వెబ్‌ల్యాండ్‌.. లోపాలపుట్ట

3 Sep, 2016 23:44 IST|Sakshi
వెబ్‌ల్యాండ్‌.. లోపాలపుట్ట
– వెబ్‌ల్యాండ్‌పై విరుచుకపడిన రైతులు, రైతు సంఘాల నేతలు
– పట్టాదారుపాసు పుస్తకాలను రద్దు చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
– 271 జీఓను రద్దు చేయాలని డిమాండ్‌
– సాక్షి అవగాహన సదస్సులో వక్తల వెల్లడి
   
కర్నూలు(అగ్రికల్చర్‌): ‘రెండు, మూడు తరాలుగా ఆస్తిగా వస్తున్న భూమిని కూడా మాదే అని నిరూపించుకోవాల్సిన దారుణ పరిస్థితి ఏర్పడింది. మా భూమిపై మాకే హక్కు లేకుండా చేస్తున్నారు. రైతులకు కష్టాలు తెచ్చి పెట్టే ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. వెబ్‌ల్యాండ్‌ పేరుతో రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. రైతుల పాలిట శాపంగా మారిన 271 జీవోను రద్దు చేయాల్సిందే’ అని ఉద్యోగులు, పలు సంఘాల నేతలు, రైతులు డిమాండ్‌ చేశారు. కర్నూలు రాజ్‌విహార్‌లోని అంబేడ్కర్‌ భవన్‌లో శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న వెబ్‌ల్యాండ్‌ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. కర్నూలు, కల్లూరు, పగిడ్యాల, మిడుతూరు, దేవనకొండ, గూడూరు తదితర మండలాల రైతులు పాల్గొని వారు ఎదుర్కొంటున్న వెబ్‌ల్యాండ్‌ సమస్యలపై గళమెత్తారు. తహసీల్దార్ల చేతుల్లో డిజిటల్‌ కీ ఉండటంతో వెబ్‌ల్యాండ్‌ అక్రమాలకు పాల్పడుతున్నారని, డిజిటల్‌ కీని జేసీ ఆధ్వర్యంలో ఉంచితే అక్రమాలను తగ్గే అవకాశముందని వక్తలు సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. వెబ్‌ల్యాండ్‌ సమస్యలను ఎలా పరిష్కరించాలి తదితర వాటికి కర్నూలు తహసీల్దారు రమేష్‌బాబు సూచనలు ఇచ్చారు. 271 జీవోతో సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం కూడా గుర్తించిందని త్వరలోనే జీఓను సవరించే అవకాశం ఉందని తెలిపారు. వేలాది మంది ఇబ్బందులు పడుతున్న వెబ్‌ల్యాండ్‌ సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ చొరవ తీసుకోవడంతో రైతులు, రైతు సంఘాల నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు. 
అవగాహన సదస్సులో వక్తల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
 
పాసుపుస్తకాల ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ చేయాలి: వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
వెబ్‌ల్యాండ్‌ రైతుల పాలిట శాపంగా మారింది. రాత్రికి రాత్రే ఒకరి పేరుమీద ఉన్న భూములు మరొకరిపేరుపై మారిపోతున్నాయి.  వెబ్‌ల్యాండ్‌లోని 1–బీ, అడంగల్‌ ఆధారంగానే భూములు రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పించడంతో భూములు తారుమారుతున్నాయి. ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగానే భూములు రిజిస్ట్రేషన్‌లు జరిగే విధంగా చూడాలి. 1915 నుంచి రిజిస్ట్రేషన్‌లు జరిగిన భూములను కూడా ప్రభుత్వ భూములుగా చూపడం దారుణం. వెబ్‌ల్యాండ్‌ సమస్యలపై రైతుల్లో అవగాహన కల్పిస్తాం.  
 
రీ సర్వేతో సమస్యకు పరిష్కారం: రమేష్‌బాబు తహసీల్దారు కర్నూలు
రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు పరిష్కారం కావాలంటే రీ సర్వే అవసరం. 1909లో బ్రిటీష్‌ వారు రూపొందించిన ఆర్‌ఎస్‌ఆర్‌పై ఇప్పటికి ఆధారపడుతున్నాం. రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని భూముల రీ సర్వే జరుగుతోంది. కర్నూలు మండలంలోని దేవమాడ గ్రామంలో కూడా రీ సర్వే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వేకు అవకాశం ఉంది. వెబ్‌ల్యాండ్‌లో ఎలాంటి సమస్య ఉన్నా మీసేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 271 జీఓతో సమస్యలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కూడా గుర్తించింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  
 
పారదర్శకత అంటే దోపిడీనే: రోషన్‌అలీ, రిటైర్డ్‌ తహశీల్దారు 
ఈ ప్రభుత్వంలో పారదర్శకత అంటే దోపిడీనే.  రైతులకు అన్యాయం చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. వెబ్‌ల్యాండ్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల భూములను దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెబ్‌ల్యాండ్‌ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేయాలి. రైతులు కూడావెబ్‌ల్యాండ్‌ సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. సాక్షి పత్రిక రైతుల పక్షాన నిలిచి రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం.   
 
సవరణకు చర్యలు తీసుకోవాలి: తిరుపతిరెడ్డి అపార్డ్‌ సంస్థ అధినేత 
సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన వెబ్‌ల్యాండ్‌ లోపాల పుట్టగా ఉంది. తప్పులు ఎవరు చేసినా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెబ్‌ ల్యాండ్‌లో జరిగిన తప్పుల సవరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ బాధ్యత తీసుకోవడం అభినందనీయం. వెబ్‌ల్యాండ్‌లో జరిగిన తప్పుల సవరణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు.  ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే గ్రామాల్లో జరిగే భూవివాదాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.  
 
రైతులకు కష్టాలు తెచ్చి పెట్టారు: సిద్ధారెడ్డి, భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేత 
 వెబ్‌ల్యాండ్‌ పేరుతో రైతులకు కష్టాలు తెచ్చే ప్రభుత్వాలు ఉండటం దురదష్టకరం. రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్‌లో పెట్టిన ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తోంది. అన్నిటికీ వెబ్‌ల్యాండ్‌నే ప్రామాణికం చేసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వెబ్‌ల్యాండ్‌లో రెవెన్యూలోని అన్ని స్థాయిల వారు ఎవరికి వారు అడ్డుగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి జిల్లాకు చెందినవారే అయినా వెబ్‌ల్యాండ్‌ సమస్యలపై చర్యలు తీసుకోవడం లేదు.  
    
పూర్వికుల డాక్యుమెంట్‌ ఎలా తేవాలి: కృష్ణ, కరివేముల, దేవనకొండ మండలం 
మాకు కరివేముల సర్వే నెంబర్‌ 68/3లో మూడు ఎకరాల భూమి ఉంది. మా నాయనకు జేజినాయన నుంచి సంక్రమించింది. ఈ భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదు. మీ సేవ కేంద్రం ద్వారా వందలసార్లు దరఖాస్తు చేశాను. డాక్యుమెంటు తీసుకురమ్మంటున్నారు. పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమికి డాక్యుమెంటు ఎలా తేవాలి. వెబ్‌ల్యాండ్‌ పేరుతో ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 
  
సొంత భూమిపై హక్కును కోల్పోవాల్సి వస్తోంది: పిట్టం ప్రతాప్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం ప్రతినిధి 
 వెబ్‌ల్యాండ్‌ కారణంగా మన భూములపై మనం హక్కులను కోల్పోయాం. వీఆర్వో రాసిందే రైతుల తలరాతగా మారిపోయింది. భూముల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టడంతో అరచేతిలో భూముల వివరాలను చూసుకోవచ్చు. వీఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది అడ్డుగోలుగా ఆన్‌లైన్‌లో మార్పులు చేస్తున్నారు. మన భూమి మనది అని నిరూపించుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోంది.  
  
271 జీవోను రద్దు చేయాలి: కొమ్ముపాలెం శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్‌ దళిత సమాఖ్య అధ్యక్షుడు 
ప్రభుత్వం తీసుకువచ్చిన 271 జీవో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ జీవోను తక్షణం రద్దు చేయాలి. తహసీల్దార్ల వద్ద ఉన్న డిజిటల్‌ కీని జేసీ ఆధ్వర్యంలో ఉంచాలి. హార్డ్‌ కాపీని తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. సర్వే రీసెటిల్‌మెంట్‌ చేయాలి. ఉమ్మడి భూమిని, ప్రతి సర్వే నెంబర్‌ను సబ్‌ డివిజన్‌ వేయాలి. 271 జీవోను రద్దు చేయకపోతే రైతుల భూములను ఎవరూ కాపాడలేరు. 
 
ప్రదక్షిణలు చేస్తున్నా: పి.మస్తాన్, పి.కోటకొండ, దేవనకొండ మండలం 
మా గ్రామంలోని 329 సర్వే నెంబర్‌లోని భూమి 88 సెంట్లను 1974లో కొన్నాము. దీనికి అడంగల్‌ 1బీ, పట్టాదారు పాసు పుస్తకం ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదు. అడిగిన అన్ని వివరాలు ఇస్తున్నా ఏదో కారణంతో సమస్యను సాగదీస్తున్నారు. ‘సాక్షి’ నిర్వహించిన సదస్సులో నా ఆందోళనను అందరి దష్టికి తెస్తున్నాను.
  
అధికారులకు దయ కలిగేదెప్పుడో: నరసింహారెడ్డి, కె.నాగలాపురం, గూడూరు మండలం 
 మాకు కె.నాగలాపురంలోని సర్వే నెంబర్‌ 52/3లో 88 సెంట్ల భూమి ఉంది. దీనిని ఆన్‌లైన్‌లో ఎక్కించడంలో అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నాలాగే వెబ్‌ల్యాండ్‌ సమస్యలు ఎదుర్కొనేవారు వందల మంది ఉన్నారు. ‘సాక్షి’ నిర్వహించిన అవగాహన సదస్సుతో సమస్యలను చెప్పుకునే అవకాశం లభించింది. ఇప్పటికైనా అధికారులకు దయ కలిగితే సంతోషం. 
   
చుక్కలు చూపిస్తున్నారు: టి.సోమన్న, ఎ.గోకులపాడు, కల్లూరు మండలం 
ఎ.గోకులపాడు గ్రామంలోని సర్వే నెంబర్‌ 60/5లో మూడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్‌ డీడ్‌ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చాం. కానీ ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదు. వెబ్‌ల్యాండ్‌తో ప్రభుత్వం సామాన్యులతో చెలగాటమాడుతోంది.      
 

 

మరిన్ని వార్తలు