లాటరీ..ఓ మిస్టరీ

27 Oct, 2016 23:53 IST|Sakshi

–మళ్లీ పుట్టుకొస్తున్న కంపెనీలు
–గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ
– తాడిపత్రి, కదిరి, ధర్మవరంలో కార్యకలాపాలు  
– ఆశ చూపి పేదలను ముంచుతున్న వైనం


అనంతపురం సెంట్రల్‌ : జిల్లాలో లాటరీ  మోసాలు మళ్లీ మొదలయ్యాయి. పేద ప్రజలకు ఆశ  చూపి నిలువునా ముంచేస్తున్నారు. ఏడాది క్రితం పోలీసులు ఉక్కుపాదం మోపి, జిల్లాలో లాటరీని పూర్తిగా నివారించారు. అయితే.. కొద్ది నెలలుగా మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కదిరి, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల్లో ఎక్కువగా సాగుతోంది. రకరకాల కంపెనీల పేర్లతో స్థానిక చోటామోటా నాయకులు లాటరీ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అధికార పార్టీ నేతల అండదండలు  కూడా ఉండడంతో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఒక్కో లాటరీ ప్రారంభించినప్పుడల్లా రూ. లక్షలు కొల్లగొడుతున్నారు. కార్లు, ద్విచక్రSవాహనాలు, బంగారు ఆభరణాలు,  ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఆశ చూపించి ప్రజలను వంచిస్తున్నారు. తాడిపత్రి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో గతంలో పదుల సంఖ్యలో ఉన్న కంపెనీలు తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. 3 వేల నుంచి 5 వేల మంది సభ్యుల లక్ష్యంగా లాటరీలను ప్రారంభిస్తున్నారు. వస్తువుల కోసం 50 శాతం దాకా ఖర్చు పెట్టి .. మిగిలిన మొత్తాన్ని వారి జోబుల్లో వేసుకుంటున్నారు. కొందరు  తమిళనాడు, కేరళ కంపెనీల పేరుతోనూ నిర్వహిస్తున్నారు.  లాటరీ తగిలితే భారీ మొత్తంలో డబ్బు వస్తుందన్న ఆశతో పేదలు కాయాకష్టం చేసి సంపాదించిన డబ్బంతా టికెట్ల కొనుగోలుకు తగలేస్తున్నారు.

అయితే.. నిర్వాహకులు ఈ టికెట్లను స్థానికంగానే తయారు చేస్తుండడంతో పాటు ఫలానా వారికి తగిలిందని ప్రచారం చేస్తూ ప్రజలను మోసగిస్తున్నట్లు తెలుస్తోంది. తాడిపత్రి ప్రాంతంలోని లాటరీ నిర్వాహకులు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో పోలీసుల నిఘా ఉండడంతో పొరుగు జిల్లాల్లో డ్రా తీస్తున్నారు. ఇందుకు రైల్వే కొండాపురం, పులివెందుల,  నంద్యాల ప్రాంతాలను వేదికగా చేసుకుంటున్నారు. డబ్బు చెల్లించిన ప్రజలను  డ్రా తీసే రోజున ఆ ప్రాంతాలకు రమ్మని సూచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు