మీ పార్టీ నాయకుడి వల్లే నష్టపోయాం

27 Jan, 2016 04:01 IST|Sakshi
మీ పార్టీ నాయకుడి వల్లే నష్టపోయాం

సీఎం ఎదుట కాల్‌మనీ బాధితుల ఆందోళన
వారించిన చంద్రబాబు నాయుడు


విజయవాడ (పటమట): ‘మీ పార్టీ నాయకుడి వల్లనే నష్టపోయాం, మా ఆస్తిని ఆక్రమించుకున్నారు’ అంటూ కాల్‌మనీ బాధితులు చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్న సమావేశంలో ఆందోళన దిగారు. హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, ఫన్‌టైమ్స్ ఆధ్వర్యంలో ఫన్‌టైమ్ క్లబ్‌లో జరుగుతున్న రాష్ర్టస్థాయి ఫల, పుష్ప ప్రదర్శన-2016 ముగింపు సభ మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కాల్‌మనీ బాధితుడు రేలంగి హనుమంతరావు, భార్య బేబి, బంధువులు ముఖ్యమంత్రిని కలిసేందుకు ఫన్‌టైమ్ క్లబ్‌కు చేరుకున్నారు. సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగానే నగరంలోని విద్యాధరపురానికి చెందిన కాల్‌మనీ బాధితుడు హనుమంతరావు మేనల్లుడు శివరామ్ సభలోనే పైకి లేచి ‘సీఎం గారు.. మీ పార్టీ నాయకుడి వల్లనే మేము తీవ్రంగా నష్టపోయాం, మమ్మల్ని మోసం చేసి మా స్థలాన్ని ఆక్రమించుకున్నారు’ అని గట్టిగా గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో కంగుతిన్న సీఎం వెంటనే స్పందించి ‘ఏయ్.. ఇక్కడ అలజడి చేయవద్దు, నలుగురిలో ఉన్నాం, సమస్యలు చెప్పడానికి ఒక వే (మార్గం) ఉంది, క్యాంపు కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పండి’ అంటూ గదమాయించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని శివరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సభపై ఉన్న బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వారిని వారించారు. సభ ముగిసి వెళ్లే సమయంలో బాధితులు ముఖ్యమంత్రిని కలిసి సమస్య విన్నవించగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..
బాధితులు రేలంగి హనుమంతరావు తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సమీప బంధువు బుద్దా భాస్కరరావు వద్ద తాను 2015 జూలై 31న రూ. 4 లక్షలను మూడు రూపాయల వడ్డీకి అప్పు తీసుకున్నామని, హామీగా కుమ్మరిపాలెం సెంటర్‌లోని 83గజాల పెంకుటింటి కాగితాలు పెట్టినట్లు తెలిపారు. ఆ సమయంలో తనఖా రిజిస్ట్రేషన్ అని నమ్మించి విక్రయ దస్తావేజుపై, స్టాంపు పేపర్, తెల్ల కాగితాలు, ప్రామిసరీ నోట్లపై తనతోను, కుటుంబసభ్యులతో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. వడ్డీ చెల్లించేందుకు నెలాఖరుకు వెళ్లగా రూ.3 వడ్డీ అయితే రూ.6 వడ్డీ చెల్లించాలని.. లేకపోతే తీసుకోనని చెప్పడంతో ఆస్తి పోతుందన్న భయంతో రూ.6 వడ్డీ చెల్లించినట్లు చెప్పారు. నాలుగో నెలలో అసలు సొమ్ము చెల్లిస్తాను, దస్తావేజులు ఇవ్వాలని కోరగా అవి బుద్దా వెంకన్న వద్ద ఉన్నాయని చెప్పాడని పేర్కొన్నారు. తన ఆస్తి కాగితాలు తనకు ఇవ్వాలని పలుమార్లు కోరగా... భాస్కరరావు తనతో ఆస్తి కొనుగోలు చేసినట్లు కాగితాల్లో రాయించుకున్నట్లు తెలిసిందని చెప్పారు. దీంతో ఆయనను నిలదీయగా తీవ్ర పదజాలాలతో దూషించి, మీకు దిక్కున్న చోట చెప్పుకోండని, ఆస్తి ఇవ్వాలని ఒత్తిడి చేస్తే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపారు.

ఈ విషయమై ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను కలవగా తమకు సంబంధం లేదని చెబుతున్నారని వివరించారు. ఆ తరువాత నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి సమస్యను వివరించగా ఆయన భాస్కరరావును పిలిపించి మాట్లాడుగా ఆయన కొనుగోలు చేసినట్లు దస్తావేజులు చూపించారని తెలిపారు. దీనిపైతమకు న్యాయం చేయాలని కోరామన్నారు. అప్పు చెల్లించేస్తాం, ఇంటి కాగితాలు ఇప్పించాలని వేడుకున్నామన్నారు. రూ.80లక్షలు విలువ చేసే ఆస్తిని నాలుగు లక్షలకు తీసుకోవడంతో ఏం చేయాలో తమకు తెలియడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలని కోరేందుకు వచ్చామని హనుమంతరావు వివరించారు.

 

>
మరిన్ని వార్తలు