలం వేయడానికి కారణమైందని చర్చ జరుగుతోంది. లోకేష్‌ పర్యటన ఏర్పాట్లు చూసిన వారంతా సీఎం చంద్రబాబు పర్యటనలో కంటే మించిపోయాయని చర్చించుకోవడం కనిపించింది. పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పలు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కరప సభలో లోకేష్‌ ప్రసంగిస్తూ తాగునీరు లేని ఇబ్బందులు కలుగజేస్తానంటూ గొంతెత్తి చెప్పడంతో  గొల్లున జనం నవ్వడంతో తరువాత సర్దుకున్నారు. లోకేష్‌ ప్రసంగంలో తన తండ్రి చంద్రబాబు గొప్ప నాయకుడిగా చెప్పే ప్రయత్నం చేస్తూ పేరు ఎత్తకుండానే  ప్రతిపక్షనేత, దొంగ పత్రిక, దొంగ చానల్‌ అంటూ ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కారు. తన తండ్రి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో యు టర్న్‌ తీసుకోవడం తప్పు కాదన్నట్టు ప్యాకేజీయే గొప్ప అన్నట్టుగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. తండ్రి చంద్రబాబు సీఎం అయ్యాక మూడేళ్లుగా జనం మంచినీటి సమస్యతో కొట్టుమిట్టాడుతుంటే వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో అన్ని గ్రామాలకు తాగునీరు, రోడ్లు, డ్రెయిన్లువంటి మౌలిక వసతులు కల్పిస్తానని లోకేష్‌ ప్రకటించడం జనానికి విడ్డూరంగా అనిపించింది. తన తండ్రి చంద్రబాబు స్టైల్‌లోనే  కేంద్ర ప్రభుత్వంతో విబేధిచాలంటే రెండు నిమిసాలు పట్టదని, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళుతూ సాధ్యమైనంత ఎక్కువగా నిధులు రాబడుతున్నామని గొప్పలు చెప్పడంలో లోకేష్‌ తండ్రిని మించిపోయారని పర్యటనలో జనం గుసగుసలాడుకోవడం వినిపించింది. పల్లె తల్లిలాంటిది, పట్నం ప్రియురాలు వంటిదని చెబుతూ, తల్లి రమ్మంటుంది, ప్రియురాలు తెమ్మంటుందంటూ పలు ఛలోక్తులు కూడా వేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను ఇటీవల పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో నిలబెట్టి మాట్లాడినట్టు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో ఇక్కడకు వచ్చేసరికి లోకేష్‌ ఉప ముఖ్యమంత్రికి ఎనలేని గౌరవం ఇచ్చినట్టు కనిపించారు. వేదికపై తన కోసం వేసిన సింహాసనంలాంటి కుర్చీలో చినరాజప్పను కూర్చోబెట్టి తనపై పడ్డ మచ్చను చెరిపేసుకునే ప్రయత్నం చేశారు. రాయించి తెచ్చుకున్న స్ట్రిప్ట్‌ను కరప సమావేశంలో 17 నిమిషాలు ప్రసంగించే సందర్భంలో లోకేష్‌ తడబడటమే కాకుండా తాగునీరు సమస్య పరిష్కారిస్తామనేందుకు బదులు రెండు మూడేళ్లలో ప్రతి పల్లెటూరుకు తాగునీరులేని ఇబ్బందిని కలుగజేస్తాననడంతో ఆశ్చర్యపోవడం జనం వంతైంది. కొద్దిసేపటికి తేరుకున్న లోకేష్‌ రెండేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సర్థిచెప్పుకునే ప్రయత్నం చేయడం కనిపించింది, అనుకున్న సమయానికన్నా రెండున్న గంటలు ఆలస్యం అవ్వడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు విసుగెత్తిపోయారు.
పలు శంఖుస్థాపనలు,,,
జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డుకు ఎంపికైన సామర్లకోట మండలం  జి. మేడపాడు గ్రామంలో జరిగిన అభివృద్ది పనులను సమీక్షించి వేళంగి, కరప గ్రామాల్లో రూ.24 కోట్లతో నిర్మించిన సామూహిక రక్షితమంచినీటి ప«థకాలకు, నడకుదురులో రూ.30 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనానికి, కరపలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.80 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంఖుస్ధాపన, తూరంగి బుల్లబ్బాయిరెడ్డి కాలనీ సమీపంలో రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. వాకలపూడి అంగన్‌ వాడీ కేంద్రానికి వస్తారని వాకలపూడిలోని 177 అంగన్‌ వాడీ కేంద్రానికి తీసుకు వచ్చిన గర్భిణీలు, బాలింతలు, చిన్నారులను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిరీక్షింప చేయడంతో నరక యాతన అనుభవించారు. 
దేనికీ స్పందించని జనం...
డ్వాక్రా మహిళలను పెద్ద సంఖ్యలో ఆటోల్లో, ట్రాక్టర్ల, వ్యానుల్లో  కరప తరలించారు. 24 గంటలు కరెంటు ఉంటుందా లేదా, మహిళలకు ,రైతులకు రుణమాఫీ జరిగిందా లేదా అంటూ వచ్చిన జనాన్ని లోకేష్‌ చేతెలెత్తమని అడిగినా స్పందన కనిపించ లేదు. కరపలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక మూడు నెలలకే 24 గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని గొప్పలకు పోయిన లోకేష్‌కు కాకినాడ అంబేడ్కర్‌ భవన్‌లో పంచాయతీరాజ్‌ సంస్థల ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా కరెంటుపోయి హాలులో చీకటి అలుముకోవడంతో బిత్తరపోయారు. వెంటనే నిర్వాహకులు జనరేటర్‌తో విద్యుత్‌ను పునరుద్ధరించడంతో ఊపిరిపీల్చుకోవడం కనిపించింది. గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించుకోలేకపోయారని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని స్వపక్షానికి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులే గోడు వెళ్లబోసుకోవడంతో లోకేష్‌ సమాధానం చెప్పలేక చూద్దాం, చేద్దాం అంటూ ముక్తాయించారు.
 
మరిన్ని వార్తలు