లాటరీ ముఠా గుట్టు రట్టు

27 Sep, 2016 23:05 IST|Sakshi
నిందితులు, వాళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదును పరిశీలిస్తున్న ఎస్పీ శ్రీనివాస్, ఇతర అధికారులు
– జిల్లాలో 11 మంది అరెస్టు
– రూ.4 లక్షల నగదు, వస్తువుల సీజ్‌
– వివరాలు వెల్లడించిన ఎస్పీ శ్రీనివాస్‌
 
చిత్తూరు (అర్బన్‌): జిల్లాలో లాటరీ విక్రయాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టును రట్టు పోలీసులు చేశారు. ఈ వివరాలను చిత్తూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్‌ వెల్లడించారు. 11 మంది నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ.4,02,100 నగదును, అయిదు ద్విచక్ర వాహనాలు, ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ టీవీ, ప్రింటర్, 14 సెల్‌ఫోన్లు, లాటరీ టికెట్లను సీజ్‌ చేసినట్లు చెప్పారు. 
దాడులు ఇలా..
జిల్లాలో ఎప్పటి నుంచే లాటరీ టికెట్ల విక్రయాలపై నిషేధం ఉంది. అయితే తమిళనాడు నుంచి వచ్చి మదనపల్లెలో స్థిరపడ్డ దినేష్‌ కుమార్‌(32)అనే వ్యక్తి పలు చోట్ల ఏజెంట్లను నియమించుకుని లాటరీ టికెట్లను సొంతంగా ముద్రించి విక్రయిస్తున్నాడు. దీనిపై ఎస్పీ శ్రీనివాస్‌కు సమాచారం అందింది. లాటరీ విక్రయ నిందితులను పట్టుకోవడానికి ములకలచెరువు సీఐ ఎస్‌.రుషికేశవ్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం జిల్లాలోని బి.కొత్తకోట, వాయల్పాడు, ములకలచెరువు, పెద్దతిప్ప సముద్రం, చిత్తూరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఒక్క అంగళ్లు ప్రాంతంలోనే ఏడుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు.. 
పోలీసులు జరిపిన దాడుల్లో దినేష్‌కుమార్‌తో పాటు  పీటీఎంకు చెందిన అశోక్‌కుమార్‌ (51), మదనపల్లెకు చెందిన అనిల్‌కుమార్‌ (30), లాజర్‌ (38), వేమనారాయణ (38), సత్యమోహన్‌ (50), పఠాన్‌ సర్దార్‌ ఖాన్‌ (49), షేక్‌ రెడ్డిపీరా (40), వాయల్పాడుకు చెందిన సయ్యద్‌బాబు (40), షేక్‌ రహంతుల్లా (52), బి.కొత్తకోటకు చెందిన లవాణి షౌకత్‌ (40)ను పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది మందిని రెండు రోజుల క్రితం చిత్తూరు, మదనపల్లె ప్రాంతాల్లో అరెస్టు చూపించారు. ఇంకా నలుగురిని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.
ఇలా విక్రయాలు..
కేరళ, బోడోబాండ్‌ ప్రాంతాల్లో అమల్లో ఉన్న లాటరీ నంబర్లను అక్కడి నుంచి ఏజెంట్ల ద్వారా ఫోన్‌లో సేకరిస్తారు. ఈ నంబర్లను ముద్రించి జిల్లాతో పాటు గుంటూరు, విజయవాడ, నల్గొండ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఒక్కో టికెట్టు రూ.40 నుంచి రూ.500 వరకు ఉంటోంది. అప్పుడప్పుడు ప్రజలకు బహుమతులు వచ్చినట్ల నమ్మిస్తూ రూ.వెయ్యి నుంచి రూ.50 వేల వరకు ప్రైజ్‌ ఇస్తుంటారు. నిషేధిత లాటరీల ద్వారా జరిగే వ్యాపారం ఒక్క రోజుకు రూ.10 లక్షలు. కాగా నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన పోలీసు అధికారులు రుషికేశవ్, ఈశ్వరయ్య, నరేష్‌లతో పాటు సిబ్బందిని అభినందించిన ఎస్పీ, వాళ్లను నగదు రివార్డులు అందచేశారు. లాటరీ టికెట్ల విక్రయాలు జరిగితే 94407 96720, 94407 96700 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

 

మరిన్ని వార్తలు