కూరగాయలవైపే మొగ్గు

10 Jul, 2016 01:40 IST|Sakshi
కూరగాయలవైపే మొగ్గు

పెరగనున్న  సాగు విస్తీర్ణం కురుస్తున్న వర్షాలు
సాగు వైపు చూపు 50 వేల హెక్టార్లకు చేరుకునే అవకాశం
సబ్సిడీ విత్తనాలతో ప్రోత్సహిస్తున్న ఉద్యాన శాఖ

 సాక్షి, సంగారెడ్డి: ఈ ఏడాది కూరగాయల సాగు విస్తీర్ణం పెరగనుంది. గత రెండేళ్లు తీవ్ర వర్షాభావంతో జిల్లాలో కూరగాయల సాగు తగ్గుముఖం పట్టింది. వర్షాభావానికి తోడు ఎండ తీవ్రత కారణంగా భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పంట చేతికి రాక రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుత  ఖరీఫ్‌లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూరగాయల సాగుకు ఆసక్తిచూపుతున్నారు. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో ప్రస్తుత ఖరీఫ్‌లో కూరగాయలు సాధారణ విస్తీర్ణాన్ని అధిగమించి సాగయ్యే అవకాశాలున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 42 వేల హెక్టార్ల మేర కూరగాయలు సాగు చేస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో కేవలం 31,576 హెక్టార్లలో  కూరగాయల సాగు చేశారు. కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో 50 వేల హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశాలున్నాయి. ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు కురవకపోవటంతో రైతులు అంతగా ఆసక్తి కనబర్చలేదు. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గజ్వేల్, సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్, సిద్దిపేట, జిన్నారం ప్రాంతాల్లోని రైతులు కూరగాయల సాగును ప్రారంభించారు.

నంగనూరు మండలంలో ఎక్కువగా మిర్చి సాగు చేస్తుండటగా, జిన్నారం, సంగారెడ్డి, గజ్వేల్, నర్సాపూర్ ప్రాంతాల్లో టమాటా, బెండ, బీర, సొరకాయ, పొట్లకాయ, కాకర, దొండ, పొట్లకాయ సాగును మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసిన పక్షంలో కూరగాయలు సాగు పెరగడంతోపాటు బోరుబావుల కింద సైతం సాగు పెరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే  జహీరాబాద్ నియోజకవర్గంలోని రైతులు అల్లం సాగును ఆరంభించారు. ఈ నియోజవకర్గంలోని సుమారు మూడువేల ఎకరాల్లో అల్లం పంట సాగవుతోంది. ఇదిలావుంటే ఉద్యానశాఖ అధికారులు ఖరీఫ్‌లో కూరగాయల విత్తనాలు సబ్సిడీపై అందజేస్తున్నారు.

గజ్వేల్‌లో అధికం..
జంటనగరాలకు సమీపంలో ఉండటంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు కూరగాయలు సాగు చేస్తారు. గజ్వేల్‌ను వెజిటబుల్ హబ్‌గా మార్చటంతోపాటు రిలయన్స్, ఐటీసీ, హెరిటేజ్ వంటి సంస్థలు రైతుల నుంచి నేరుగా కూరగాయలను సేకరిస్తున్నాయి.  పటాన్‌చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని రైతాంగం బోరుబావులు, ఆరుతడి పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు.

గత ఖరీఫ్‌లో...
గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 31,576 హెక్టార్లలో కూరగాయలు, 14,879 హెక్టార్లలో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ సాగైంది. కాగా ఈ ఏడాది 50 వేల హెక్టార్లలో కూరగాయలు మరో 15వేల హెక్టార్లలో పచ్చిమిర్చి, ఇతర పంటలు వేసే అవకాశాలున్నాయి. వర్షాలు కురుస్తుండటానికి తోడు కూరగాయల ధరలు ఆశాజనకంగా ఉంటాయని తెలుస్తోండటంతో రైతులు వీటిపై ఆసక్తిచూపుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5 నుంచి 7వేల హెక్టార్లు, జహీరాబాద్‌లో 8వేల హెక్టార్లు, సంగారెడ్డిలో 7వేల హెక్టార్లు, పటాన్‌చెరులో 2వేల హెక్టార్లు, నర్సాపూర్‌లో 3వేల హెక్టార్లు, సిద్దిపేటలో 4వేలు, దుబ్బాకలో 2వేల హెక్టార్ల వరకు సాగు చేసే అవకాశాలున్నాయి.

సబ్సిడీపై విత్తనాలు పంపిణీ..
ఈ ఖరీఫ్‌లో కూరగాయల సాగు పెరిగే అవకాశముంది. సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పచ్చి మిర్చి మినహా అన్ని కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందజేస్తోంది. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసే రైతులకు ఎప్పటికప్పుడు అవసరైమన సూచనలిచ్చేందుకు ఉద్యానశాఖ అధికారులను అందుబాటులో ఉంచాం. - రామలక్ష్మి, డీడీ, ఉద్యానశాఖ

>
మరిన్ని వార్తలు