అవసరం అధికం.. నగదు అల్పం

3 Dec, 2016 23:57 IST|Sakshi
అవసరం అధికం.. నగదు అల్పం
- అన్ని వర్గాల వారికి అవస్థలే
- ఆదివారం సెలవు కావడంతో శనివారం బ్యాంకులకు జనాల వెల్లువ
- జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు ఏ మూలకు సరిపోని వైనం
- ఖాతాల్లో నగదు నిల్వలు ఉన్నా.. తప్పని కష్టాలు
 
కర్నూలు(అగ్రికల్చర్‌): పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరతతో అల్లాడుతున్న వేతన జీవులకు డిసెంబర్‌ ఒకటో తేదీ మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నెల మొదటి వారం కావడంతో జనానికి నగదు అవసరాలు పెరిగాయి. జిల్లా  ప్రజల నుంచి కనీసం రూ. 400 కోట్ల మేరకు డిమాండ్‌ ఉండగా వచ్చింది కేవలం రూ.160 కోట్లు మాత్రమే. ప్రతి నెలా ఒకటి నుంచి ఐదారు తేదీల వరకు ఉద్యోగులకు మాత్రమే కాదు... అన్ని వర్గాల వారికి డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సెలవు కావడంతో శనివారం ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర అన్ని వర్గాల వారు బ్యాంకులకు పోటెత్తారు. ఈ క్రమంలో జిల్లాకు వచ్చిన రూ.160 కోట్లు ఏ మూలకూ సరిపోలేదు. ఆంధ్రబ్యాంకుకు రూ.100, ఎస్‌బీఐకి 60 కోట్లు రాగా ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా వివిధ బ్యాంకులకు పంపిణీ చేశారు. దీంతో ఆయా బ్యాంకుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు, ఇతర వర్గాల వారికి రూ.4వేల నుంచి రూ.10వేల వరకు అందించారు. తర్వాత నగదు కాస్త ఖాళీ కావడంతో ఎప్పటిలాగే మధ్యాహ్నం తర్వాత నో క్యాష్‌  బోర్డులు పెట్టారు. నగదు లేకపోవడం, ఉద్యోగులు, పింఛన్‌ దారులు పోటెత్తడంతో వారికి సమాధానం చెప్పలేక సిబ్బంది బ్యాంకులను మూసేస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో నగదు కొరత తీవ్రంగా ఉంది. గ్రామీణ ప్రజల ఖాతాలు అధికంగా వీటిలోనే ఉండడంతో బ్యాంకుల సిబ్బంది జనానికి సమాధానం చెప్పుకోలేక అల్లాడుతున్నారు. కలెక్టరేట్‌లోని ట్రెజరీ బ్రాంచికి ఉద్యోగులు, పెన్షన్‌ దారుల తాకిడి మరింత పెరగడంతో బయట ఉన్న ఏపీఎంఐపీ కార్యాలయం వరకు క్యూ కట్టారు. ఈ పరిస్థితి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఉండటం గమనార్హం. కొన్ని ఆంధ్రబ్యాంకు, ఎస్‌బీఐ ఏటీఎంలు మినహా దాదాపు అన్ని బ్యాంకుల ఏటీఎంలు మూత పడ్డాయి.  ప్రధాన బ్యాంకులు ఎస్‌బీఐ, ఆంధ్రబ్యాంకుల్లోనే నగదు లేక 90 శాతం ఏటీఎంలను మూసేశారు. కర్నూలులో పట్టుమని 10 ఏటీఎంలు కూడా పనిచేయకపోవడం, వాటి దగ్గర వందలాదిగా జనం క్యూకట్టడం నిత్యకృత్యమైంది. కర్నూలు ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచి దగ్గరి ఏటీఎంలో నగదు పెట్టడంతో అన్ని వర్గాల వారు అక్కడ పోటెత్తారు. పెట్టిన నగదు మధ్యాహ్నానికి ఖాళీ కావడంతో నిరాశకు గురయ్యారు.
ఖాతాల్లో నగదు నిల్వలున్నా... తీరని కష్టాలు....
ఉద్యోగులు, పెన్షనర్లు, ఎన్‌టీఆర్‌ బరోసా పింఛన్‌ దారులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారికి బ్యాంకుల్లో కు ఖాతాల్లో జీతాలు జమ చేశారు. బ్యాంకు ఖాతాల్లో నగదు నిల్వలున్నా కష్టాలు మాత్రం తీరడం లేదు. వారంలో రూ.24 వేలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంది.  డిమాండ్‌కు తగ్గట్టు నగదు సరఫరా చేస్తేనే ప్రజలకు ఇబ్బందులు తీరతాయి. 
 
>
మరిన్ని వార్తలు