సీతారాములకే శఠగోపం..?

30 Jun, 2017 03:10 IST|Sakshi

► మాయమైన ఆభరణాలు లభ్యం
► రాముడి ఆభరణాలు నృసింహుడి బీరువాలో ప్రత్యక్షం
► పరిపాలనా విభాగంలో మాయాజాలం
► నివ్వెరపోతున్న యంత్రాంగం
► ఉద్యోగి సస్పెన్షన్‌తో బయటపడ్డ వైనం


వేములవాడ: సీతారాములకే శఠగోపం పెట్టాలని చూశారు ఉద్యోగులు. తమ మొక్కులు తీరిన తర్వాత భక్తులు భక్తితో స్వామివారికి సమర్పించిన వెండి ఆభరణాలను చాకచక్యంగా కాజేయాలని యత్నించి పట్టుబడ్డ వైనం ఉద్యోగి సస్పెన్షన్‌తో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓదెలు కుటుంబసభ్యులతో కలసి వచ్చి మామిడిపల్లి సీతారామచంద్రస్వామివార్లకు వెండి ఆభరణాలు బహూకరించారు. అవి మాయం కావడంతో అక్కడ విధులు నిర్వహించే ప్రశాంత్‌బాబు అనే ఉద్యోగిని ఈనెల 25న సస్పెండ్‌ చేస్తూ ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ ఉత్తర్వులు వెలువరించారు.

ఈనెల 28లోగా సంజాయిషీ ఇవ్వకుంటే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో అసలు కథ బయటపడింది. ఆలయ పరిపాలనా విభాగం కార్యాలయంలోని నాంపల్లి నర్సింహాస్వామి ఆలయానికి చెందిన బీరువాలో మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారికి భక్తులు సమర్పించిన వెండి శంఖు, నామాలు రూ.50వేల విలువైన ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆలయ అధికారుల్లో తర్జనభర్జన మొదలైంది. రాజన్న ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్థానికంగా ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

అసలేం జరిగింది
వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారి ఆలయానికి హైదరాబాద్‌కు చెందిన ఓదెలు అనే భక్తులు ఇటీవలే వెండి శంఖు, నామాలతోపాటు కూడిన ఆభరణాలను బహూకరించారు. అయితే ఈ ఆభరణాలను సదరు ఉద్యోగి ప్రశాంత్‌బాబు ఆలయానికి అప్పగించకుండా కాలయాపన చేస్తున్నారు. ఈ క్రమంలో భక్తుడే స్వయంగా మరోసారి వేములవాడకు చేరుకుని తనకు రశీదు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఈ అంశం మరింత వెలుగుచూపింది. భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలను అప్పగించాలని, లేకుంటే క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామని ప్రశాంత్‌బాబును సస్పెండ్‌ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సీతారామచంద్రుడికి సంబంధించిన ఆభరణాలు నాంపల్లి లక్ష్మీనర్సింహుడి బీరువాలో బుధవారం ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆలయ అధికారులు కంగుతిన్నారు.

పరిపాలనా విభాగంలో మాయాజాలం
వేములవాడ రాజన్న ఆలయంతోపాటు అనుబంధ, దత్తత దేవాలయాలకు సంబంధించిన పరిపాలనా విభాగం ఆలయంలోని ప్రధాన కార్యాలయంలో జరుగుతుంటుంది. ఇందుకు సిబ్బంది, మందీమార్బలం అంతా ఉంటారు. ఇంతేకాకుండా ఇటీవలే ఈ కార్యాలయంలోకి వచ్చేవారి వివరాలు నమోదు చేసేందుకు రక్షణ సిబ్బందిని సైతం నియమించారు. ఇన్ని ఉన్నా రూ.50వేల విలువ చేసే వెండి ఆభరణాలను ఎవరు తీసుకొచ్చి నాంపల్లి నర్సింహాస్వామి దేవస్థానానికి చెందిన బీరువాలో పెట్టారన్నది ఆలయ ఉద్యోగుల్లో చర్చ సాగుతోంది. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ఈ ఆలయంలో ఇంతటి భద్రత లోపం జరుగుతుందంటూ స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి.

ఉద్యోగుల మధ్య లడాయి
మామిడిపల్లి సీతారామచంద్రస్వామివారి ఆలయంలో ఇటీవల ఉద్యోగుల బదాలాయింపు జరిగింది. దీంతో ఇరువురు ఉద్యోగుల మధ్య లడాయి జరగడం, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకోవడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో అసలు కథ బయటికి పొక్కింది.

ఆభరణాలు దొరికాయి
హైదరాబాద్‌కు చెందిన ఓదెలు అనే భక్తుడు సీతారామచంద్రస్వామికి బహూకరించిన వెండి ఆభరణాలు నాంపల్లి నర్సింహాస్వామి ఆలయానికి చెందిన బీరువాలో దొరికాయి. ఈ అంశంలో తనకు సైతం చార్జిమెమో ఇచ్చారు.
– గౌరీశంకర్, పర్యవేక్షకుడు 

మరిన్ని వార్తలు