తిరుమలలో బ్రహ్మోత్సవాలు: ఆర్జిత సేవల రద్దు

14 Sep, 2015 18:47 IST|Sakshi
తిరుమలలో బ్రహ్మోత్సవాలు: ఆర్జిత సేవల రద్దు

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో సాంబశివరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశామని, వీఐపీ దర్శనాలు కూడా తగ్గించామన్నారు. వాహన సేవ చూసేందుకు వచ్చే భక్తుల కోసం నాలుగు మాఢ వీధుల్లో గ్యాలరీలను ఏర్పాటు చేశామని చెప్పారు. గరుడ సేవ నాడు భక్తుల కోసం తిరుమలలో 512 ఆర్టీసీ బస్సులతో 3, 500 ట్రిప్పులు తిప్పుతామన్నారు. తిరుమలలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి మెట్టు మార్గం 24 గంటలు భక్తులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు త్వరితగతిన శ్రీవారిని దర్శించుకునేలా పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి తిరుమలలో23, తిరుపతిలో 4 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు మొదటిరోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సాంబశివరావు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సమయంలో విద్యుత్ సమస్యరాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తెలిపారు. బ్రహ్మోత్సవాల భద్రతకు ఎండీఆర్ఎఫ్ను రప్పించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని అర్బన్ ఎస్పీ గోపినాథ్ జెట్టి తెలిపారు. 6వేల మందితో బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. తిరుమల, తిరుపతిలో భక్తుల సౌకర్యార్థాం పోలీస్ కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు