లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు సీబీసీఐడీకి బదిలీ

1 Sep, 2016 19:13 IST|Sakshi

-మంగళగిరి కార్యాలయంలో వివరాలు సేకరణ
-త్వరితగతిన విచారించి నిందితులను జైలుకు పంపుతాం
-సీబీసీఐడీ ఎస్పీ కె.వి.మోహనరావు

మంగళ గిరి(గుంటూరు జిల్లా)

 లారీలు లేకుండా అక్రమంగా రిజస్ట్రేషన్లు ఎందుకు చేయాల్సివచ్చింది.. దాని వెనుక ఉన్న సూత్రధారులెవరు.. పాత్రధారులెవరనే అంశంపై లోతుగా విచారించి సాక్ష్యాలు సేకరించి నిందితులను జైలుకు పంపుతామని సీబీసీఐడీ ఎస్సీ కె.వి.మోహనరావు చెప్పారు. ఈ ఏడాది జూలై 11న 27లారీలు లేకుండానే కొందరు తమ పేరిట రిజస్ట్రేషన్లు చేయించుకోగా.. చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలో రవాణశాఖ ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేసింది. ఇందులో భాగంగా గురువారం మంగళగిరి ఎంవీఐ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ మోహనరావు ఇన్‌చార్జి ఎంవీఐ బాలకృష్ణను అడిగి వివరాలు సేకరించారు. ఎంవీఐతో కలిసి విధులు నిర్వహించిన సిబ్బంది స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మోహనరావు మాట్లాడుతూ.. సీఐడీ అధికారులను నాలుగు బృందాలుగా నియమించి విజయవాడ, మంగళగిరిల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కేసులో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారని, విచారణ వేగంగా చేసి అందరినీ సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తామని చెప్పారు.

 

మంగళగిరి పట్టణంలోని కొప్పురావు కాలనీ చిరునామాతో అనీల రవీంద్రనాథ్ 12 లారీలు, పొట్లూరి ఆనంద రవిశంకర్ 10 లారీలు, జూపల్లి పద్మావతి 2, నూతక్కి గ్రామం చిరునామాతో ఎలిశెట్టి లక్ష్మీనారాయణ 3 లారీలను కొనుగోలు చేసినట్లు రిజస్ట్రేషన్ చేయించగా.. వారికి విజయవాడ జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను అందజేసిందన్నారు. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన తరుణోమయ బాడీ బిల్డింగ్ కంపెనీ లారీలకు బాడీలు తయారుచేసినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా.. స్టార్ వేబ్రిడ్జి లారీల కాటా పత్రాలను సమకూర్చిందన్నారు. వారందరికీ ఎంవీఐ శివనాగేశ్వరరావు సహకరించడంతో ఇరవై నాలుగు గంటలలో మొత్తం వ్యవహారం నడిచిందని తెలిపారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సీఐలు రామచంద్రరావు, ఇంద్ర శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు