పౌల్ట్రీ... పల్టీ

1 Sep, 2016 01:00 IST|Sakshi
మూతపడిన పౌల్ట్రీఫామ్‌
 
రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఉత్పత్తి వ్యయం అంతకంతకూ పెరిగిపోతుండడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. కొన్నేళ్లుగా మొక్కజొన్న అధికంగా పండే రాష్ట్రాల్లో కరువు తాండవిస్తుండడంతో కోళ్లకు వేసే మేత ధర రెట్టింపైంది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయింది. దాణా ఉత్పత్తిలో కార్పొరేట్లు సిండికేట్‌ అవడంతో పౌల్ట్రీ రైతుల కష్టాలు వర్ణనాతీతం. ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమపై శీత కన్నేయడంతో చిన్నరైతులు దివాలా తీస్తున్నారు.
 
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం అనుసరిస్తున్న  విధానాలు పౌల్ట్రీ పరిశ్రమను నిండా ముంచేస్తున్నాయి. పౌల్ట్రీని వ్యవసాయ కేటగిరీ కిందlమార్చాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని పరిశ్రమ పెద్దలు అంటున్నారు. దీంతో పౌల్ట్రీకి వ్యవసాయ  రైతులకు ఇచ్చే సబ్సిడీలు వర్తించడం లేదని వాపోతున్నారు. చిన్నతరహా పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకతి కనికరించకపోవడంతో కోళ్ల మేత ఖర్చులు కూడా 25 శాతం వరకు పెరిగాయి. దీంతో ఉత్పత్తి ఖర్చులు రెట్టింపయ్యాయి. చికెన్, గుడ్డు ధరలు మాత్రం ఆశించినంత పెరగడం లేదు. గోడౌన్లలో పంపిణీ కాకుండా మగ్గిపోయి వథా అవుతున్న గోధుమలు, బియ్యాన్ని పౌల్ట్రీకి కేటాయించాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాపారులు అంటున్నారు. 
నష్టాల బాట.. ఫారాల మూత 
రాష్ట్రంలో దాదాపు 10 వేల వరకు కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఏటేటా నష్టాలు పెరుగుతుండడంతో ప్రతి సంవత్సరం వందకు తక్కువ కాకుండా ఫారాలను మూతపడుతున్నాయి. రాష్ట్రంలో కోడి మాంసం వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతున్నా.. ఉత్పత్తి వ్యయం పెరుగుతుండడంతో నష్టాలు పెరుగుతున్నాయి. దీంతో ఫారాలు మూసివేస్తున్నారు. దాణా దిగుమతికి ప్రభుత్వం అంగీకరించకపోవడం పరిశ్రమను మరింత కుంగదీసింది. స్థానికంగా కరువు పరిస్థితులు ఏర్పడడం.. దాణాను ఉత్పత్తి చేసే వ్యాపారులు సిండికేట్‌ అవడంతో ఉత్పత్తి ధర అమాంతం పెరిగింది. రాష్ట్రంలో 1.30 కోట్ల టన్నుల దాణా పరిశ్రమకు అవసరం అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 5 లక్షల టన్నుల దాణా దిగుమతికే అనుమతి ఇచ్చింది. దీని వల్ల స్థానికంగా ఉన్న అ«ధిక రేట్లతోనే దాణాను కొనుగోలు చేస్తున్నారు. 
పొంచి ఉన్న అమెరికా ముప్పు 
అమెరికా నుంచి కోడి మాంసాన్ని దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఉత్పత్తి అధికంగా ఉన్నా.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై పౌల్ట్రీ పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి నిర్ణయాలు దేశంలో అతి పెద్ద పరిశ్రమను దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక వేళ తప్పని సరి పరిస్థితి అయితే 108 శాతం సుంకం విధించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 5 సంవత్సరాల నుంచి కోల్డ్‌ స్టోరేజ్‌లో ఉంచిన మాంసాన్ని అమెరికా ప్రభుత్వం మనకు అంటగట్టాలని చూస్తోందని వారు వాపోతున్నారు.
రాయితీలు ఇవ్వాలి 
మిగతా పరిశ్రమలకు ఇచ్చే మాదిరిగానే పౌల్ట్రీకి కూడా ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలి. రాష్ట్రంలో తలసరి గుడ్ల వినియోగం చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తమిళనాడు ప్రభుత్వం తరహాలో హైస్కూల్‌ పిల్లలకు కూడా వారానికి ఆరు గుడ్లు ఇవ్వాలి. దీని వల్ల పిల్లలకు కూడా పౌష్టికాహారం అందించినట్లవుతుంది. – మధుసూదన్‌రెడ్డి, చైర్మన్, రాయలసీమ పౌల్ట్రీ రీజియన్‌
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు